ఈ నడక అద్భుతం

ABN , First Publish Date - 2022-05-01T21:11:23+05:30 IST

మిమ్మల్ని ‘ది నారోస్‌’ దారులు రారమ్మని పిలుస్తున్నాయి..

ఈ నడక అద్భుతం

మీరు అడ్వెంచర్‌ ప్రియులా? సాహసమే ఊపిరిగా ముందుకు సాగుతుంటారా? కొత్త కొత్త ప్రదేశాల్లో పర్యటించాలని ఉవ్విళ్లూరుతుంటారా? మిమ్మల్ని ‘ది నారోస్‌’ దారులు రారమ్మని పిలుస్తున్నాయి..


చుట్టూ ఎత్తైన కొండలు... ఎంతలేదన్నా వందల అడుగుల ఎత్తుంటాయి. వాటి మధ్యలో సన్నని దారి. ఎంత సన్నని దారంటే ఒక్కోసారి 20 అడుగుల వెడల్పు కూడా ఉండీ ఉండనట్టుగా. ఈ ఇరుకు దారిలో నడుస్తుంటే మజానే వేరు. అలాంటి కొండలూ, దారులూ మా ఊర్లోనూ ఉన్నాయని తేలిగ్గా తీసుకోకండి. ఈ సన్నని దారంతా ఓ నదీ ప్రవాహం. మనం ఎంత దూరం నడిచినా నదిలోనే. ఊహించుకుంటేనే అద్భుతంగా ఉంది కదా. ఇక నిజమవ్వాలంటే... అమెరికాలోని ‘యూతా’ రాష్ట్రంలో జియాన్‌ నేషనల్‌ పార్క్‌లో ఉన్న ‘ది నారోస్‌’కి వెళ్లాల్సిందే.


వర్జిన్‌ నదిలో...

జియాన్‌ నేషనల్‌ పార్క్‌లో టూరిస్టులు ఎక్కువగా సందర్శించే ప్రదేశం జియాన్‌ కానియన్‌. వేల అడుగుల ఎత్తైన కొండలు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. ఎరుపు, నారింజ, గులాబీ రంగుల్లో కొండల శ్రేణులు సాహసక్రీడలకు చిక్కని చిరునామా. ఈ కొండల మధ్యలోనే ఉంది ‘నారోస్‌’. పేరుకు తగినట్టుగానే ఇరుకైన ప్రదేశం. అంతేకాదు వర్జిన్‌ నది దారంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నదిలో కొండల మధ్యలో నడుస్తూ ఉంటే పొందే అనుభూతే వేరు. అందుకనే ఎంతో మంది టూరిస్టులు నారో్‌సను వెతుక్కుంటూ వెళ్తుంటారు. 


ఇక్కడ రెండు రకాల నడకలు ఉన్నాయి. ఒకటి- బాటమ్‌ అప్‌ నారోస్‌ హైక్‌, రెండోది టాప్‌ డౌన్‌ నారోస్‌ హైక్‌. మొదటి హైక్‌కు అనుమతులు అవసరం లేదు. అంత కష్టంగా కాకుండా సులభంగా నడక సాగుతుంది. మార్చి నుంచి నవంబర్‌ వరకు ఈ మార్గం అందుబాటులో ఉంటుంది. ఒక్కోచోట నీళ్ల స్థాయిలు పెరుగుతుంటాయి. మోకాళ్లకు మించదు కానీ దిగువన ఎగుడుదిగుడు నేల... రాళ్లూ రప్పలు తగులుతుంటాయి. అలా నాలుగు కిలోమీర్ల దూరం నడిచాక 20 అడుగుల ఎత్తైన జలపాతం పక్కనే సరస్సు వస్తుంది. ఈ జలపాతంతో కాసేపు ముచ్చటించి, ఇష్టమైతే సరస్సులో ఈత కొట్టి వెనక్కి వచ్చేయాలి. ఎంతలేదన్నా అయిదు గంటలు పడుతుంది ఈ నడకకి.


రెండో హైక్‌ వాళ్లు 14 కిలోమీటర్ల దూరం నడవాలి. ఈ దారి కష్టసాధ్యంగా ఉంటుంది. నీళ్ల స్థాయి ఒక్కోసారి భుజాల వరకూ వస్తుంది. అకస్మాత్తుగా వరదలు ముంచెత్తితే హైకింగ్‌ను నిలిపేస్తారు. మధ్యలో అక్కడక్కడా పర్వతారోహకులు కూడా కలుస్తుంటారు.  ఈ నడకకు అవసరమైన జోళ్లు, ఊతకర్రలు ‘నారోస్‌’ ప్రవేశంలోనే అందుబాటులో ఉంటాయి. డే ట్రిప్‌గా ‘నారోస్‌’ కి వెళ్లే వాళ్లే ఎక్కువ. జీవితకాలపు మెమోరీ్‌సను మూటకట్టుకుని వచ్చేస్తారు వెనక్కి.

Updated Date - 2022-05-01T21:11:23+05:30 IST