ఇది అధికార దుర్వినియోగమే

ABN , First Publish Date - 2021-06-16T08:11:39+05:30 IST

మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా సంచయిత గజపతిరాజును నియమించే విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ట్రస్ట్‌ చైర్మన్‌ను నియమించే క్రమంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ జీవోలు జారీ చేసిందని...

ఇది అధికార దుర్వినియోగమే

చట్ట నిబంధనలకు విరుద్ధంగా జీవోలు జారీ 

సంచయిత నియామకంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు న్యాయమూర్తి 

మాన్సాస్‌ ట్రస్ట్‌, సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును తక్షణం పునరుద్ధరించాలని తీర్పు 


అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా సంచయిత గజపతిరాజును నియమించే విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ట్రస్ట్‌ చైర్మన్‌ను నియమించే క్రమంలో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తూ జీవోలు జారీ చేసిందని... ప్రతీ దశలోనూ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని పేర్కొం ది. ఈ నేపథ్యంలో సంబంధిత జీవోలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సంచయిత గజపతిరాజును చైర్మన్‌ స్థానంలో కూర్చోబెట్టేందుకే ప్రభుత్వం జీవోలు తెచ్చినట్లు అర్థమవుతోందని తెలిపింది. ఈ క్రమంలో ప్రభుత్వం, అధికారుల చేతుల్లో ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్‌ పావులుగా మారారని పేర్కొంది. మాన్సాస్‌ ట్రస్ట్‌తో పాటు సింహాచలం దేవస్థానం చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును తక్షణం పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. దీనిపై జస్టిస్‌ ఎం.వెంకటరమణ సోమవారం తీర్పు ఇవ్వగా... ఆ కాపీ మంగళవారం అందుబాటులోకి వచ్చింది. 


తీర్పులో న్యాయమూర్తి ఏమన్నారంటే...

‘సంచయిత గజపతిరాజుతో పాటు మరో ఇద్దరిని వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గుర్తిస్తూ, ట్రస్ట్‌ చైర్మన్‌గా నియమిస్తూ.. గతేడాది మార్చి 3న ప్రభుత్వం జీవో జారీ చేసేనాటికి అశోక్‌ గజపతిరాజుకు వ్యవస్థాపక కుటుంబ సభ్యునిగా గుర్తింపు ఉంది. పీవీజీ రాజు రెండో కుమారుడిగా వరుస క్రమంలో అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ చైౖర్మన్‌గా నియమితులయ్యారు. ట్రస్టీ షిప్‌ ఖాళీగా ఉన్నప్పుడే చైర్మన్‌ను నియమించాలని దేవదాయ శాఖ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అశోక్‌ గజపతిరాజు స్థానంలో సంచయిత గజపతిరాజును నియమించడానికి గల కారణాలను ప్రభుత్వం జీవోలో పొందుపర్చలేదు. చాలాకాలంగా చైర్మన్‌గా ఉన్నారనే విషయాన్నే పేర్కొన్నారు. ఆ కారణంతో అశోక్‌ గజపతిరాజును తొలగించడానికి వీల్లేదు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన హక్కులపై తీవ్ర ప్రభావం పడింది. అశోక్‌ గజపతిరాజును అనవసరంగా ఈ వివాదంలోకి లాగినందుకు ప్రతివాదుల నుంచి ఆయన ఖర్చులు పొందేందుకు ఇదితగిన కేసు. ఖర్చులు చెల్లించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొననందున ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. అశోక్‌ గజపతిరాజు దేవదాయ శాఖ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలన్న ప్రభుత్వ వాదన సరికాదు’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Updated Date - 2021-06-16T08:11:39+05:30 IST