ఇంత నిర్లక్ష్యమేల?

ABN , First Publish Date - 2022-05-28T07:10:53+05:30 IST

ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ భవనాలను నిర్మించింది. కానీ వాటి లక్ష్యం నెరవేరలేదు. ఏళ్లు గడుస్తున్నా అధికారులు వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదీ పి.గన్నవరం ఇరిగేషన్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని సిబ్బంది క్వార్టర్ల పరిస్థితి.

ఇంత నిర్లక్ష్యమేల?
పి.గన్నవరం సబ్‌ డివిజన్‌ కార్యాలయం వెనుక నిరుపయోగంగా ఉన్న ఇరిగేషన్‌ సిబ్బంది క్వార్టర్లు..

  • నిరుపయోగంగా మారిన ఇరిగేషన్‌ క్వార్టర్లు
  • 40 భవనాల నిర్మాణం.. ఒక్కదాంట్లోనే నివాసం
  • నిధుల్లేక నిలిచిపోయిన ఆర్‌అండ్‌బీ అతిథి భవనం
  • ప్రారంభోత్సవం కాకుండానే శిథిలమైపోతున్న వైనం

పి.గన్నవరం, మే 27 : ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఆ భవనాలను నిర్మించింది. కానీ వాటి లక్ష్యం నెరవేరలేదు. ఏళ్లు గడుస్తున్నా అధికారులు వాటిని అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదీ పి.గన్నవరం ఇరిగేషన్‌ సబ్‌డివిజన్‌ పరిధిలోని సిబ్బంది క్వార్టర్ల పరిస్థితి. ప్రస్తుతం వాటిని చూస్తుంటే ప్రారంభం కాకుండానే శిథిలమయ్యేలా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం (2009-2014) హయాంలో లస్క ర్లు నివాసం ఉండేందుకు సబ్‌డివిజన్‌ పరిధిలో సుమారు 40 భవనాలను నిర్మించారు. పి.గన్నవరంలోని ఇరిగేషన్‌ సబ్‌డివిజన్‌ కార్యాలయం వెనుక, గంటి రోడ్డులో ప్రధాన రహదారి చెంతన, మొండెపులంక లాకుల వద్ద సిబ్బందికి క్వార్టర్లు నిర్మించారు. పి.గన్నవరంలో హెడ్‌వర్క్స్‌ కార్యాలయం శిథిలమైపోవడంతో సంబంధితశాఖ అధికారులు ఇందులో ఒక భవనాన్ని వాడుకుంటున్నారు. మొండెపులంక లాకుల వద్ద అయితే ఒక లస్కరు మాత్రమే  భవనాన్ని ఉపయోగించుకుంటున్నాడు. మిగిలినవన్నీ నిరుపయోగంగా ఉన్నా యి. ఆ భవనాలకు అప్పట్లో పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడం ఒక సమస్య అయితే, వాటిల్లో ఉండేందుకు సిబ్బంది నిరాకరించడం మరో సమ స్య. దీంతో క్వార్టర్లు నిరుపయోగంగా ఉండిపోయాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ పిచ్చిమొక్కలు పెరిగి అడవిని తలపి స్తోంది. క్రమేపీ లస్కర్లు ఉద్యోగ విరమణ చేయడంతోపాటు ప్రభుత్వం కొత్తగా నియామకాలు నిలిపివేయడంతో లస్కర్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం సబ్‌డివిజన్‌ పరిధిలో 15 మం దిలోపే లస్కర్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ క్వార్టర్లను మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చినా ఉండేందుకు సిబ్బంది లేకపోవడం గమనార్హం. 

ఆర్‌అండ్‌బీ ‘విశ్రాంత’ భవనం..

అధికారులు, ప్రజాప్రతినిధులతో నిత్యం కళకళలాడాల్సిన ఆర్‌అండ్‌బీ అతిథి గృహ నిర్మాణ పనులు నిధులు లేక నిలిచి పోయాయి. గత ప్రభుత్వ హయాంలో విద్యుదీకరణ, ఫర్నిచర్‌ పనులు మినహా  భవనం దాదాపుగా పూర్తయింది. పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే సుమారు రూ.20 లక్షలు అవసరం అవుతాయని ఆర్‌అండ్‌బీ జేఈ రాజేంద్ర తెలిపారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, నిధులు ఇంకా మంజూరు కాలేదన్నారు.  భవనం అందుబాటులోకి వచ్చినప్పటికీ నైట్‌వాచ్‌మన్‌ కావాలని ఆయన కోరారు.

ఇలా చేయాలని..

కోనసీమ జిల్లా కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు  భవనాల కొరతతో అధికారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. కలెక్టర్‌ స్పందించి  సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నిరుపయోగంగా ఉన్న ఈ భవనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే భవనాల కొరత తీరుతుంది.. వృథాగా ఉన్న భవనాలు ఉపయోగంలోకి రావడానికి అవకాశం ఉంది.

Updated Date - 2022-05-28T07:10:53+05:30 IST