ఆ కలెక్టర్లు, ఎస్పీపై వేటు తప్పదా?

ABN , First Publish Date - 2021-01-22T08:34:34+05:30 IST

గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంత మంది అధికారులను బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాజాగా దృష్టి సారించింది.

ఆ కలెక్టర్లు, ఎస్పీపై వేటు తప్పదా?

  • మార్చిలో ఇచ్చిన ఆదేశాలపై ఎస్‌ఈసీ దృష్టి.. అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరే అవకాశం
  • తీర్పు తర్వాత కలెక్టర్లతో మాట్లాడిన కమిషనర్‌.. ఆ ఇద్దరు కలెక్టర్లతో మాటామంతికి నో
  • వారిద్దరికి బదులుగా చిత్తూరు, గుంటూరు జాయింట్‌ కలెక్టర్లతో సంప్రదింపులు
  • న్యాయమూర్తులు మారితే న్యాయం మారదు.. మీరు చెబితే వాయిదా వేయాలా.. సర్కారుపై బాబు ఫైర్‌

అమరావతి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): గత ఏడాది మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంత మంది అధికారులను బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తాజాగా దృష్టి సారించింది. ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో సదరు అధికారులపై ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకోవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లు వేసే సమయంలో జరిగిన హింసాత్మక సంఘటనలను తీవ్రంగా పరిగణించిన కమిషనర్‌ నిమ్మగడ్డ.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌, భరత్‌ గుప్తా.. ఎస్పీలు విజయారావు, సెంథిల్‌కుమార్‌లను వెంటనే తొలగించి, ప్రత్యామ్నాయ అధికారులను సూచించాలని ప్రభుత్వాన్ని కోరారు.  మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటనలో ఉదాశీనంగా వ్యవహరించిన అక్కడి సీఐని తక్షణమే సస్పెండ్‌ చేసి ప్రత్యామ్నాయంగా ఆమోదయోగ్యమైన అధికారిని నియమించాలని సూచించారు. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో శ్రీకాళహస్తి, పలమనేరు డీఎస్పీలను.. తిరుపతి, పలమనేరు, రాయదుర్గం, తాడిపత్రి సీఐలను బదిలీ చేయాలన్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావును రొటీన్‌గా రైల్వే శాఖకు మార్చారు. పలమనేరు డీఎస్పీకి అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించారు. రాయదుర్గం సీఐ తులసీరాంను రొటీన్‌గా విజయవాడ ఇంటెలిజెన్స్‌కు మార్చారు.


మిగతా వారికి సంబంధించి ఎలాంటి మార్పులు జరగలేదు. గురువారం హైకోర్టు తీర్పు దరిమిలా కమిషనర్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఎన్నికల నిర్వహణపై మాట్లాడారు. చిత్తూరు, గుంటూరు కలెక్టర్లతో మాత్రం మాట్లాడలేదు. ఎస్‌ఈసీ ఆదేశించినా వారిని ప్రభుత్వం బదిలీ చేయకపోవడమే దీనికి కారణం. ఎన్నికల నిర్వహణపై వారితో మాట్లాడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి.. ఆ జిల్లాల జేసీ-1లతో చర్చించినట్లు తెలిసింది. ఆయా అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరనున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-01-22T08:34:34+05:30 IST