ఈ ‘సారీ’

ABN , First Publish Date - 2022-06-22T04:35:20+05:30 IST

నెట్టంపాడు ప్రాజెక్టు పరిధిలోని 99వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీని పరిధిలో ఏటా ఖరీఫ్‌కు నీళ్లందిస్తామని చెప్పే అధికారులు.. ఆ ఈ ఏడాదీ అదేమాట చెప్పారు.

ఈ ‘సారీ’
పిల్లర్ల దశలోనే ఉన్న అక్విడెక్ట్‌ నిర్మాణం

పూర్తికాని నెట్టెంపాడు కుడి కాల్వ పనులు

కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణం

నత్తనడకన అక్విడెక్ట్‌ పనులు

99వ ప్యాకేజీ పరిధిలోనే పెండింగ్‌

ఈ ఖరీఫ్‌కూ నీళ్లందేది గగనమే


గద్వాల, జూన్‌ 21: నెట్టంపాడు ప్రాజెక్టు పరిధిలోని 99వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీని పరిధిలో ఏటా ఖరీఫ్‌కు నీళ్లందిస్తామని చెప్పే అధికారులు.. ఆ ఈ ఏడాదీ అదేమాట చెప్పారు. కానీ అక్విడెక్‌ పనులు పూర్తికాకపోవడంతో ఈ సారి కూడా 63 వేల ఎకరాలకు నీరందే పరిస్థితి లేదు. ఏటా ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా, ఖర్చు కాకపోవడంతో పనులు పూర్తవడం లేదు. కొన్నిచోట్ల భూసేకరణ సమస్య ఉండగా, మరికొన్ని చోట్ల కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా పనులు జరగడం లేదు. ప్రధాన కాంట్రాక్టర్లందరూ పనులను అసంపూర్తిగా వదిలి వేయడంతోనే సమస్య నెలకొంది. అయితే వారి స్థానంలో 60సి కింద నోటీసులు ఇచ్చి, కొత్తవారికి పనులను అప్పగించినా వారిలో కొందరు పనులను పూర్తి చేయలేకపోతున్నారు. వారి స్థానంలో కూడా కొత్తవారికి అప్పగించే ఆలోచనలో అధికారులు ఉన్నారు.


సా..గుతున్న పనులు

నెట్టంపాడు ప్రాజెక్టు లిఫ్ట్‌-1 కింద ధరూర్‌ మండలంలో గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ను నిర్మించారు. దీని సామర్థ్యం 1.19 టీఎంసీలు. ఆయకట్టుకు నీటిని అందించడానికి కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. ఎడమ కాలువ కింద ఆరువేల ఎకరాలకు నీరందుతోంది. కానీ కుడి కాలువ పరిస్థితే అగమ్యగోచరంగా మారింది. ఈ కాలువ పనులను 99, 100 ప్యాకేజీలుగా పనులను విభజించారు. ఽధరూర్‌, గద్వాల, ఇటిక్యాల మండలాల పరిధిలో 76 కిలో మీటర్ల పొడవున వీటిని నిర్మించాలి. ఇటిక్యాల మండల పరిధిలో 100వ ప్యాకేజీ పనులు 40 కిలో మీటర్లు దాదాపు పూర్తవగా, ఒక కిలోమీటరు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ 99వ ప్యాకేజీ పనులు ధరూర్‌, గద్వాల మండల పరిధిలో 36 కిలో మీటర్ల మేర జరగాల్సి ఉండగా, నత్తనడకన సాగుతున్నాయి.


99వ ప్యాకేజీ పనుల పరిస్థితి ఇది

99వ ప్యాకేజీ కాలువ పనులు గద్వాల మండలం కొండపల్లి వరకు చేపట్టాలి. అయితే దీని పరిధిలోని వంతెనలు, అక్విడెక్‌ పనులు ప్రధానమైనవి కావడంతో నిర్మాణం నెమ్మదిగా సాగుతోంది. ఇవి పూర్తయితేనే 63 వేల ఎకరాలకు నీరందుతుంది. అయిజ రోడ్డు, కొండ పల్లి రోడ్డులోని వంతెనలు పూర్తయ్యాయి. గద్వాల- రాయచూర్‌ అంతరాష్ట్ర రోడ్డు వంతెన నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చివరి దశలో ఉన్నాయి. ఈ ప్యాకేజీలో ప్రధానమైన నిర్మాణం కొండపల్లి దగ్గర అక్విడెక్‌ పనులు. ఇక్కడ వరద నీళ్లు, చెరువు అలుగు నీళ్లు కిందపో తుండగా, పైన వంతెనకు సీసీతో సైడ్‌వాల్‌ నిర్మించి, దానిని గ్రావిటీ కాలువకు లింక్‌ చేసే అక్విడెక్‌ పనులు సాగుతున్నాయి. ఈ పనిని ఇద్దరు కాంట్రా క్టర్లకు అప్పగించగా, ఒకరు దాదాపుగా పూర్తి చేశారు. మరో కాంట్రాక్టర్‌ పిల్లర్లు నిర్మించి వదిలే శారు. దాదాపు రూ.5 కోట్లతో జరగుతున్న ఈ పనులకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కానీ ఖరీఫ్‌ నాటికి పూర్తి చేస్తామని అధికారులు పాతమాటే చెబుతూ వచ్చారు. ఇవి పూర్తి అయితేనే సాగునీరు అందుతుంది. నెట్టంపాడు ప్రాజెక్టు నీళ్లు ఎప్పుడు వస్తాయా అని 99వ, 100వ ప్యాకేజీ కింద ఉన్న రైతులు ఎదురు చూస్తున్నారు.


అక్విడెక్ట్‌ పనులు జరగాలి

ప్రధాన కాంట్రాక్టర్ల స్థానంలో కొత్తవారికి పనులు ఇచ్చాం. 99వ ప్యాకేజీలో బ్రిడ్జి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. కొండపల్లి దగ్గర నిర్మించే అక్విడెక్‌ పనులలో ఒకరు పూర్తి చేశారు. మరో కాంట్రాక్టర్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఆ పనులను వేగవంతం చేస్తాం. సాధ్యమైనంత వరకు ఖరీఫ్‌లో నీళ్లు ఇవ్వాలనుకున్నాం. అక్విడెక్‌ పనులతో ఆలస్యం అవుతుంది 

- రహీముద్దీన్‌, ఇరిగేషన్‌ ఈఈ 

Updated Date - 2022-06-22T04:35:20+05:30 IST