NATOపై జెలెన్‌స్కీ మండిపాటు..

ABN , First Publish Date - 2022-03-05T19:01:56+05:30 IST

నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)పై ఉక్రెయిన్

NATOపై జెలెన్‌స్కీ మండిపాటు..

కీవ్ : నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)పై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ మండిపడ్డారు. ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ప్రకటించాలని తాను చేసిన విజ్ఞప్తినిNATO తోసిపుచ్చడం తమ దేశంపై మరిన్ని బాంబు దాడులకు అవకాశం ఇవ్వమేనని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ టెలివైజ్డ్ ప్రసంగాన్ని విడుదల చేశారు. 


NATO నిర్ణయం వల్ల ఉక్రెయిన్ నగరాలు, గ్రామాలపై మరిన్ని బాంబులు వేసే విధంగా రష్యాకు పచ్చ జెండా ఊపినట్లయిందని జెలెన్‌స్కీ చెప్పారు. NATO సదస్సు జరిగిందని, ఇది చాలా బలహీనమైన సమావేశమని, అయోమయంతో కూడిన సమావేశమని మండిపడ్డారు. యూరోపు స్వేచ్ఛ మొట్టమొదటి లక్ష్యం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని, అలా జరగడం లేదనే విషయం స్పష్టమైందని చెప్పారు. NATO నాయకత్వం ఉక్రెయిన్‌పై నో-ఫ్లై జోన్‌ను ప్రకటించడానికి తిరస్కరిస్తూ, తమ దేశంపై మరిన్ని బాంబులు వేసే విధంగా రష్యాకు పచ్చ జెండా ఊపిందన్నారు. 


అమెరికా నేతృత్వంలోని NATO శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తిని తిరస్కరించింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ, సభ్య దేశాల భూభాగంలోని ప్రతి అంగుళాన్నీ NATO కాపాడుతుందని చెప్పారు. అయితే ఈ కూటమి రక్షణాత్మకంగా పని చేస్తోందన్నారు. తమది రక్షణాత్మక కూటమి అని, ఘర్షణను కోరుకోవడం లేదని తెలిపారు. తమ వరకు ఘర్షణ వస్తే, తాము ప్రతిస్పందించడానికి సిద్ధమేనని చెప్పారు. 


నో-ఫ్లై జోన్‌ను ఏర్పాటు చేయడం వల్ల శత్రు దేశాల దాడుల నుంచి కాపాడుకోవడానికి వీలవుతుంది. నో-ఫ్లై జోన్ అమల్లోకి వస్తే, దానిని అమలు చేస్తున్న దేశం లేదా కూటమి ఆ గగనతలంలోకి వచ్చే శత్రు దేశాల విమానాలను కూల్చేయడానికి వీలవుతుంది. 


Updated Date - 2022-03-05T19:01:56+05:30 IST