అద్భుతం ఆవిష్కృతం

ABN , First Publish Date - 2022-05-16T09:03:47+05:30 IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఇప్పటిదాకా సాధించిన విజయాలు ఒక ఎత్తు. ఆదివారంనాటి విజయం మరో ఎత్తు. ప్రతిష్ఠాత్మక థామస్‌

అద్భుతం ఆవిష్కృతం

పోరాటం..కాదు,కాదు అద్భుత పోరాటం..ఫలితంగా దశాబ్దాల పసిడి కల నెరవేరిన చిరస్మరణీయ క్షణం.. గత మ్యాచ్‌ల్లో బలీయమైన మలేసియా, డెన్మార్క్‌ జట్లపై గెలిచిన ఆత్మవిశ్వాసం.. తొలిసారి పసిడి పతక పోరులో అడుగుపెట్టిన ఉత్సాహం..వెరసి భారత పురుషుల జట్టు థామస్‌ కప్‌ టైటిల్‌ పోరులో నభూతో అనదగ్గ ప్రదర్శన చేసింది.అసలైన సమరంలో యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ చెలరేగాడు.. మొదటి సింగిల్స్‌లో తొలి గేమ్‌ కోల్పోయినా వెరవని సేన్‌ జూలు విదిల్చి వరల్డ్‌ నెం.5 ఆంథోని సినిసుకను చిత్తు చేసి శుభారంభం ఇచ్చాడు.. ఇక డబుల్స్‌లో తెలుగు తేజం సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ షెట్టి మరింత గొప్పగా ఆడారు.. ఈ జోడీ కూడా మొదటి గేమ్‌ను చేజార్చుకున్నా నరాలు తెగే ఉత్కంఠ నడుమ మ్యాచ్‌ పాయింట్లు కాపాడుకొని రెండో గేమ్‌ను, అనంతరం మ్యాచ్‌ను గెలిచిన తీరు అనన్య సామాన్యం.. కీలకమైన రెండో సింగిల్స్‌లో మరో తెలుగు స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ తనలోని అసలు సిసలు ఆటగాడిని బయటకు తెచ్చాడు.. ఆసియా క్రీడల విజేత జొనాథన్‌ క్రిస్టీని చిత్తు చేయడంతో భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో ‘సువర్ణా’ధ్యాయం ఆవిష్కృతమైంది.


థామస్‌.. మస్త్‌ మస్త్‌

తొలిసారిగా కప్‌ భారత్‌ వశం


మన షటిల్‌ కిలకిలా నవ్వింది. రాకెట్‌ కేరింతలు కొట్టింది. థామస్‌ కప్‌లో ఈసారి కల వాస్తవమై చమక్కున మెరిసి మురిపించింది. బ్యాడ్మింటన్‌లో సంబురాన్ని నింపింది. భారత బ్యాడ్మింటన్‌ స్థాయిని మరో దశకు తీసుకెళ్లే మహాద్భుత విజయాన్ని మన స్టార్లు సాఽధించారు. ఊరిస్తూ వస్తున్న ఽథామస్‌ కప్‌ 73 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్‌ వశమైంది. కిడాంబి శ్రీకాంత్‌, రంకిరెడ్డి సాత్విక్‌  సాయిరాజ్‌ రూపంలో ఇద్దరు తెలుగువాళ్లు సత్తా చాటడం.. బ్యాడ్మింటన్‌లో ఘనాపాటి, 14 సార్లు థామస్‌ కప్‌ విజేత అయిన ఇండోనేషియాను చిత్తు చేసి మరీ కప్‌ అందుకోవడం మరింత కిక్కిచ్చే ముచ్చట!!


థామస్‌ కప్‌ విజేత భారత్‌

3-0తో డిఫెండింగ్‌ చాంప్‌ ఇండోనేసియాకు షాక్‌

లక్ష్యసేన్‌, సాత్విక్‌ జోడీ అసమాన పోరాటం

రెండో సింగిల్స్‌ విజయంతో శ్రీకాంత్‌ ఫినిషింగ్‌ టచ్‌

చరిత్ర సృష్టించిన పురుషుల జట్టు


బ్యాంకాక్‌: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో భారత్‌ ఇప్పటిదాకా సాధించిన విజయాలు ఒక ఎత్తు. ఆదివారంనాటి విజయం మరో ఎత్తు. ప్రతిష్ఠాత్మక థామస్‌ కప్‌ పురుషుల బ్యాడ్మింటన్‌ ఫైనల్లో  కిడాంబి శ్రీకాంత్‌ ఆధ్వర్యంలోని భారత జట్టు 14సార్లు చాంపియన్‌ ఇండోనేసియాను 3-0తో చిత్తు చేసింది. తద్వారా 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో భారత్‌ తొలిసారి చరిత్రాత్మక బంగారు పతకాన్ని ముద్దాడింది.  అప్రతిహత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన ఇండోనేసియా ఎదుట నిలువగలదా అన్న అనుమానాలను భారత్‌ పటాపంచలు చేసింది. ప్రత్యర్థి ఇచ్చిన గట్టి పోటీని సమర్థంగా తిప్పికొట్టి ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సత్తాచాటింది. తొలి సింగిల్స్‌లో వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప పతక విజేత లక్ష్యసేన్‌ 8-21, 21-17, 21-16 స్కోరుతో తనకంటే మెరుగైన ఆంథోని సినిసుక గింటింగ్‌పై గెలిచి జట్టును 1-0 ఆధిక్యంలో నిలిపాడు. డబుల్స్‌లో దేశ అత్యుత్తమ జోడీ సాత్విక్‌ సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ షెట్టి 18-21, 23-21, 21-19తో మహ్మద్‌ అహ్‌సాన్‌-కెవిన్‌ సంజయ సుకాముల్జో జోడీకి షాకివ్వడంతో భారత్‌ తిరుగులేని స్థితిలో నిలిచింది. రెండో సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21-15, 23-21తో జొనాథన్‌ క్రిస్టీపై గెలవడంతో భారత్‌ మొదటిసారి థామస్‌ కప్‌ ట్రోఫీని అందుకుంది. 

సేన్‌ అసమాన పోరాటం: నాకౌట్‌ దశలో అంచనాల మేరకు రాణించని లక్ష్యసేన్‌.. సినిసుక గింటింగ్‌తో మ్యాచ్‌లో అదరగొట్టాడు. అటు సేన్‌, ఇటు సినిసుక పదునైన రిటర్న్‌లు, స్మాష్‌లతో తొలి గేమ్‌ ఆరంభంనుంచే దూకుడు ప్రదర్శించారు. అయితే తొలిగేమ్‌ను కోల్పోయి రెండో గేమ్‌లో పుంజుకున్న లక్ష్య 7-4తో ముందంజ వేయడంతోపాటు విరామానికి ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. బ్రేక్‌ తర్వాత ఎదురు దాడికి దిగిన సినిసుక 11-12కి ఆధిక్యాన్ని తగ్గించాడు. కానీ ర్యాలీలతో విరుచుకుపడిన సేన్‌ ఐదు గేమ్‌ పాయింట్లు రాబట్టి.. గేమ్‌ను నెగ్గడం ద్వారా మ్యాచ్‌ను నిర్ణాయక మూడో గేమ్‌కు మళ్లించాడు. ఈ గేమ్‌లో భారత షట్లర్‌ మెల్లిగా పుంజుకొని 6-8కి ఆధిక్యాన్ని కుదించాడు. బ్రేక్‌ సమయానికి సినిసుక 11-7తో నిలిచినా.. అనంతరం ర్యాలీలతో సేన్‌ పట్టు బిగించాడు. ఓ క్రాస్‌కోర్టు స్మాష్‌తో 12-12తో స్కోరుసమం చేయడంతోపాటు ఆపై వరుసగా పాయింట్లు రాబట్టిన లక్ష్యసేన్‌ 18-14తో ముందంజ వేశాడు. ఈ దశలో గింటింగ్‌ షాట్లు గతి తప్పగా..సేన్‌ నాలుగో మ్యాచ్‌ పాయింట్‌ను గింటింగ్‌ నెట్‌కు కొట్టడంతో విజయం అందుకున్న లక్ష్యసేన్‌ ఆ ఆనందంలో ర్యాకెట్‌ను ముద్డాడి కోర్టులో కూలబడిపోయాడు.

సాత్విక్‌, చిరాగ్‌ అదరహో: సాత్విక్‌-చిరాగ్‌ తామెందుకు అత్యుత్తమ జోడినో తమ ఆటతీరుతో చాటి చెప్పారు. అహ్‌సాన్‌-సుకాముల్జో జంటతో మ్యాచ్‌లో తొలిగేమ్‌ను కొద్దిలో చేజార్చుకున్నా రెండోగేమ్‌లో పుంజుకోవడంతోపాటు మూడో గేమ్‌లో 3 మ్యాచ్‌పాయింట్లు కాపాడుకొన్న తీరు సాత్విక్‌ జోడీ అద్భుత ఆటకు నిదర్శనం. చివరి గేమ్‌లో బ్రేక్‌ సమయానికి సాత్విక్‌ జంట 11-9తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ప్రత్యర్థి ద్వయం తగ్గకపోవడంతో 16-16తో స్కోరు సమమై ఉత్కంఠ ఏర్పడింది. రెండు జోడీలు చెరో పాయింట్‌ సాధిస్తూ వెళ్లడంతో టెన్షన్‌ హైపిచ్‌కు చేరింది. ఈ తరుణంలో సాత్విక్‌ స్మాష్‌ను సుకాముల్జో నెట్‌కు కొట్టడంతో భారత్‌కు 2 మ్యాచ్‌ పాయింట్ల ఆధిక్యం లభించింది. ఈ దశలో ఆలస్యంగా సర్వ్‌ చేస్తున్నాడంటూ సాత్విక్‌కు అంపైర్‌ ఎల్లోకార్డ్‌ చూపడంతో కలకలం రేగింది. కానీ ఉత్కంఠను అదిమిపెట్టిన చిరాగ్‌ క్రాస్‌కోర్టు స్మాష్‌తో మ్యాచ్‌కు అద్భుత ముగింపు ఇచ్చాడు. 


శ్రీకాంత్‌ జోరు: ఈ మ్యాచ్‌ గెలిస్తే చరిత్రాత్మక పసిడి పతకం సొంతమయ్యే వేళ..రెండో సింగిల్స్‌లో జొనాథన్‌ క్రిస్టీపై కిడాంబి శ్రీకాంత్‌ ఆచితూచి ఆడాడు. భారీషాట్ల జోలికి పోకుండా చిన్న ర్యాలీలకే పరిమితమై 20-16తో సులువుగా తొలిగేమ్‌ నెగ్గాడు.  రెండో గేమ్‌లోనూ అదే వ్యూహంతో ఆడిన శ్రీ.. విరామానికి మూడు పాయింట్ల ఆధిక్యం చూపాడు. బ్రేక్‌ అనంతరం గేరు మార్చిన క్రిస్టీ వరుసగా ఆరు పాయింట్లు రాబట్టి 10-13తో గేమ్‌పై పట్టుబిగించేలా కనిపించాడు. కానీ జోనాథన్‌ అనవసర తప్పిదాలకు పాల్పడడంతో 18-18తో శ్రీకాంత్‌ స్కోరు సమం చేశాడు. సుదీర్ఘంగా సాగిన ర్యాలీని జంప్‌ స్మాష్‌తో ముగించిన శ్రీకాంత్‌ విజయానికి 2 పాయింట్ల దూరంలో నిలిచాడు. అయితే శ్రీకాంత్‌ పదునైన బాడీస్మాష్‌ను నేర్పుగా ప్రత్యర్థి కోర్టులోకి కొట్టిన క్రిస్టీ మొదటగా తానే గేమ్‌ పాయింట్‌పై నిలిచాడు. ఈ పాయింట్‌ను కాపాడుకున్న కిడాంబి.. ఓ స్మాష్‌తో చాంపియన్‌షిప్‌ పాయింట్‌పై నిలిచాడు. ఆపై సూపర్బ్‌ క్రాస్‌కోర్టు స్మాష్‌తో మ్యాచ్‌ను ముగించిన శ్రీకాంత్‌ చిరస్మరణీయ విజయం అందుకున్నాడు. అనంతరం సహచరుల వైపు పిడికిలిడితో పంచ్‌లు విసురుతూ విజయనాదం చేశాడు.


మరింత కిక్కు!

పతకమే లక్ష్యంగా ఈసారి థామస్‌ కప్‌ ఫైనల్‌లో అడుగుపెట్టిన మన పురుషుల జట్టు ఏకంగా స్వర్ణాన్నే కొల్లగొట్టింది. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో దూసుకుపోతున్న భారత్‌కు ఈ టైటిల్‌ మరింత జోష్‌ ఇస్తుందనడంలో సందేహం లేదు. మున్ముందు జరగబోయే ప్రతిష్ఠాత్మక టోర్నీలలో మన షట్లర్లు చాంపియన్లుగా నిలిచేందుకు తోడ్పడుతుంది. ఎప్పుడో 43 ఏళ్ల కిందట ప్రకాశ్‌ పదుకోన్‌, సయ్యద్‌ మోదీ వంటి దిగ్గజ షట్లర్లతో కూడిన భారత జట్టు థామస్‌ కప్‌లో అత్యుత్తమంగా సెమీ్‌సకు చేరి డెన్మార్క్‌ చేతిలో ఓడింది. శ్రీకాంత్‌, ప్రణయ్‌, లక్ష్యసేన్‌ సాత్విక్‌, చిరాగ్‌, అర్జున్‌, ధ్రువ కపిల, కృష్ణప్రసాద్‌, విష్ణువర్ధన్‌, ప్రియాన్షు రజావత్‌తో కూడిన ఇప్పటి భారత జట్టు అంతకుమించి ప్రదర్శనతో ఔరా అనిపించింది. వ్యక్తిగత టైటిళ్లు గెలవడం వేరు. కానీ థామస్‌ కప్‌ వంటి టీం ఈవెంట్‌లో విజేతగా నిలవడం భారత బ్యాడ్మింటన్‌ అసలైన సత్తాకు తార్కాణం. ఈ సూపర్‌ షోతో.. గతంలో థామస్‌ కప్‌ విజేతలుగా నిలిచిన చైనా, ఇండోనేసియా, జపాన్‌, మలేసియా, డెన్మార్క్‌వంటి బ్యాడ్మింటన్‌ పవర్‌హౌ్‌సల సరసన భారత్‌ చేరింది. ఆరు నెలలుగా సంచలన ప్రదర్శన చేస్తున్న సింగిల్స్‌ స్టార్లు శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌, ప్రణయ్‌ అదే ఫామ్‌ను థామస్‌ కప్‌లో కొనసాగించారు. ఇక డబుల్స్‌ జోడీ సాత్విక్‌, చిరాగ్‌ అద్భుత ఫామ్‌లో ఉండడం కలిసొచ్చింది.


వాస్తవంగా టీం ఈవెంట్లలో డబుల్స్‌ జోడీలు రాణించకపోవడం భారత్‌కు ఎప్పుడూ సమస్యగానే ఉంటోంది. విదేశీ కోచ్‌లు టామ్‌ కిన్‌, ఫ్లాండీ, మథియాస్‌ బో ఆధ్వర్యంలో సాత్విక్‌ జోడీ తిరుగులేనిదిగా రూపుదిద్దుకొంది. ఇప్పటిదాకా భారత బ్యాడ్మింటన్‌ అంటే ప్రకాశ్‌ పదుకోన్‌, గోపీచంద్‌, సైనా, సింధు పేర్లే చెబుతారు. అయితే 1983 వన్డే వరల్డ్‌ కప్‌ టైటిల్‌ భారత్‌ క్రికెట్‌ రూపురేఖలను సమూలంగా మార్చిన విధంగా.. థామస్‌ కప్‌ స్వర్ణం భారత బ్యాడ్మింటన్‌ ముఖచిత్రాన్ని మరింత మారుస్తుందనడంలో సందేహం లేదు. 

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

Updated Date - 2022-05-16T09:03:47+05:30 IST