చెన్నైలో వందేళ్ళలో ఇలా జరగడం మూడోసారి

ABN , First Publish Date - 2021-11-28T20:04:54+05:30 IST

ఈశాన్య రుతుపవనాలు తమిళనాడును అతలాకుతలం

చెన్నైలో వందేళ్ళలో ఇలా జరగడం మూడోసారి

చెన్నై : ఈశాన్య రుతుపవనాలు తమిళనాడును అతలాకుతలం చేస్తున్నాయి. ఈ సీజన్‌లో శనివారం నాటికి 75 శాతం అధిక వర్షపాతం నమోదైంది. చెన్నైలో 100 సెంటీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. ఈ నగరంలో నవంబరులో ఇంత అధిక వర్షపాతం నమోదుకావడం సుమారు వందేళ్ళలో మూడోసారి. ఈ నగరంలో ఈశాన్య రుతుపవనాల కాలంలో నమోదయ్యే సాధారణ వర్షపాతం 87 సెంటీమీటర్లు. 


నవంబరు 29 వరకు తమిళనాడు కోస్తా తీరంలో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని 123 శిబిరాల్లో ఉంచారు. చెంగల్‌పేట, కాంచీపురంలలో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) బృందాలను మోహరించారు. చెన్నైతోపాటు ఆ నగర శివారు ప్రాంతాలు వరుసగా రెండో రోజు జలమయం అయ్యాయి. జీఎస్‌టీ రోడ్డు, తాంబరం-శ్రీపెరంబుదూర్ రోడ్డు ధ్వంసమైంది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా టీ నగర్‌లోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ఇక్కడి నీటిని వేగంగా తోడెయ్యాలని అధికారులను ఆదేశించారు. నగరంలోని రిజర్వాయర్ల నుంచి 8,500 క్యూసెక్కులకుపైగా నీటిని విడుదల చేశారు. సేలం జిల్లాలోని మెట్టూరు ఆనకట్ట నుంచి సుమారు 23,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 


చెన్నైలోని వాతావరణ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఆదివారం తర్వాత క్రమంగా వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత కొద్ది రోజులపాటు పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు. 


Updated Date - 2021-11-28T20:04:54+05:30 IST