
పెద్ద పెద్ద ప్రమాదాలు తృటిలో తప్పిపోయిన సందర్భాలు చాలా చూశాం. ఒక్కోసారి చిన్న సాయం కూడా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టగలదు. అలాంటి సందర్భాల్లోనే ‘‘సమయానికి దేవుడిలా వచ్చారు’’.. అని అంటూ ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళ పొలంలో పనులు చేసుకుంటూ ఉంది. పక్కనే రైల్వే ట్రాక్‌పై పట్టాలు విరిగిపోయి ఉన్నాయి. మరోవైపు రైలు దూసుకొస్తోంది. సరిగ్గా అప్పుడే ఓ మహిళ విరిగిన పట్టాలను గమనించింది. క్షణం ఆలస్యం చేయకుండా ఆమె చేసిన పని.. అందరితో శభాష్ అనిపించేలా చేసింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎటా జిల్లాలోని అవఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా గులేరియా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓంవతి అనే మహిళ గురువారం ఉదయం 8గంటల సమయంలో తన ఇంటి సమీపంలోని పొలాల్లో పని చేస్తూ ఉంది. అదే సమయంలో సమీపంలోనే రైల్వే ట్రాక్‌పై పట్టాలు విరిగిపోయి ఉన్నాయి. అటుగా వెళ్లిన మహిళ విరిగిన పట్టాలను గమనించింది. ఆమెకు రైళ్ల రాకపోకలపై అవగాహన ఉండడంతో కాసేపట్లో ఎటా-తుండ్ల ప్యాసింజర్ రైలు వస్తుందని గ్రహించింది. క్షణం ఆలోచించకుండా ట్రాక్‌కు రెండు వైపులా కర్రలు పాతి, వాటిపై తన ఎరుపు రంగు చీరను వేసింది.
దూరం నుంచి చీరను గమనించిన రైలు డ్రైవర్.. అప్రమత్తమై బ్రేకులు వేశాడు. రైలు దిగి వచ్చి, విరిగిన ట్రాక్ చూసి అంతా షాక్ అయ్యారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు అంతా ఊపిరి పీల్చుకున్నారు. సరైన సమయానికి స్పందించి, వందల మంది ప్రాణాలను కాపాడిన మహిళను అంతా ప్రశంసలతో ముంచెత్తారు. రైల్వే ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పట్టాలకు మరమ్మతులు చేసి, గంట తర్వాత రాకపోకలను పునరుద్ధరించారు. ఈ వార్త స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి