Advertisement

50 లక్షలు దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇది

Sep 16 2020 @ 01:52AM

19 రోజుల్లోనే 20 వేల మంది మృతి.. ఈనెలలోనే 15 వేలు

‘బురద’ స్నానం ఎంపీ సుఖ్‌బీర్‌ సింగ్‌కు వైరస్‌


న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: దేశంలో కరోనా కేసులు మంగళవారం రాత్రికి 50 లక్షలకు చేరాయి. ఉదయం  8 గంటల వరకు కేసుల సంఖ్య 49.30 లక్షలు కాగా..  రాత్రికి 70 వేల కేసులు పెరిగాయి. మరోవైపు గడిచిన 24 గంటల్లో 83,809 మందికి వైరస్‌ సోకిందని, 1,054 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

సోమవారం 10.72 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. పరీక్షల సంఖ్య భారీగానే ఉన్నా.. పాజిటివ్‌లు 84 వేలలోపే (7.8 శాతం) వచ్చాయి. ఇది క్రితం రోజు కంటే 8 వేలు తక్కువ. అంతకుముందు ఐదు రోజుల పాటు 90 వేలపైగా కేసులు నమోదయ్యాయి. కాగా, దేశంలో కరోనా మరణాలు 80 వేలు దాటాయి. ఇందులో 20 వేల మరణాలు గత 19 రోజుల్లోనే చోటుచేసుకున్నాయి. 


ఈ నెలలో ప్రతి రోజూ వెయ్యిపైనే రికార్డయ్యాయి. కేవలం 14 రోజుల్లోనే వైర్‌సతో 15,400 మంది ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూకు మంగళవారం కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఐదు రోజుల పాటు 22 వేలపైనే పాజిటివ్‌లు వచ్చిన మహారాష్ట్రలో తాజాగా 17 వేల మంది మాత్రమే వైర్‌సకు గురయ్యారు. గత 13 రోజుల్లో ఇదే అత్యల్పం. కాగా, కరోనా కేసుల్లో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్న రష్యా (10.70 లక్షలు)ను మహారాష్ట్ర (10.80 లక్షలు) దాటేసింది.


బురద స్నానం చేయాలని, శంఖం పూరించాలని తద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా సోకదని వ్యాఖ్యానించిన రాజస్థాన్‌లోని టోంక్‌-సవాయ్‌ మధోపూర్‌ ఎంపీ సుఖ్‌బీర్‌ సింగ్‌ జౌనాపురియా (బీజేపీ) వైరస్‌ బారినపడ్డారు.  

 దేశంలో రికవరీల సంఖ్య 38.50 లక్షలు దాటిందని.. జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. అత్యధిక సంఖ్య మరణాలు సంభవించిన యూరప్‌ దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని.. ప్రభావవంతమైన లాక్‌డౌన్‌తో మరణాలు గణనీయంగా తగ్గించామని ఐసీఎంఆర్‌ డీజీ డాక్టర్‌ బలరాం భార్గవ తెలిపారు. దేశంలో వైరస్‌ రీ ఇన్ఫెక్షన్‌కు అవకాశాలు చాలాచాలా తక్కువని అన్నారు. అయితే, పూర్తిగా కొట్టివేయలేమని చెప్పారు.  ‘సురక్షిత దూరం’ సరైన పదం: వెంకయ్య


కరోనా వ్యాప్తి నిరోధంలో ‘సామాజిక దూరం’ పదం వినియోగం సరికాదని.. వైరస్‌ బాధితులు, వారి కుటుంబాల పట్ల ఇది వివక్షకు దారితీస్తుందంటూ మంగళవారం రాజ్యసభలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ శంతను సేన్‌ ప్రస్తావించారు. దీనిని భౌతిక దూరం (ఫిజికల్‌ డిస్టెన్స్‌)గా వ్యవహరించాలని కోరారు. రాజ్యసభ చైర్మన్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇందుకు అంగీకరిస్తూనే.. సురక్షిత దూరం (సేఫ్‌ డిస్టెన్స్‌) పదం సరైనదని సూచించారు.


Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.