ప్రతిరోజూ వాడిది యిదే వరస

ABN , First Publish Date - 2021-01-25T06:14:37+05:30 IST

ప్రతిరోజూ వాడిది యిదే వరస చీకటి చిక్కబడిందంటే చాలు ఎక్కడ్నుంచో తటాల్న ఊడిపడతాడు...

ప్రతిరోజూ వాడిది యిదే వరస

ప్రతిరోజూ వాడిది యిదే వరస

చీకటి చిక్కబడిందంటే చాలు

ఎక్కడ్నుంచో తటాల్న ఊడిపడతాడు

లాకులు మూసిన కాలవలో

బడిపిల్లాడు చెడ్డీ విప్పి గబుక్కున దుంకినట్లు

నాలోపల దభేల్న మునుగుతాడు

కూలగొట్టిన యింటి శకలాల్లో జ్ఞాపకాలను వెతుక్కుంటున్నట్లు

నాలోపల బిగిసిపోయిన స్మృతులను మెత్తగా తడుముతుంటాడు

రైలెళ్ళిపోయిన తర్వాత-

పట్టాల మీద తను పెట్టిన అయిదు పైసల నాణెం కోసం

ఆశగా చూసినట్లు

దేనికోసమో రాత్రంతా ఆబగా దేవుళ్ళాడుతూ

నిద్రను నిర్దాక్షిణ్యంగా చిట్లగొడుతుంటాడు.

స్కూల్లో ముందు బెంచీలో దిలాసాగా కూర్చుని

మాస్టారడిగే పాఠాల్లోని ప్రశ్నలకు జవాబివ్వటానికి

నేనంటూ ఉరికిన ఉత్సాహపు నివురుని

ఉఫ్‌ అని ఊదుతూ రవ్వల్ని రెచ్చగొడుతుంటాడు

అప్పుడెప్పుడో కాలేజీలో పారేసుకున్న వైప్లవ్యాన్ని

పేజీలకొద్దీ రాల్చుకున్న అక్షరాల మంకెన పువ్వులని

ఆర్తితో నిమురుతూ కన్నీరు కారుస్తుంటాడు.

నాలో తూనీగల్ని ఎగరేయటానికి

మిణుగురులను వెలిగించటానికి

భయం బండల క్రింద

చితికిపోతున్న కప్పల ఆక్రందనలను బిగ్గరగా స్వరిస్తూంటాడు

నాలో ఘనీభవించిన నిర్లిప్తతను

రాత్రంతా మోదుతూ గట్టిగా శబ్దిస్తూంటాడు.

తెల్లారగానే ఎరుపెక్కిన కళ్ళతో చటుక్కున మాయమౌతాడు.

ప్రతిరోజూ వాడిది యిదే వరస!!!

నందిరాజు విజయ్‌ కుమార్‌

95027 60757


Updated Date - 2021-01-25T06:14:37+05:30 IST