Advertisement

ఇదేం బరితెగింపు!

Jul 26 2020 @ 02:09AM

కేసీఆర్‌ పాలన ఆరేళ్లు గడిచినా ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోయారు. కరోనా బారినపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు పరుగులు పెట్టినట్టు? కరోనా సోకితే ఎంతటి వాళ్లయినా గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సిందే అన్న కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయి? హైదరాబాద్‌ వంటి మహా నగరంలో కరోనా కేసులు మినహా మిగతా జబ్బులకు చికిత్స అందించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు ప్రవహిస్తేగానీ ప్రభుత్వం మేల్కొనలేదు. అదేమంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లే ఉస్మానియాకు నూతన భవనాలు నిర్మించలేకపోయామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని, సచివాలయం భవనాల కూల్చివేతలను విరమించుకోలేదే! ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రి కోసం 25 అంతస్థులతో కూడిన ట్విన్‌ టవర్స్‌ను ఏడాదిలో నిర్మిస్తామని చెబుతున్నారు. మంచిదే.. ఏడాదిలో పూర్తిచేస్తామని ప్రకటించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను అయిదేళ్లు గడిచినా పూర్తిచేయలేకపోవడం నిజం కాదా?


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కంటే ముందే ప్రతిపక్షాలు, మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి అనుసరించిన విధానాన్ని కేసీఆర్‌ మరింత విస్తృత ప్రాతిపదికన తెలంగాణలో సెంటిమెంట్‌ కూడా జోడించి అమలు చేశారు. న్యాయస్థానాలపై దాడికి రాజశేఖర్‌రెడ్డి మరీ ఇంత బాహాటంగా పూనుకోలేదు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల అధినేతలైన కేసీఆర్‌, జగన్‌రెడ్డి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. దీనికితోడు పార్టీలో వారికి అడ్డుచెప్పేవారు లేకుండా పోయారు. ఈ కారణంగా ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను ఈ ఇరువురు ముఖ్యమంత్రులూ మర్చిపోయారు. ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. కరోనా విషయంలో గానీ, మరో విషయంలో గానీ కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే  హైకోర్టు ధర్మాసనం మాత్రం ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విషయంలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఉంటే సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సిన పరిస్థితి జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఎదురయ్యేది కాదు కదా!


‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరుగుతోంది? హైకోర్టు తీర్పు అమలుకు కూడా గవర్నర్‌ జోక్యం చేసుకోవాలా?’’.. జగన్‌ రెడ్డి ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ధర్మాగ్రహం ఇది. ‘‘కరోనా వైరస్‌ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలను గాలికొదిలేసింది. ఇలాగైతే అధికారులు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది’’.. ఇది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం! న్యాయస్థానాలు ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నందుకు ప్రభుత్వాలు సిగ్గుపడాలి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఏమిటి? కోర్టు తీర్పులను, ఆదేశాలను అమలుచేయవలసిన ప్రభుత్వాలు ఆ పని చేయకపోగా.. ఎదురుదాడికి దిగుతున్నాయి. ప్రజలు మాకు అధికారమిచ్చారు అని చెప్పి, రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడడానికి కూడా జగన్‌ రెడ్డి, కేసీఆర్‌ ప్రభుత్వాలు వెనుకాడడం లేదు. ప్రాంతీయ పార్టీల నాయకులలో ఇటువంటి పోకడలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు ఇటువంటి దుందుడుకు ధోరణికి తెగబడుతున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వద్దాం. న్యాయ వ్యవస్థతో ఘర్షణకు దిగడాన్ని ఒక సాహస కృత్యంగా జగన్‌ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నది.


స్థానిక సంస్థల ఎన్నికలను తమకు చెప్పాపెట్టకుండా వాయిదా వేశారన్న కోపంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను పదవీచ్యుతుడిని చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చింది. దీనిపై రమేశ్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ చెల్లదని, ఎన్నికల కమిషనర్‌ను రాష్ట్ర ప్రభుత్వం అర్ధంతరంగా తొలగించడం కుదరదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడం కుదరదు అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయినా హైకోర్టు తీర్పు ప్రకారం రమేశ్‌ కుమార్‌ను ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించడానికి జగన్‌ రెడ్డి ప్రభుత్వం ఇష్టపడలేదు. ఫలితంగా తీర్పు అమలు కోసం రమేశ్‌కుమార్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ కూడా వేశారు. తీర్పును అమలు చేయాలని గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేసుకోవాల్సిందిగా రమేశ్‌కుమార్‌ను హైకోర్టు ఆదేశించింది. దీనిపై ఆయన గవర్నర్‌ను కలవడం, హైకోర్టు తీర్పు ప్రకారం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం వెంటవెంటనే జరిగాయి. జగన్‌ స్థానంలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ దశలో హైకోర్టు తీర్పును అమలుచేసి ఉండేవారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘అంతా మా ఇష్టం’ అన్నట్టుగా భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు ఆ పనిచేయకపోగా రమేశ్‌కుమార్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై స్టే ఇవ్వవలసిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగానే సర్వోన్నత న్యాయస్థానం జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక సామాజిక వర్గంపై కోపంతో రమేశ్‌కుమార్‌ అనే ఒక వ్యక్తిపై జగన్‌ ప్రభుత్వం వివాదాన్ని సాగదీసి సుప్రీం కోర్టుతో చివాట్లు తింది. ఇంత జరిగిన తర్వాత కూడా హైకోర్టు తీర్పును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లుగా లేదు.


విశ్వసనీయతపై గురి!

రాజ్యాంగ, న్యాయ వ్యవస్థలతో బుద్ధిగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు ఇలా తెగబడితే ఏం జరుగుతుంది? రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుంది. అదే జరిగితే అధికారులు చిక్కుల్లో పడడమే కాకుండా జగన్‌ రెడ్డి అధికారానికి ముప్పు ఏర్పడుతుంది. అయినా జగన్‌ అండ్‌ కో ఇవేమీ పట్టించుకోకుండా న్యాయ వ్యవస్థపై ఎదురుదాడికి దిగుతోంది. రమేశ్‌కుమార్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు సోషల్‌ మీడియా వేదికగా న్యాయమూర్తులపై అసాధారణ రీతిలో దాడి చేశారు. ప్రజలకు మంచి చేయాలి అనుకుంటే కోర్టులు అడ్డుపడుతున్నాయని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిబంధనలు, చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణంగా వ్యవహరించినప్పుడు ఏ న్యాయస్థానం కూడా ఏ ప్రభుత్వానికీ అడ్డు రాదు. ఈఎస్‌ఐ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఏడు వారాలు దాటినా హైకోర్టు బెయిల్‌ ఇవ్వకపోవడాన్ని గమనించాలి. అరెస్టయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కొడుకుదీ అదే పరిస్థితి. హత్యారోపణలపై అరెస్టయిన మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా జైల్లోనే ఉన్నారు కదా! జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు హేతుబద్ధంగా లేనప్పుడు మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటున్నాయి.


ప్రజలకు మంచి చేయాలనుకోవడం వేరు. అందుకు అనుసరించే విధానం వేరు. పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో జరుగుతున్నది ఏమిటి? భూసేకరణ పేరిట అధికార పార్టీకి చెందినవారు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారు. తాము చెప్పినట్టు చేయడానికి ముందుకురాని నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను హఠాత్తుగా బదిలీ చేయలేదా? ఈ వ్యవహారంలో అవకతవకలు జరుగుతున్నాయి కనుకే వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. తన తప్పులను సరిదిద్దుకోకుండా రాష్ట్రంలో దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారు అని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి నిందించడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధుల కోసం ప్రభుత్వ భూములను వేలం వేయాలనుకోవడాన్ని ఏ న్యాయస్థానమైనా ఆక్షేపించకుండా ఎందుకు ఉంటుంది? అమరావతిలో 1,600 ఎకరాలను వేలం వేయబోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమాన్ని పట్టించుకోకుండా ఎవడబ్బ సొమ్మని రైతులు ఇచ్చిన భూములను జగన్‌ రెడ్డి ప్రభుత్వం విక్రయించాలనుకుంటోంది? ఇటువంటి చర్యలను తప్పుబట్టడానికే న్యాయస్థానాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఒక న్యాయవాదిని అర్ధరాత్రి అక్రమంగా నిర్బంధిస్తే హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేయడం సహజం. ఇలా చేయడం ప్రజలకు మేలు చేయకుండా అడ్డుకోవడం ఎలా అవుతుంది? ఈ సందర్భంగా జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యల వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ప్రమోటీ ఐపీఎస్‌ అధికారుల సంఘం రాష్ట్ర డీజీపీకి శుక్రవారంనాడు వినతిపత్రం ఇచ్చింది. న్యాయ వ్యవస్థపై ఎదురుదాడి చేయడానికి లేదా న్యాయ వ్యవస్థను ఆత్మరక్షణలో నెట్టడానికే అప్పటివరకు ఉనికిలో లేని ప్రమోటీ ఐపీఎస్‌ అధికారుల సంఘాన్ని సృష్టించారు. ప్రతిపక్షాలు అవినీతి, అక్రమాలకు సంబంధించి ఆరోపణలు చేసినప్పుడు వారికి విశ్వసనీయత లేదన్నారు. మీడియాలో వార్తలు వస్తే వాటికి రంగులు అద్ది విశ్వసనీయత దెబ్బతీస్తారు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. న్యాయస్థానాలలో వ్యతిరేక తీర్పులు వచ్చినప్పుడు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఇతర నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఉన్మత్త ప్రేలాపనలను గుర్తుకుతెస్తున్నాయి.


అబద్ధాలతో కాలక్షేపం!

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జనం పిట్టల్లా రాలిపోతున్నారు. కరోనా వ్యాధి బారినపడినవారికి సరైన చికిత్స అందించే పరిస్థితి రాష్ట్రంలో ఇప్పటికీ లేదు. కరోనా బారిన పడిన ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఎంపీ విజయసాయిరెడ్డి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు పరిగెత్తారు. వారు హైదరాబాద్‌కు పరిగెత్తుకు వచ్చారంటే అది రాష్ట్రానికి అవమానం కాదా? తిరుపతిలో పూజారులకు వైరస్‌ సోకితే వారిని చెన్నై తరలించారు. అధికార పార్టీ ముఖ్యులందరూ పొరుగు రాష్ట్రాలకు క్యూ కడుతున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యకర పరిస్థితి ఏం ఉంటుంది? జగన్‌ ప్రభుత్వానికి ఇవేమీ పట్టవు. తాను అనుకున్నది జరిగి తీరాలనుకోవడం తప్ప! ‘అలా చేయడం తప్పు. చట్టాన్ని, నిబంధనలను పాటించండి’ అని చెబుతున్నవారిపై దుష్టులుగా ముద్ర వేస్తున్నారు. జగన్‌ అండ్‌ కో చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని మొదట్లో ప్రజలు నమ్మితే నమ్మవచ్చుగాని కరోనా వైరస్‌ను అరికట్టే విషయంలోనే కాకుండా చికిత్స అందించే విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు బాగానే అర్థం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి ఇప్పుడు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మోడల్‌ను ఆయన అనుసరిస్తున్నారు. దళితులపై జరుగుతున్న దాడులనే తీసుకుందాం. అధికారంలోకి వచ్చిన కొత్తలో దళితులను అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై అట్రాసిటీ కేసులు పెట్టించారు. దీనితో దళితులు అమాయకంగా ప్రభుత్వం తమదేనని భావించారు. గ్రామాల్లో దళితుల పెత్తనాన్ని సహించలేని శక్తులు ఇప్పుడు ప్రభుత్వ అండతో దళితులపై దాడులు చేస్తున్నాయి. తమ సిఫారసులతో నియమితులైన పోలీసుల ద్వారా దళిత యువకుడికి శిరోముండనం చేయించారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఏకంగా ఓ దళిత యువకుడిని కొట్టించి చంపారు. దీనితో జగన్‌ రెడ్డి ప్రభుత్వ స్వభావం ఏంటో అర్థం అవ్వాల్సిన వారికి అర్థం అవుతోంది. పోలీసులపై ఆధారపడి రాజ్యం చేయాలనుకున్నవారెవరూ బాగుపడినట్టు దాఖలాలు లేవు. పోలీసులను అతిగా వినియోగిస్తే మొదటికే మోసం వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. పోలీసు అధికారులు తరచుగా హైకోర్టుకు వెళ్లి సంజాయిషీ ఇచ్చుకోవాల్సి రావడం జగన్‌ ప్రభుత్వానికి అప్రతిష్ఠే కదా! హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టులో కూడా తరచుగా చీవాట్లు తినడం ప్రభుత్వానికే కాదు.. రాష్ట్రానికి కూడా అవమానమే! ఒకప్పుడు బిహార్‌ తదితర రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఇప్పుడు వాటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ చేరింది. ఈ దుస్థితి వచ్చినందుకు రాష్ట్ర ప్రజలందరూ సామూహికంగా సిగ్గు పడాల్సిందే. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించని పక్షంలో కోర్టు ధిక్కరణ కింద శిక్ష అనుభవించడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది.


ఆరేళ్లలో ఏం మారినట్టు?

న్యాయ వ్యవస్థపై జగన్‌ అండ్‌ కో నేరుగా ఎదురుదాడికి దిగుతూ ఉండగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పుడిప్పుడే అదే బాటలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని, అధికారులు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారని, ఇలాగైతే ఉద్యోగాలు పోతాయని రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఇటీవల ధర్మాగ్రహం వ్యక్తంచేసింది. హైకోర్టు పదే పదే జోక్యం చేసుకున్న తర్వాతే కరోనా పరీక్షల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. రాష్ట్ర ప్రజలను తెలంగాణ ప్రభుత్వం గాలికి వదిలేసిందని హైకోర్టు వ్యాఖ్యానించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ హడావుడిగా అధికారులతో సమావేశం నిర్వహించారు. వైరస్‌ను అరికట్టడానికి నాటి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ, హైకోర్టు వ్యాఖ్యల పట్ల అధికారులు నొచ్చుకుంటున్నారని, వారి మనోభావాలు దెబ్బతింటున్నాయని, చీటికిమాటికీ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడినట్లుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. డజన్లకొద్దీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు అనుమతిస్తోందని పరోక్షంగా తప్పుబట్టారు. విధాన నిర్ణయాలలో కూడా న్యాయస్థానం జోక్యం చేసుకుంటోందన్న ప్రచారాన్ని కూడా చేపట్టారు. హైకోర్టు ఆక్షేపించినట్టుగా తెలంగాణలో తక్కువ సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం వాస్తవం కాదా? కరోనా కేసుల సంఖ్యను, మరణాలను తెలంగాణ ప్రభుత్వమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా తక్కువ చేసి చూపిస్తున్నదన్న అభిప్రాయం వైద్య వర్గాల్లోనే బలంగా ఉంది. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికే ఆదర్శమని కేసీఆర్‌ అండ్‌ కో చెప్పుకొంటూ వచ్చింది కదా! కరోనా పరీక్షల విషయంలో కూడా ప్రపంచం సంగతి దేవుడెరుగు.. దేశానికి ఆదర్శంగా ఎందుకు నిలవలేకపోయారో చెప్పి, ఆ తర్వాత న్యాయస్థానాలను ఆక్షేపిస్తే బావుంటుంది. కరోనాను కట్టడి చేయడంలో అమెరికా వంటి దేశాలే విఫలమైనప్పుడు మనమెంత అనేట్టుగా మంత్రులు ప్రకటనలు చేశారు. అలాంటప్పుడు ప్రపంచానికే తెలంగాణ ఆదర్శమని ఎందుకు ప్రకటించారో సంజాయిషీ ఇవ్వాలి. నాలుగు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి పది మందితో పొగిడించుకున్నంత మాత్రాన ప్రపంచానికే ఆదర్శమైపోరు. వైద్య రంగమే తీసుకుందాం. కేసీఆర్‌ పాలన ఆరేళ్లు గడిచినా ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు విశ్వాసం కల్పించలేకపోయారు. కరోనా బారినపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు ఆస్పత్రులకు ఎందుకు పరుగులు పెట్టినట్టు? కరోనా సోకితే ఎంతటి వాళ్లయినా గాంధీ ఆస్పత్రికి వెళ్లాల్సిందే అన్న కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయి? హైదరాబాద్‌ వంటి మహా నగరంలో కరోనా కేసులు మినహా మిగతా జబ్బులకు చికిత్స అందించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉస్మానియా ఆస్పత్రిలోకి వరద నీరు ప్రవహిస్తేగానీ ప్రభుత్వం మేల్కొనలేదు. అదేమంటే ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్లే ఉస్మానియాకు నూతన భవనాలు నిర్మించలేకపోయామని చెబుతున్నారు. ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని, సచివాలయం భవనాల కూల్చివేతలను విరమించుకోలేదే! విధాన నిర్ణయాలలో కోర్టుల జోక్యం తగదంటూ సుప్రీంకోర్టుకు వెళ్లి మరీ అనుమతి పొందారు కదా! ఇప్పుడు ఉస్మానియా ఆస్పత్రి కోసం 25 అంతస్థులతో కూడిన ట్విన్‌ టవర్స్‌ను ఏడాదిలో నిర్మిస్తామని చెబుతున్నారు. మంచిదే.. ఏడాదిలో పూర్తిచేస్తామని ప్రకటించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను అయిదేళ్లు గడిచినా పూర్తిచేయలేకపోవడం నిజం కాదా? కేసీఆర్‌ ప్రకటించినవన్నీ ఆచరణకు నోచుకుని ఉంటే హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా టవర్లే కనిపించేవి. పాతబస్తీ ఇస్తాంబుల్‌ అయ్యుండేది. కరీంనగర్‌ లండన్‌ను తలపించేది. స్వరాష్ట్రంలో ఆరేళ్లు గడిచినా ప్రభుత్వాసుపత్రులలో మౌలిక వసతులు కల్పించలేకపోయారు. ఫలితంగా కరోనా బారిన పడుతున్నవారు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరీ ప్రైవేట్‌ వైద్యం చేయించుకుంటున్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరా కూడా సక్రమంగా లేకపోవడంతో మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి అంశాలను లేవనెత్తితే ప్రతిపక్షాలను సన్నాసులు అని తిట్టిపోస్తున్నారు. హైకోర్టు ఆక్షేపిస్తే అధికారులు నొచ్చుకుంటున్నారని అంటారు. మరి ప్రజల బాధలను ఎవరు పట్టించుకోవాలి?


ఒకరికొకరు ఆదర్శం!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కంటే ముందే ప్రతిపక్షాలు, మీడియా విశ్వసనీయతను దెబ్బతీసే కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి అనుసరించిన విధానాన్ని కేసీఆర్‌ మరింత విస్తృత ప్రాతిపదికన తెలంగాణలో సెంటిమెంట్‌ కూడా జోడించి అమలు చేశారు. న్యాయస్థానాలపై దాడికి రాజశేఖర్‌రెడ్డి మరీ ఇంత బాహాటంగా పూనుకోలేదు. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నందున ఆ పని చేయలేకపోయి ఉండవచ్చు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీల అధినేతలైన కేసీఆర్‌, జగన్‌రెడ్డి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. దీనికితోడు పార్టీలో వారికి అడ్డుచెప్పేవారు లేకుండా పోయారు. ఈ కారణంగా ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలను ఈ ఇరువురు ముఖ్యమంత్రులూ మర్చిపోయారు. ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని విస్మరిస్తున్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు కావాల్సినంత మెజారిటీని ప్రజలు సమకూర్చినప్పటికీ కాంగ్రెస్‌ వాళ్లను చేర్చుకుని ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా మిగలకుండా చేశారు. ఇప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా లేకుండా చేయడానికి జగన్‌ రెడ్డి నడుంబిగించారు. ఇలాంటి అనైతిక విషయాల్లో మాత్రం ఒకరికొకరు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్థానిక సంస్థలన్నింటినీ గులాబీ జెండా ఖాతాలో కేసీఆర్‌ వేసుకున్న తీరు చూసిన జగన్‌రెడ్డి, తన రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థలన్నింటినీ కైవసం చేసుకోవాలనుకున్నారు. ఎన్నికలు వాయిదా పడటంతో అది జరగలేదు. దీనితో రమేశ్‌కుమార్‌పై కక్ష పెంచుకుని కోర్టు ధిక్కరణకు పాల్పడటానికి కూడా వెనుకాడటం లేదు. అయినా స్థానిక సంస్థల్లో జెండా ఎగురవేయడానికి ముఖ్యమంత్రులు ఎందుకు ఇంత ఆరాటపడతారో అర్థం కాదు. స్థానిక సంస్థలు అన్నీ తమ చేతిలో ఉన్నంత మాత్రాన తదుపరి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుస్తుందని గ్యారంటీ ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికలకు ముందు స్థానిక సంస్థలన్నీ తెలుగుదేశం అధీనంలోనే ఉండేవి. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని నిలువరించలేకపోయారు కదా! ఇంతోటి దానికి అంతలా ఆరాటపడటం ఎందుకంటే సమాధానం దొరకదు. అనుమతించిన పద్ధతులలో ఎన్నికలను గెలవడం వేరు, అక్రమంగా సొంతం చేసుకోవడం వేరు. ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరిస్తే కోర్టులు అడ్డుచెప్పలేవు. కరోనా విషయంలో గానీ, మరో విషయంలో గానీ కేసీఆర్‌ ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే హైకోర్టు ధర్మాసనం మాత్రం ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తుంది? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విషయంలో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఉంటే సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని కూడా చవిచూడాల్సిన పరిస్థితి జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఎదురయ్యేది కాదు కదా! ప్రభుత్వం ఎన్ని పర్యాయాలు విజ్ఞప్తి చేసినా కనీసం స్టే ఇవ్వడానికి కూడా సుప్రీం నిరాకరిస్తున్నదంటే తమ తప్పు ఏమిటో తెలుసుకోకుండా సమస్యను ఇంకా సాగదీస్తూ తలంటిపోయించుకున్నది జగన్‌రెడ్డే. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి సీనియర్‌ అడ్వకేట్లను నియమించుకున్నప్పటికీ కేసులో పస లేనప్పుడు ఏ న్యాయస్థానంలో కూడా ఉపశమనం లభించదు. ఇరువురు ముఖ్యమంత్రులూ ఇప్పటికైనా అడ్డుచెప్పిన వారిపై ఎదురుదాడి చేసే బదులు ఆత్మపరిశీలన చేసుకోవడం మంచిది!


ఆర్కే


 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.