జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశం ఇదే

ABN , First Publish Date - 2021-12-12T17:53:22+05:30 IST

తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్

జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశం ఇదే

న్యూఢిల్లీ : తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ చిట్ట చివరి సందేశాన్ని స్వర్ణిమ్ విజయ్ పర్వ్‌ సందర్భంగా వినిపించారు. డిసెంబరు 7న రికార్డు చేసిన ఈ సందేశంలో భారత దేశంలోని సాయుధ దళాల సైనికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. 1971వ సంవత్సరంలో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయం సాధించినందుకు విజయోత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. ఈ యుద్ధంలో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని తెలిపారు. డిసెంబరు 12 నుంచి 14 వరకు ఇండియా గేట్ వద్ద అనేక కార్యక్రమాలు జరుగుతాయని, ఇది చాలా గొప్ప విషయమని తెలిపారు. మన సైనిక బలగాలు మనకు గర్వకారణమని, అందరం కలిసి విజయోత్సవాలను జరుపుకుందామని పిలుపునిచ్చారు. 


1971లో పాకిస్థాన్‌పై యుద్ధంలో భారత దేశ సైన్యం, నావికా దళం, వాయు సేన ఉపయోగించిన ఆయుధాలు దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శన శాలల్లో ఉన్నాయి. వీటిని న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్దకు తీసుకొచ్చి డిసెంబరు 12 నుంచి 14 వరకు ప్రదర్శిస్తారు. ఈ ఆయుధాలను ఉపయోగించి పాకిస్థాన్‌ను ఓడించడంతోపాటు, బంగ్లాదేశ్‌కు విముక్తి కల్పించారు. స్వర్ణిమ్ విజయ్ పర్వ్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ప్రారంభించారు. 


1971లో జరిగిన ముఖ్యమైన యుద్ధ సంఘటనల గురించి ఈ ఉత్సవాల్లో ప్రజలకు దృశ్య, శ్రవణ విధానంలో వివరిస్తారు. ఈ ఉత్సవాల్లో సుమారు 40 మంది యుద్ధ వీరులు పాల్గొంటారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ‘బుక్‌మైషో’ యాప్ ద్వారా రిజిస్టర్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి. 


తమిళనాడులోని ఓ మిలిటరీ కాలేజీకి వెళ్తుండగా జనరల్ రావత్, ఆయన సతీమణి మధులిక ప్రయాణించిన హెలికాప్టర్ డిసెంబరు 8న కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో వీరిద్దరితో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు చికిత్స పొందుతున్నారు.


Updated Date - 2021-12-12T17:53:22+05:30 IST