Advertisement

ఆ సూచనలు వినాశనానికి బాటలు

Jan 23 2021 @ 01:01AM

ఉత్పత్తి పెరగకుండా, డబ్బును మాత్రమే ప్రజలకు పంపిణీ చేయడం వల్ల వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయి. ప్రజలపై పడే అదనపు భారాన్ని ‘హెలికాప్టర్‌ మనీ’ ద్వారా తగ్గించవచ్చుననే సూచన అవివేకం. దీనివల్ల మన ఆర్థికవ్యవస్థ డిమానిటైజేషన్‌ పెనం మీద నుంచి పొయ్యిలో పడటం ఖాయం.


ఆంధ్రజ్యోతి దినపత్రికలో జనవరి 13న భరత్‌ ఝన్‌ఝన్‌వాలా ‘కొత్త బడ్జెట్‌కు విధాన బాటలు’ శీర్షికతో రాసిన వ్యాసం చదివి నివ్వెరపోయాను. నేను హార్వర్డ్, ఆక్స్‌ఫర్డ్‌లలో చదవకపోయినా, ఎకనామిక్స్‌ విద్యార్థినే. నా సుదీర్ఘ బ్యాంకు ఉద్యోగ అనుభవం వల్ల, రాబోయే బడ్జెట్‌ గురించి ఆయన చేసిన సూచనలు సరైనవి కాదనిపించింది. ఆదాయం పెంచుకోవడానికి కార్పొరేట్‌ పన్నులు పెంచాలనే మొదటి సూచన చేస్తూనే, పన్నులు భారీస్థాయిలో ఉన్నందువల్ల, మన కార్పొరేట్‌ కంపెనీలు ప్రధాన కార్యాలయాలను విదేశాలకు తరలిస్తున్నాయి అన్నారు. పైగా ద్వంద్వపన్నుల చెల్లింపు నివారణ ఒప్పందాలను సవరించాలని సూచించారు. అవి పరస్పర విరుద్ధమైన సూచనలు. ఏ రూపంలో పరోక్ష పన్నులు పెంచినా, అవి అంతిమంగా వినియోగదారుల పైనే పడతాయి. కార్పొరేట్‌ సంస్థల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. విరిగేది ప్రజల నడ్డే. అవసరాలు, విలాస ఉత్పత్తుల పైన కాక, కేవలం విలాసాల మీదే పన్నులు పెంచే విధానం కచ్చితంగా పాటించాలి. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో పూర్తి వ్యతిరేక విధానం పాటిస్తోంది.


ఆదాయపు పన్ను రేట్లు పెంచాలని, హెలికాప్టర్‌ మనీ పంపిణీ విధానం అమలుచేయాలని ఆయన మరో సూచన చేశారు. అయితే, అందరి కళ్ళ ముందు కనబడుతున్న వెనెజులా దేశ అనుభవం, ఆయనకు కనిపించకపోవడం శోచనీయం. భారీస్థాయిలోనూ, అదనంగానూ చేసే ఉత్పత్తి వల్ల ధరలు తగ్గుతాయి. ఫలితంగా కొనుగోళ్లు, -వినియోగాలు పెరుగుతాయనే సానుకూల ప్రాథమిక విషయాన్ని వదిలివేసి, హెలికాప్టర్‌ మనీ ద్వారా నేరుగా కలిగే ద్రవ్యోల్బణం వంటి ఆర్థిక దుష్ఫలితాలను ఆహ్వానించడం తగినది కాదు. 


వస్తు-సేవల పన్ను రేట్లను తగ్గించాలని, దానివల్ల మార్కెట్‌లో సరుకుల ధరలు తగ్గి, కొనుగోళ్ళు పెరుగుతాయని మూడో సూచన చేశారు. ఈ పన్నురేట్లను ఏయే వస్తువులపై తగ్గించాలి, ఏయే వస్తువులపై పెంచాలి? నిత్యావసరాలపైన, అలాగే అత్యవసర సేవలపైన తగ్గించాలి. కానీ, కేంద్రప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ వగైరాల మీద పెంచి, వజ్రాలు, లగ్జరీ కార్లు వంటి వాటి మీద తగ్గించి ఆర్థికవ్యవస్థ కోలుకోవడానికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది.


ఝన్‌ఝన్‌వాలా, దిగుమతులపై విధించే పన్నులను మూడురెట్లు పెంచాలని సూచించారు. అయితే ఎటువంటి దిగుమతుల మీద పెంచాలి? విదేశీసంస్థలు మనదేశంలో కంపెనీలు పెట్టి, వ్యాపారం చేసి, వచ్చిన లాభాలను, తమ తమ దేశాలకు తీసుకువెళ్ళడం వల్ల, లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని చేజార్చుకుంటున్నాం. విదేశీ కంపెనీలు సంపాయించే లాభాలను తమ దేశాలకు తరలించకుండ మనదేశంలోనే తిరిగి పెట్టుబడులుగా పెట్టేలా చూడడం కోసం కచ్చితమైన నిబంధనలు విధించాలని కొన్ని సంవత్సరాలుగా నేను పోరాడుతున్నాను. మన ఆర్థికవ్యవస్థ వేగంగా పుంజుకోవడానికి, శాశ్వతంగా అభివృద్ధి చెందడానికి సరైన నియంత్రణ విధానం అది. ఆర్థికశాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో ఈ సూచన చేస్తే బాగుంటుంది.


పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజు సుంకాలను పెంచితీరాలని, దానివల్ల పడే భారాన్ని హెలికాప్టర్‌మనీ ద్వారా తగ్గించవచ్చని ఆయన నాలుగో సూచన చేశారు. సామాన్యులపై మరింత భారం మోపాలనే ఆయన దృక్పథాన్ని హర్షించలేకపోతున్నాను. మాట మాట్లాడితే హెలికాప్టర్‌ మనీ అంటున్న పోకడను సైతం విమర్శించకుండా ఉండలేకపోతున్నాను. ఆర్థిక లోటంతా అంతిమంగా సామాన్యుడి నెత్తినే పడుతుందన్న గమనింపు ఆయనకు ఎందుకు లేదో అర్థం కావడం లేదు.


రక్షణ రంగానికి, టెక్నాలజీ, కమ్యూనికేషన్‌ రంగాలకు కేటాయింపులను కనీసం ఐదు రెట్లు పెంచాలని, హోం మంత్రిత్వ శాఖకు, ఆరోగ్య శాఖకు ఇస్తున్న నిధులను కొనసాగించాలని కూడ ఝన్‌ఝన్‌వాలా సూచించారు. వాస్తవానికి రక్షణ మంత్రిత్వశాఖకు ఇస్తున్న నిధులలో భారీ అవినీతి-మళ్ళింపులు లేకపోతే అయిదు రెట్లు కేటాయింపులు పెంచినంత ఫలితం ఉంటుంది. టెక్నాలజీ-కమ్యూనికేషన్‌ రంగాలకు సంబంధించి ఆర్‌&డి సదుపాయాల సంగతి సరే సరి. ప్రైవేటు ఆపరేటర్లకు కంచాలలో వడ్తిస్తూ, బిఎస్‌ఎన్‌ఎల్‌కు కనీసం ఆకుల్లో కూడా వడ్డించని కేంద్రప్రభుత్వం తన తీరు పూర్తిగా మార్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఇక ఆరోగ్య శాఖకు కరోనా వ్యాధిని ఎదుర్కొనవలసిన ప్రస్తుత సమయంలో నిధులు పెంచవలసిన అవసరం లేదని ఝన్‌ఝన్‌వాలా భావించడం విడ్డూరం.


పోతే ఆయన చేసిన అత్యంత భయంకరమైన ఐదో సూచన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వ్యయాలను తాత్కాలికంగా తగ్గించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, విద్యారంగ వ్యయాలను పూర్తిగా రద్దు చేయాలి అనేది. ఇది ఎంతటి అవివేకమైన సూచనో ప్రత్యేకంగా వివరించనక్కరలేదు.


’హెలికాప్టర్‌ మనీ’ నమూనాను ఆకాశానికి ఎత్తేస్తున్న ఝన్‌ఝన్‌వాలా ఎంత లోపభూయిష్టమైన, హానికారకమైన, సర్వనాశనానికి దారితీసే మార్గాన్ని సూచిస్తున్నారో అందరికీ అర్థమవుతూనే ఉంది. కొనుగోళ్లు, ఉద్దీపనలు, ఉద్యోగాల సృష్టికి వీటిని తారకమంత్రంగా వల్లెవేస్తున్న ఆయన వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో మాత్రం తెలియడం లేదు.


ఉత్పత్తి పెరగకుండా, డబ్బును మాత్రమే ప్రజలకు పంపిణీ చేయడం వల్ల వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోతాయని చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయాన్ని ఆయన కావాలనే పరిగణించలేదని, స్పష్టమవుతోంది. ‘హెలికాప్టర్‌ మనీ’ వల్ల మన ఆర్థికవ్యవస్థ డిమానిటైజేషన్‌ పెనం మీద నుంచి పొయ్యిలో పడటం ఖాయం.గోళ్ళ నారాయణరావు

(విశ్రాంత బ్యాంకు అధికారి)

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.