థామస్‌ కప్‌లో భారత్‌ సంచలనం

ABN , First Publish Date - 2022-05-13T09:43:46+05:30 IST

థామస్‌ కప్‌లో భారత్‌ అదరగొట్టింది. 43 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆఖరి సింగిల్స్‌లో ప్రణయ్‌ నెగ్గడంతో..

థామస్‌ కప్‌లో భారత్‌ సంచలనం

మలేసియాపై 3-2తో విజయం  

కాంస్యం ఖరారు 

నేడు డెన్మార్క్‌తో సెమీస్‌

ఉబెర్‌ కప్‌ నుంచి అమ్మాయిలు అవుట్‌  


బ్యాంకాక్‌: థామస్‌ కప్‌లో భారత్‌ అదరగొట్టింది. 43 ఏళ్ల తర్వాత తొలిసారి సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆఖరి సింగిల్స్‌లో ప్రణయ్‌ నెగ్గడంతో.. గురువారం ఉత్కంఠభరితంగా జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో భారత్‌ 3-2తో మలేసియాపై గెలిచి కనీసం కాంస్యపతకాన్ని ఖరారు చేసుకుంది. 1979లో భారత్‌ చివరిసారిగా కాంస్యం గెల్చుకోగా.. ఫార్మాట్‌ మారిన తర్వాతి మొదటిసారి సెమీస్‌కు చేరుకొంది. కాగా, భారత మహిళల జట్టు 0-3తో థాయ్‌లాండ్‌ చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. 2-2తో ఇరుజట్లూ సమంగా నిలిచిన స్థితిలో మ్యాచ్‌ ఫలితం ఆఖరి సింగిల్స్‌కు దారి తీసింది. అయితే, తీవ్ర ఉత్కంఠ వుధ్య బరిలోకి దిగిన ప్రణయ్‌... లియోంగ్‌ జున్‌ హోపై గెలిచి భారత్‌ను ఫైనల్‌-4కు చేర్చాడు.


అంతకుముందు తొలి సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ ఓడినా, డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ నెగ్గి సమం చేశారు. మరో సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21-11, 21-17తో యంగ్‌పై గెలిచి భారత్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు. కానీ, డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌-విష్ణువర్దన్‌ కంగుతినడంతో స్కోరు మరోసారి సమమైంది. డిసైడింగ్‌ సింగిల్స్‌లో ప్రణయ్‌ 21-13, 21-8తో మ్యాచ్‌ను ముగించి భారత్‌ను సెమీస్‌ చేర్చాడు. ఫైనల్లో చోటు కోసం డెన్మార్క్‌తో భారత్‌ శుక్రవారం తలపడనుంది. 


పోరాడిన సింధు..:

క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సింధు 21-18, 17-21, 12-21తో రచనోక్‌ ఇంటానన్‌ చేతిలో ఓడింది. డబుల్స్‌లో శ్రుతి మిశ్రా-సిమ్రన్‌ సింగ్‌ జంట 16-21, 13-21తో జాంగ్‌గోల్పన్‌-ప్రజోంగ్‌జై చేతిలో పరాజయంపాలు కావడంతో భారత్‌ 0-2తో వెనుకబడింది. సింగిల్స్‌లో ఆకర్షి 16-21, 11-21తో పోర్న్‌పవీ చొచువోంగ్‌ చేతిలో చిత్తవడంతో భారత ఓటమి ఖరారైంది. ఫలితం తేలడంతో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తనీషా-ట్రీషా జంట, అస్మిత చలీహా బరిలోకి దిగలేదు. 

Read more