ఇదేం వైపరీత్యం

ABN , First Publish Date - 2021-10-30T06:24:18+05:30 IST

విపరీత నిర్ణయాలతో విద్యాశాఖ అభాసుపాలవుతోంది. ఇప్పటికే ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసి ప్రభుత్వంలో కలిపేసుకునే విషయంలో రగడ నడుస్తోంది.

ఇదేం వైపరీత్యం

ప్రాథమిక పాఠశాలల విలీనంపై ఆగ్రహావేశాలు  

కొత్త విధానం వద్దు.. పాతదే కావాలి 

విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన

228 స్కూళ్ల మూతకు రంగం సిద్ధం

హైస్కూళ్లకు 20వేలమంది కొత్త విద్యార్థులు

నవంబరు 1 నుంచి మార్పు అమలు

విపరీత నిర్ణయాలతో విద్యాశాఖ అభాసుపాలవుతోంది. ఇప్పటికే ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసి ప్రభుత్వంలో కలిపేసుకునే విషయంలో రగడ నడుస్తోంది. తాజాగా ప్రాథమిక పాఠశాలల విలీనం అంటూ మరో రచ్చ మొదలైంది. కొత్త విద్యా విధానం పేరుతో ప్రైమరీ విద్యను హైస్కూళ్లలో కలపడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 3, 4, 5 తరగతుల పిల్లలను ఇక నుంచి ఉన్నత పాఠశాలలకు పంపాల్సిందే. లాభనష్టాలు, విద్యార్థుల సాధకబాధలను పక్కనపెట్టి కనీస అధ్యయనం  కూడా చేయకుండా కీలక నిర్ణయం తీసేసుకున్నారు. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ కసరత్తు కూడా పూర్తిచేసినట్లు ప్రకటించింది. వచ్చేనెల 1 నుంచి మార్పు అమల్లోకి వస్తుందని చెప్తోంది.  అయితే అందుకుతగ్గ వసతులు హైస్కూళ్లలో ఉన్నాయా.. అంటే అదీ లేదు. దీనిపై  ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డ్రాప్‌ అవుట్లు పెరుగుతాయని భయపడుతున్నారు.  అలాగే అసంబద్ధ నిర్ణయంపై తల్లిదండ్రులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. 

ఒంగోలు విద్య, అక్టోబరు 29: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రాథమిక స్కూళ్లను విలీనం చేసేందుకు సర్కారు చేస్తున్న కసరత్తుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో చదువు తున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను హైస్కూళ్లలో విలీనం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అటు ఉపాధ్యాయులు, ఇటు తల్లిదండ్రు లు భగ్గుమంటున్నారు. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని వారు ఆరోపిస్తున్నారు.  3, 4, 5 తరగతుల విద్యార్థులు నగరాల్లో ట్రాఫిక్‌ చిక్కుముడిని తప్పించుకొని ఉన్నత పాఠశాలలకు చేరుకోవాలంటే గగనమవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు కూడా చిన్నపిల్లలు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక పాఠశాలలను యథాతఽథంగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. 


కొలిక్కి వచ్చిన కసరత్తు 

కేంద్రప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త విద్యావిధానం అమలుకు జిల్లా విశ్యాశాఖ చేస్తున్న కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ప్రా థమిక పాఠశాలల్లో మూడు, నాలుగు, ఐదు తరగ తు లు చదువుతున్న విద్యార్థులను కూడా ఉన్నత పాఠశా లలకు పంపించి అక్కడ వారికి కూడా సబ్జెక్టు టీచర్ల తో బోధన చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా లోని 278 పాఠశాలల్లో 3,4,5 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలల బాట పట్టాల్సిన పరిస్థి తి వచ్చింది. దీనికి అనుగుణంగా అవసరమైన మేరకు ఉపాధ్యాయులను నియామకం, అదనపు తరగతి గదుల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 


228 హైస్కూళ్లలో నూతన విద్యావిధానం 

కేంద్రప్రభుత్వం రూపొందించిన నూతన విద్యా విధానం జిల్లాలోని 228 ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో అమలుకానుంది. ఈ మూడు యాజమాన్యాల్లో జిల్లాలో మొత్తం 377 హైస్కూళ్లు ఉన్నాయి. ప్రస్తుతం 228 హైస్కూళ్లకే నూతన విధా నాన్ని పరిమితం చేశారు. నదులు, జాతీయ రహదా రులు, రైల్వేట్రాక్‌లు, కొండలు, వాగులు, వంకలు, ఇతర భౌగోళిక అవరోధాలు ఉన్న పాఠశాలలను మినహా యించారు. హైసూళ్లకు కేవలం 250మీటర్లలోపు ఉన్న పాఠశాలలను మాత్రమే ప్రస్తుతం విలీనం చేస్తున్నా రు. మొత్తం 278 ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగ తులు చదువుతున్న 20వేల మంది విద్యార్థులను హై స్కూళ్లకు పంపుతున్నారు. హైస్కూలు ఆవరణలోనే ఉన్న 64 ప్రాథమిక  పాఠశాలలు, హైస్కూళ్లను ఆనుకుని 40, 50మీటర్ల పరిధిలోని 22, 100 మీటర్ల పరిధిలోని 21, 150 మీటర్ల పరిధిలో 19, 200 మీటర్ల పరిధిలో 30, 250 మీటర్ల పరిధిలో 82 సూళ్ల నుంచి విద్యార్థులను హైస్కూళ్లకు బదిలీ చేస్తున్నారు. 


అవసరమైన మేరకు టీచర్లు 

విలీనం తర్వాత 3, 4, 5 తరగతులు బోధించేందుకు అవసరమైన మేరకు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌ టీచర్లను, హెచ్‌ఎం లను హైస్కూళ్లకు కేటాయించనున్నారు. ప్రతి 30మంది విద్యార్థులకు ఒక టీచర్‌ కేటాయింపు జరగ నుంది. హైస్కూళ్లలో విలీనం అవుతున్న స్కూళ్లలో ప్రస్తుతం 803 మంది ఎస్జీటీలు, 91 మంది ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, 29 మంది ఉర్దూ టీచర్లు పని చేస్తున్నారు. వీరిలో అవసరమున్న మేరకు హైస్కూళ్లకు కేటాయించనున్నారు. 



Updated Date - 2021-10-30T06:24:18+05:30 IST