
ఇప్పుడు నడుస్తోన్న సోషల్ మీడియా యుగంలో అంతా నెట్టే! ఇంటర్నెట్ జోరులో మన సెలబ్రిటీలు తమ నెట్ ఇన్కమ్ పెంచేసుకుంటున్నారు! ఒక్కో ఇన్స్టాగ్రామ్ పోస్టుకి కొందరు సెలబ్స్ తీసుకునే ఫీజు ఎంతో తెలిస్తే మనం తప్పక ఆశ్చర్యపోతాం!

ఫోర్బ్స్ వారి జాబితాలో ‘రిచ్చెస్ట్ ఇన్స్స్టాగ్రామర్‘గా చోటు సంపాదించింది ప్రియాంక చోప్రా. అందుక్కారణం ఆమెకున్న 68 మిలియన్ మంది ఫాలోయర్సే. వారి కారణంగానే ఆమెకు కార్పొరేట్ కంపెనీలు ఒక్కో పోస్టుకి 1.80 కోట్లు చెల్లించుకుంటాయి! ఒకప్పటి మన దేసీగాళ్ ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదగటంతో ఆమె డిమాండ్ మరింత పెరిగింది...

ఆలియా చేత ఏదైనా బ్రాండ్ తమ ప్రచారం చేయించుకోవాలంటే... ఒక కోటి రూపాయలు చదివించుకోవాల్సిందే! బాలీవుడ్లో నంబర్ వన్‌గా దూసుకుపోతోన్న మిస్ ఆలియాకు ఇన్‌స్టాలో 55 మిలియన్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు...

ఈ తరం హీరోలు, హీరోయిన్స్ కంటే కింగ్ ఖాన్ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్ తక్కువనే చెప్పాలి. ఆయనకు ఉన్నది 26 మిలియన్లే అయినా, ఒక్కో పోస్టుకి, కోటి దాకా వసూలు చేస్తుంటాడట!

బిగ్ బి... బిగ్ స్క్రీన్‌పైన ఇప్పటికీ బిగ్ ఐకానే! కానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఆయన 50 లక్షల మార్కు వద్ద ఉన్నారు. 28 మిలియన్ల ఫాలోయర్స్‌తో, ఏదైనా స్పాన్సర్డ్ పోస్ట్ పెట్టాలంటే, ఆయన అరకోటికి తగ్గకుండా ఛార్జ్ చేస్తారట...

బాలీవుడ్, క్రికెట్ రంగాల్లో పవర్ కపుల్ అనుష్కా శర్మ, విరాట్ కోహ్లీ. వీరిద్దరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌స్టాంట్‌గా ఇన్కమ్ రాబట్టేస్తుంటారు. మిసెస్ కోహ్లీ ఒక్కో పోస్టుకి 95 లక్షలకు పైగా వసూలు చేస్తుందట. ఆమె ఫాలోయర్ల సంఖ్య 52 మిలియన్లు. మరి టీమిండియా కెప్టెన్ సంగతి? ఆయన ఇన్స్టాగ్రామ్ రీచ్ బీభత్సంగా ఉంటుంది. 157 మిలియన్ల మంది ప్రస్తుతం విరాట్ వెంట ఉన్నారు! అందుకే, 1.35 కోట్లు కనీసం తీసుకుంటాడట, ఒక్కో పోస్టుకి...

రణవీర్, దీపికా పదుకొణే కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ పెయిర్! రణవీర్ 36 మిలియన్ల మంది ఫాలోయర్స్‌తో దాదాపు 82 లక్షల వరకూ ఒక్కో పోస్టుకి ఛార్జ్ చేస్తాడు. కాగా సూపర్ స్టార్ దీపూ మాత్రం మంచి ఊపులో ఉంది. 60 మిలియన్ మార్క్ దాటేసిన ఆమె ఫాలోయర్స్ లిస్ట్... ఈజీగా ఒకటిన్నర కోటి సంపాదించి పెడుతుంటుంది!

బాలీవుడ్లో ఇన్‌స్టా పోస్టుకి కోటికి పైగా ఫీజు తీసుకునే క్రేజీ స్టార్స్‌లో అక్షయ్ కుమార్, కరీనా కపూర్‌ని కూడా తప్పక చెప్పుకోవాలి. ఖిలాడీ స్టార్ అనుచర గణం 54 మిలియన్లు కాగా బెబో ఫాలోయర్స్ 7 మిలియన్లు మాత్రమే! అయినా కూడా కరీనా కోటి నుంచీ దిగి రావటం లేదట!

ఇక సల్మాన్, కత్రీనా జంట కూడా తమ తమ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో లక్షలు కొల్లగొడుతున్నారు. సల్మాన్ ఒక్కో పోస్టుకి 85 లక్షల వరకూ తీసుకుంటాడట. భాయ్‌జాన్ ‘ఏక్ థా టైగర్’ కోస్టార్ కత్రీనా 97 లక్షల నుంచీ కోటి వరకూ వసూలు చేస్తుందని ముంబై టాక్...

‘సాహో’ సుందరి శ్రద్ధా కూడా ఇన్ స్టా రేసులో జోరుగా దూసుకుపోతోంది. ఆమె ఫాలోయర్స్ 66 మిలియన్లు కాగా ఒక్కో స్పాన్సర్డ్ పోస్టు విలువ కోటి ఇరవై లక్షలకు పైమాటే!