అక్షరాల్లో పేరు అక్కర్లేదు, ఈ రాగమే మోదీకి ఐడీ

ABN , First Publish Date - 2021-11-28T23:45:08+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేఘాలయలోని ఈల గ్రామం

అక్షరాల్లో పేరు అక్కర్లేదు, ఈ రాగమే మోదీకి ఐడీ

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మేఘాలయలోని ఈల గ్రామం కొంగ్‌థోంగ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్రామస్థులు తనను పిలిచేందుకు అక్షరాల్లోని పేరుకు బదులుగా ఆకర్షణీయమైన రాగాన్ని సృష్టించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తన పట్ల స్నేహభావం ప్రదర్శిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. మేఘాలయను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు సంపూర్ణంగా కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. 


మేఘాలయలో కొంగ్‌థోంగ్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామస్థులు అక్షరాల ద్వారా పలికేవిధంగా పేరు పెట్టుకోవడానికి బదులుగా ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేక రాగాన్ని సృష్టించుకుంటారు. ప్రతి తల్లి తన బిడ్డకు ఓ ప్రత్యేక రాగాన్ని సృష్టిస్తుంది. ఈ గ్రామస్థులు ఒకరినొకరు పిలుచుకోవడానికి, మాట్లాడుకోవడానికి ఈ రాగాలనే ఉపయోగిస్తారు. ఈ విధంగా రాగాలను పేర్లుగా ఉపయోగించుకోవడం ఈ తెగలోని ప్రథమ మహిళకు సంబంధించిన పాట జింగ్ర్‌వాయ్ లాబెయిలో భాగం. ఈ సంప్రదాయం అనేక తరాల నుంచి కొనసాగుతోంది. ప్రతి వ్యక్తికీ ఓ ప్రత్యేక రాగాన్ని సృష్టించి, ఉపయోగించడం విశేషం. 


ఎత్తయిన కొండలు, లోయల్లో ఉన్న కొంగ్‌థోంగ్ గ్రామం ప్రకృతి సౌందర్యంతో కనువిందు చేస్తుంది. దేశవిదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వచ్చి, ఇక్కడి సంప్రదాయాల గురించి తెలుసుకుంటారు. ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించే పోటీకి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఈ గ్రామాన్ని భారత ప్రభుత్వం నామినేట్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తమ గ్రామానికి గుర్తింపు తేవడం కోసం మోదీ చేస్తున్న కృషిని స్వాగతిస్తూ, ఆయన గౌరవార్థం ఓ ట్యూన్‌ను ఓ మహిళ సృష్టించారు. 


మోదీ కోసం ప్రత్యేకంగా ఓ రాగాన్ని ఈ గ్రామస్థులు సృష్టించిన విషయాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ట్వీట్ చేశారు. ఈ స్పెషల్ ట్యూన్‌ను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. కొంగ్‌థోంగ్ గ్రామాన్ని ప్రధాన పర్యాటక గమ్యస్థానంగా అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ ఈ గ్రామస్థులు ఈ రాగాన్ని సృష్టించారని తెలిపారు. 


దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ, ఇంతటి స్నేహ భావాన్ని ప్రదర్శిస్తున్న కొంగ్‌థోంగ్ గ్రామస్థులకు ధన్యవాదాలు తెలిపారు. మేఘాలయ పర్యాటక సామర్థ్యాన్ని మరింత పెంచడానికి భారత ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన చెర్రీ బ్లోజమ్ ఫెస్టివల్ ఫొటోలను కూడా తాను చూశానని చెప్పారు. ఇవన్నీ అత్యంత రమణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-28T23:45:08+05:30 IST