ఈ మహమ్మారిని... ఇలా భరించాలి..!

ABN , First Publish Date - 2020-06-09T16:51:36+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఆందోళన పరుస్తున్న ‘కొవిడ్‌-19’ ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేం! అయితే కరోనా వైరస్‌ కొత్తగా వచ్చింది. కనుక దీనికి సంబంధించిన

ఈ మహమ్మారిని... ఇలా భరించాలి..!

ఆంధ్రజ్యోతి (09-06-2020): ప్రపంచవ్యాప్తంగా మానవాళిని ఆందోళన పరుస్తున్న ‘కొవిడ్‌-19’ ఇంకా ఎంతకాలం ఉంటుందో చెప్పలేం! అయితే కరోనా వైరస్‌ కొత్తగా వచ్చింది. కనుక దీనికి సంబంధించిన సామూహిక వ్యాధి నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) ఏర్పడమే దీనికి పరిష్కారం! 


హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటే...

సమాజంలో డెబ్భై శాతం మంది వ్యక్తులకూ, సమూహాలకూ ఒక వ్యాధి సోకితే, దాని వల్ల సామూహిక వ్యాధినిరోధకశక్తి రావచ్చన్నది ఒక సిద్ధాంతం. మన చుట్టూ ఉన్న, ఇంతకు ముందు వ్యాధి సోకి కోలుకున్న వ్యక్తులకు వ్యాధినిరోధకశక్తి వస్తే... ఆ వ్యాధి నుంచి సమాజం కోలుకుంటుందన్నమాట! ఇది జరగడానికి వారాలూ, నెలలూ... ఇంకా ఎక్కువ కాలం కూడా పట్టవచ్చు. 


కరోనా ప్రభావం ఎలా ఉంటోంది? 

కరోనా వైరస్‌ సోకిన వారిలో ఎనభై శాతం మంది కొద్ది లక్షణాలతోనే కోలుకుంటారు. పదిహేను శాతం మందికి జ్వరం, దగ్గు లాంటి లక్షణాలతో కరోనా బయటపడి, చికిత్సతో తగ్గిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే మిగిలిన 5 శాతం మందిలో (వయోధికులు, మధుమేహం, గుండె జబ్బు, అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు) శ్వాస అందకపోవడం, న్యుమోనియా,  ఎక్యూట్‌ రెస్పిరేటరీ డిస్‌ట్రేస్‌ సిండ్రోమ్‌ తదితర సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందే పరిస్థితి ఏర్పడవచ్చు. తగిన చికిత్స పొందినా కొద్దిమంది (3.4 శాతం మంది) మరణించవచ్చు.


ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సమతులాహారం, తగిన నిద్ర, వ్యాయామం, మానసిక ప్రశాంతత.. ఇవన్నీ రోగ నిరోధకశక్తిని పెంచేవే! రాబోయే నెలల్లో కనీసం మూడు అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయకూడదు. మాస్కులు ధరించకుండా తుమ్మడం, దగ్గడం చేయకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తేనే మనల్ని మనం రక్షించుకోగలం!


ఎన్నింటినో జయిస్తూ వచ్చాం!

గతంలో వైరస్‌లూ, వ్యాధులూ మానవాళిని కల్లోలపరచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని కనుమరుగైపోయాయి కూడా!


2009 నుంచి 2017 వరకూ స్వైన్‌ ఫ్లూ ప్రతి సంవత్సరం మన దేశంలోకి వస్తూనే ఉంది.


మనకు కరోనా వైరస్‌లు కొత్తవి కావు. ‘సార్స్‌ కరోనా’ వైరస్‌ వ్యాధి 2002లో చైనాలో ప్రారంభమై, ఇతర దేశాలకు వ్యాపించింది. దాదాపు ఎనిమిది వేల మంది దీని బారిన పడ్డారు. 774 మంది మరణించారు.


2012-13 సంవత్సరాల్లో ‘మెర్స్‌-కోవ్‌’ అనే మరో కొత్త కరోనా వైరస్‌ వ్యాధి అరేబియాలో మొదలై, మధ్య ప్రాచ్యం, ఇతర దేశాలకు వ్యాపించింది. వందల మందిని న్యుమోనియా సమస్యలతో బాధించింది.


-డాక్టర్‌ పాటిబండ్ల దక్షిణామూర్తి ఫిజీషియన్‌, తెనాలి

Updated Date - 2020-06-09T16:51:36+05:30 IST