యుద్ధ శిఖరం నేలవాలింది ఇక్కడే

ABN , First Publish Date - 2022-07-07T05:52:15+05:30 IST

రాజ్యస్థాపనతోపాటు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న మహారాణి.. రాణి రుద్రమదేవి.

యుద్ధ శిఖరం నేలవాలింది ఇక్కడే
చందుపట్లలోని రాణిరుద్రమ దేవి కాంస్య విగ్రహం

జిల్లానుంచే వార్త వెలుగులోకి 

 కాకతీయ వైభవ సప్తాహం నేపథ్యంలో ప్రాధాన్యం 

ఈనెల 12న చందుపట్లలో సభ 

రాజ్యస్థాపనతోపాటు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న మహారాణి.. రాణి రుద్రమదేవి. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి, తెలుగునాడును ఏకం చేసి పాలన కొనసాగించి, సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించి, సుభిక్ష పాలన అందించిన కాకతీయ గజకేసరి. చరిత్రలో తనకంటూ సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఓరుగల్లు నుంచి కృష్ణాజిల్లా కంచి వరకు 200 ఏళ్లపాటు పరిపాలించిన కాకతీయ వంశంలో 27 ఏళ్లపాటు సుదీర్ఘంగా పరిపాలించిన రుద్రమదేవి చివరికి 1289, నవంబరు 27న చందుపట్లలో మరణించినట్లు ‘చందుపట్ల శాసనం’ పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ను జిల్లాలోనూ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి-నల్లగొండ

తెలంగాణ పునర్నిర్మాణంలో సాంస్కృతిక పునరుజ్జీవం ప్రధానమైందని, కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం భావితరాలకు తెలిపేలా ‘కాకతీయ వైభవ సప్తాహం’ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. కాకతీయ వైభవంపై ప్రత్యేక పోస్టల్‌ స్టాంప్‌ విడుదలకు చర్యలు తీసుకుంటోంది. వరంగల్‌ వేదికగా ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కాకతీయ వైభవ సప్తాహం కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కాకతీయ వంశంలో కీలక మలుపు నల్లగొండ జిల్లాలో వెలుగు చూడడంతో ఇక్కడ కూడా సభను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 12న నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం చందుపట్లలో సభను నిర్వహించనున్నారు. సభకు మంత్రి జగదీష్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సభతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. కలెక్టర్‌ రాహుల్‌శర్మ బుధవారం సాయంత్రం చందుపట్ల సందర్శించి రుద్రమదేవి విగ్రహాన్ని పరిశీలించి వైభవ సప్తాహం విజయవంతానికి సూచనలు చేశారు. 


మరణ వార్త వెలుగులోకి వచ్చిందిలా

కాకతీయ వంశంలో ప్రసిద్ధిగాంచిన రాణిరుద్రమదేవి మరణ వార్త చాలాకాలం మిస్టరీగానే మిగిలింది. నల్లగొండ జిల్లా చందుపట్లలో శిలాశాసనం వెలుగు చూడకముందు ఆమె 1295 వరకు బతికే ఉందని రాసేవారు. అయితే 1960లో చందుపట్ల గ్రామానికి చెందిన ఇంగ్లీష్‌ రిటైర్డు ప్రొఫెసర్‌ లక్ష్మణమూర్తి, ఆయన సోదరుడు పాలెం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన రంగాచారిలు మొదట ఈ శాసనాన్ని గుర్తించారు. ‘మా ఊరి బయట అర్థంకాని శాసనం ఉంది, దానిని బయటకి తీస్తే వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంది’ అని ఆనాడు భారతి అనే పత్రికకు లేఖ రాయగా అది ప్రచురణకు నోచలేదు. ఆ తర్వాత ఈ విషయాన్ని నిర్ధారించాలంటూ భూగర్భశాస్త్రవేత్తల పేరిట ప్రభుత్వానికి లేఖరాశారు. భూగర్భశాస్త్రానికి ఈ విషయం సంబంధం లేకపోవడంతో అది మరుగునపడింది. ఆ తర్వాత వాస్తవాన్ని గుర్తించి 1970లో రంగాచారి ఆర్కియాలజి (పురావస్తుశాఖ)కు లేఖ రాయగా, నాటి ఏడీ పరబ్రహ్మశాస్త్రి చందుపట్లకు చేరుకుని శాసనాన్ని చదివి వెళ్లిపోయారు. విషయాన్ని ఆయన వెంటనే బయట పెట్టలేదు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో రెండు సెమినార్లలో ఈ శాసనం గురించి ప్రచురితంకావడంతో సెఫిగ్రాఫ్‌ ఇండికా అనే మ్యాగజైన్‌లో ప్రచురితం కావడంతో భారతి పత్రికలో విషయాన్ని ప్రచురించారు. రాణిరుద్రమదేవి, ఆమె సర్వసేనాని మల్లికార్జుననాయుడు శివలోక ప్రాప్తి పొందారని, ఆ మహానుభావుల శివైఖ్యానికి గుర్తుగా చందుపట్ల సోమనాథ దేవర వెనుక మామిడితోట భూదానం చేస్తున్నట్లు కాకతీయుల బంటు (సేనాని) పువ్వుల ముమ్మడి వేయించిన శాసనంలో పేర్కొన్నారు. ఈ పువ్వుల ముమ్మడి చందుపట్ల గ్రామానికి చెందిన వారు. ఎవరైనా చనిపోతే వారి పేరిట పదో రోజు దానధర్మాలు చేస్తారు. ఆ క్రమంలో రాణి రుద్రమదేవి, ఆమె సర్వసైన్యాధికారి మల్లికార్జుననాయుడు 1289 నవంబరు 27న చనిపోయినట్లు శాసనంలో వెలుగుచూసింది. రాజు, సర్వసైన్యాధికారి ఒకేసారి చనిపోయారంటే అది యుద్ధంలో లేదా యుద్ధం జరుగుతున్న సందర్భంలో ముమ్మరంగా జరిగే ఏర్పాట్ల క్రమంలో వారు మరణించినట్లు నిర్దారణకు వచ్చారు. ఈ శాసనం వెలుగు చూడకముందు రాణిరుద్రమ మృతికి సంబంధించి అనేక ప్రచారాలు ఉండేవి. కుట్రలో భాగంగా ప్రాణాలు కోల్పోయిందా? అన్న సందేహాలు ఉండేవి. ఈ శిలాశాసనానికి సంబంధించిన వివరాలు అధికారికంగా 1970లో వెలుగుచూశాయి. పువ్వుల ముమ్మడి వేయించిన శాసనం 13వ శతాబ్దం తెలుగు భాష లిపిలో ఉంది. ఈ శాసన విశేషం వెలుగు చూసిన తర్వాత దానిని భద్రపరుస్తూ ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగు భాషలోనూ అనువదించి శిలాఫలకం ఏర్పాటు చేశారు.






రాణిరుద్రమ మరణం ధృవపడింది :  సూర్యకుమార్‌, చరిత్రకారుడు 

చందుపట్ల శిలాశాసనం ద్వారా రాణిరుద్రమదేవి మరణానికి సంబంధించిన స్పష్టమైన నిర్ధారణ లభించింది. శిలాశాసనాల్లో ఉన్న విషయాల్లో ఎలాంటి అవాస్తవాలు, కల్పితాలు ఉండవనేవి పురావస్తుశాఖ నిర్దారణ. 1970లో ఈ శాసనం ప్రాముఖ్యత వెలుగులోకి వచ్చినా, ఆ తర్వాత అంతా వదిలేశారు. శాసనంలోని విషయాన్ని మేము తాజాగా తెలుగులోకి అనువదించాం. ఆ తర్వాత గ్రామానికి చెందిన వివేకానంద యువజన సంఘం, ఇతరుల చేయూతతో వృద్ధిలోకి వచ్చింది.                            

Updated Date - 2022-07-07T05:52:15+05:30 IST