‘మా’లో ఆ నలుగురు!

Jun 24 2021 @ 01:28AM

మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌(మా) ఎన్నికలంటే ఎప్పుడూ వేడివాడినే. ఇంకా కరోనా కాలం లోంచి జనాలు తేరుకోనేలేదు...  ‘మా’దే ప్రతాపం అంటూ ఎవరికివారు పావులు కదుపుతున్నారు. థ్రిల్లర్‌ సినిమాలా ఉంది యవ్వారం. ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎవరు మద్ధతిస్తారో ‘మా’ ఓటర్లకే కాదు... గతంలో ‘మా’రాజులైన వారికి కూడా అంతుచిక్కట్లేదు. కన్నడసీమ నుంచి విలన్‌గా తెలుగులోకి దండెత్తి హీరోకంటే యమా క్రేజ్‌ సంపాదించుకున్న అద్భుతమైన నటుడు తెలుగు మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌లో హీరో అవుతాడా? లేకుంటే మోహన్‌బాబు ప్రయోగించిన మంచు ‘విష్ణు’చక్రం ఎంత వేగంగా పనిచేస్తుంది? అసలు జీవిత, హేమలు ఈ ఎన్నికల్లో ఏం చేయాలనుకుంటున్నారంటే... ఎవరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి. చదరంగానికంటే రసవత్తరమైన ఆ నలుగురి ఆటలో అసలు రహస్యమేమిటి?


మంచి తనానికే బలమా...

నాటకాల్లో తల పండిన నటుడైన ప్రకాశ్‌ రాజ్‌ సినిమా నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, కన్నడలోనే కాకుండా మలయాళ, హిందీ భాషల్లోనూ పాపులరయ్యాడు. ప్రకాశ్‌ రాజ్‌ ఏ పాత్ర చేసినా ప్రేక్షకుడికి గూస్‌బంప్స్‌ వస్తాయి. జాతీయ ఉత్తమ నటుడైన ప్రకాశ్‌ రాజ్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా ఆయనలో విషయముంది. ఆయన మామూలుగా మాట్లాడినా అవతలివారి గుండెను తాకుతుంది. ప్రేక్షకుల మనసు బాగా తెలిసిన ఈయన మృదుస్వభావి. ప్రశ్నించగలిగే మనస్తత్వం అందరికీ నచ్చుతుంది. దేశంలో బీజేపీ పాలనలో జరిగే అరాచకాలను ప్రశ్నించే గళం ఈయనది. రాజకీయాల్లోకి వచ్చి రాణించకపోయినా... ఎన్నికల ‘రాజు’గా ఓటర్ల హృదయంలో నిలిచిన మొనగాడు ఇతను. తెలంగాణలో పల్లెలను దత్తత తీసుకోవడంతో పాటు ఆయన మంచితనాన్ని, దగ్గరగా చూసినవారు చెబుతుంటారు. కళారంగంతో పాటు ప్రజలపక్షాన నిలిచే స్వరం, భాస్వరం ప్రకాశ్‌రాజ్‌! సరిగ్గా ఈ ఫ్లేవర్‌తోనే ప్రకాశ్‌రాజ్‌ యాత్ర ‘మా’లోకి ఉండబోతోంది. ప్రకాశ్‌ రాజ్‌ వస్తే ఎప్పటినుంచో ఊరిస్తోన్న రెండెకరాల ‘మా’ కోసం భూమి, మిగతా పథకాలు ఆర్టిస్టులకు దక్కుతాయన్నది కొందరి ఆలోచన. గ్రామాలను దత్తత తీసుకున్న మంచి మనిషి... ఆర్టిస్టుల కోసం ఆలోచించడా అనేది ఫిల్మ్‌ ఇండస్ట్రీ జనాల ఈక్వేషన్‌.


టీఆర్‌ఎస్‌ వదిలిన అస్త్రమా?

తెలంగాణ గవర్నమెంట్‌తో ఉండే సఖ్యత, ముఖ్యంగా కేటీయార్‌తో ఉండే స్నేహం వల్ల ప్రకాశ్‌ రాజ్‌ ఇలా ‘మా’ పోటీలోకి దూసుకొచ్చాడని కొందరు అంటున్నారు. కేటీయార్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన తర్వాతే ఆయన పోరులోకి వచ్చారని టాక్‌.


విష్ణు మంచుకు సినీ పెద్దల మద్దతు!?

‘మా’ ఎన్నికల్లో సత్తా చాటాలంటే తన పెద్దకొడుకే పర్ఫెక్ట్‌ అని మోహన్‌బాబు రంగంలోకి దించారట. ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించడానికి ముందే సినీ పెద్దలను కలవడం ప్రారంభించారు. వీకే నరేశ్‌ సాయంతో కృష్ణను కలవటం ద్వారా ఓ మంచి ఎత్తుగడ వేశారు. ముఖ్యంగా కృష్ణ తన నిర్మాతలను ఏనాడూ ఇబ్బంది పెట్టలేదని, డబ్బులు తీసుకోకుండా సినిమాలు చేశాడనే సాఫ్ట్‌ కార్నర్‌ ఉంది. ఇళ్లు కట్టించి సినీకార్మికులకు సాయం చేశాడనే మంచి పేరు కృష్ణకు ఉంది. దీంతో పాటు మహేశ్‌బాబు ఫ్యాన్స్‌ బలం అదనంగా చేకూరుతుంది. ఇకపోతే మోహన్‌బాబుకు ఎప్పుడూ ఆత్మీయంగా నందమూరి కుటుంబం ఉంటుంది. బాలకృష్ణను కూడా తన మద్ధతు అడిగే అవకాశం ఉంది. త్వరలో బాలయ్యను మోహన్‌బాబు కుటుంబం కలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మోహన్‌బాబు తన సన్నిహితులను కలుస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. 


ఓట్లను చీల్చడానికా?

ప్రకాశ్‌రాజ్‌ హైదరాబాద్‌లో తన మద్ధతుదారులను ఎవరిని కలుస్తాడో అనే విషయం ఆసక్తికరంగా ఉంది. చిరంజీవి మద్దతు ఆయనకు ఉందని ప్రచారం జరుగుతోంది. నాగబాబు సైతం రాజకీయంగా పవన్‌ కల్యాణ్‌, ప్రకాశ్‌రాజ్‌ దారులు వేర్వేరు అయినప్పటికీ... సినిమాల్లో తామంతా ఒక్కటేనని ఇటీవల చెప్పారు. చిరంజీవి దయ లేనిదే ఇండస్ట్రీలో ఏ పని జరగదని అందరూ మాట్లాడుకుంటారు. మరి, చిరంజీవి ఆలోచన ఏంటో అర్థం కాలేదు. ఆయన తన పట్టుకోసం ఎవరి పక్షాన నిలబడతాడనేది ప్రశ్న. ఇక... జీవితా రాజశేఖర్‌ ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారని ‘మా’ సభ్యుల్లో పేరు పొందారు. ఆమెకు ఎవరెవరు మద్దతు ఇస్తారో చూడాలి. ఇక, హేమ ఓట్లను చీల్చడానికే వస్తున్నారని టాక్‌ మొదలైంది. ఏదేమైనా కరోనా అనంతరం జరిగే ఈ ‘మా’ ఎన్నికల బరి బహు ఆసక్తికరం. కన్నడిగ తడాఖానా, తెలుగువాడి సత్తానా అనే వివాదం కూడా వచ్చే అవకాశం ఉంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.