ఆ ఊళ్లో మగాళ్లకు ఇద్దరు ముగ్గురు భార్యలు.. ఎందుకిలా అని వాళ్లనే అడిగితే..

ABN , First Publish Date - 2021-06-16T17:01:18+05:30 IST

ఆ ఊళ్లో మగాళ్లందరూ రెండుమూడేసి పెళ్లిళ్లు చేసుకొని హాయిగా బతికేస్తున్నారు. ఇది తరతరాలుగా ఆ గ్రామంలో వస్తున్న ఆచారమంట! ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా?

ఆ ఊళ్లో మగాళ్లకు ఇద్దరు ముగ్గురు భార్యలు.. ఎందుకిలా అని వాళ్లనే అడిగితే..

ఒక్క పెళ్లాన్ని భరించడానికే నానా తిప్పలూ పడుతుంటారు మొగుళ్లు. అలాంటిది ఆ ఊళ్లో మగాళ్లందరూ రెండుమూడేసి పెళ్లిళ్లు  చేసుకొని హాయిగా బతికేస్తున్నారు. ఇది తరతరాలుగా ఆ గ్రామంలో వస్తున్న ఆచారమంట! ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో తెలుసా? మనదేశంలో అత్యథిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో. ఇక్కడ లఖీంపూర్ ఖేర్‌లో ఫత్తేపూర్ అనే గ్రామం ఉంది. 3వేలమంది వరకూ జనాభా ఉంటారు. ఈ గ్రామంలోని చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగులే కావడం గమనార్హం. ఇదంతా ఒక ఎత్తయితే ఈ ప్రభుత్వ ఉద్యోగులే ఒక్కొక్కరూ రెండు, మూడు వివాహాలు చేసుకొని చక్కగా బతికేయడం విశేషం.


ప్రభుత్వ ఉద్యోగులు ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్నట్లు బయటపడితే వాళ్ల ఉద్యోగాలు ఊడిపోతాయ్. అందుకే వాళ్లు ఈ విషయాన్ని బయటివారెవరికీ చెప్పరట. గ్రామంలో కూడా చాలా రహస్యంగానే దీనిపై చర్చ జరుగుతుందట. ఎవరూ కూడా ఫిర్యాదు చేయరట. ఇక్కడ ఉండే కనీసం 30 బ్రాహ్మణులు, ఠాకూర్ కుటుంబాల్లోని పురుషులు కనీసం రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతమంది ముగ్గురికి మూడు ముళ్లు వేశారు. గ్రామస్థులు కొందరు ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలను ఉంచి సంసారం చేస్తున్నారు. పక్క ఊర్లలో ఉద్యోగాలు చేసే వాళ్లు ఊళ్లో ఒక ఇల్లు, తాము ఉద్యోగం చేసే చోట మరో ఇల్లు మెయింటెయిన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొత్త తరం యువకులు మాత్రం ప్రభుత్వం చర్యల భయంతో ఈ సంప్రదాయాన్ని పక్కనపెట్టేయాలని నిర్ణయించుకున్నారట.


ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కొందరు మాత్రం ఈ పాత సాంప్రదాయాన్ని పాటించడం ద్వారా గ్రామంలో మరింత గౌరవం పొందాలని ఇలా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారట. దీని గురించి ఒక పెద్దాయన చెప్తూ.. ‘‘పేదింటి ఆడపిల్లలను మంచి ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇచ్చి తల్లిదండ్రులు రెండో పెళ్లయినా సరే చేసేవారు. మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అని ఆ అమ్మాయిలు కూడా దీనికి ఒప్పుకునేవారు. ఇద్దరు, ముగ్గురు భార్యలను చూసుకోగలిగిన మగాళ్లు ఈ సంప్రదాయాన్ని కొనసాగించారు. కొన్నిసార్లు అమ్మాయిలకు ఇష్టం లేకపోయినా వారి కుటుంబాలకు డబ్బిచ్చి పెళ్లిచేసుకునేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అమ్మాయిలకు వారి హక్కులు తెలుసు. అవసరమైతే పోలీసు కంప్లైంట్లు ఇచ్చి ఇలా చేసే వారిని కటకటాల వెనక్కు పంపే అవకాశం వారికి ఉంది. అయినా సరే కొంతమంది ఇప్పటికీ అమ్మాయిల అంగీకారంతో బహుభార్యత్వాన్ని కొనసాగిస్తున్నారు’’ అని వివరించాడు.


ఈ గ్రామ పంచాయతీ కూడా ఈ విషయంలో కొత్త నిబంధనలు చేసిందట. రెండు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు తమ ఆస్తులను ఇద్దరు భార్యలకూ సమానంగా పంచాలని రూల్ తెచ్చిందట. దీని ద్వారా చాలా ఆస్తి గొడవలు జరగకుండా అడ్డుకుంది. ‘‘చాలా కుటుంబాలు ఇలా బహుభార్యత్వ సంప్రదాయాన్ని పాటిస్తున్నాయి. అందుకే పంచాయతిలో కొత్త నిబంధన తెచ్చాం. ఇది అమలయ్యేలా చూస్తున్నాం’’ అని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. అయితే ప్రస్తుత యువత మాత్రం ఈ సంప్రదాయానికి పూర్తి వ్యతిరేకంగా ఉందని, దీంతో గ్రామంలో బహుభార్యత్వ సంప్రదాయం మాయమైందని పేర్కొన్నారు.



Updated Date - 2021-06-16T17:01:18+05:30 IST