ఆ వివాహాలు కులాన్ని నిర్మూలిస్తాయా?

ABN , First Publish Date - 2020-10-13T05:36:48+05:30 IST

సెప్టెంబర్‌ 29న ప్రచురించిన ‘ఏమి దుర్మార్గం!’ సంపాదకీయంలో ‘కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు ఒక మార్గమని పెద్దలు చేసిన నిర్దేశంలో అర్థం ఉన్నది-’ అని అన్నారు...

ఆ వివాహాలు కులాన్ని నిర్మూలిస్తాయా?

సెప్టెంబర్‌ 29న ప్రచురించిన ‘ఏమి దుర్మార్గం!’ సంపాదకీయంలో ‘కుల నిర్మూలనకు కులాంతర వివాహాలు ఒక మార్గమని పెద్దలు చేసిన నిర్దేశంలో అర్థం ఉన్నది-’ అని అన్నారు. పితృస్వామ్యం అమలులో ఉన్నది కనుక కులాంతర వివాహానికి కూడా మగవాడి కులమే సంతానానికి వర్తిస్తున్నప్పుడు కులనిర్మూలన ఎలా జరుగుతుంది? కులాధారంగా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నంతవరకు కుల నిర్మూలన జరుగుతుందా? పేదరికం అన్ని కులాలకు ఒకేవిధంగా బాధాకరం అయినప్పుడు, అగ్రకులం అనే కులంలో పుట్టినందువల్ల రిజర్వేషన్లు వర్తించవంటూ అనర్హత వేటు వేయడం వల్ల కులనిర్మూలన జరుగుతుందా? దళితుల్లో కొన్ని కులాలు రిజర్వేషన్లు ఎక్కువగా పొందుతున్నందున ఆ రిజర్వేషన్ల కోటాను వర్గీకరించమని, జనాభా ప్రాతిపదికన వేరు చేయమని ఉద్యమాలు చేస్తుంటే కులనిర్మూలన జరుగుతుందా? కులాంతర వివాహాలలో మగవాడి కులానికి రిజర్వేషను లేకపోయి, స్త్రీ కులానికి రిజర్వేషను ఉన్నప్పుడు వారి సంతానానికి రిజర్వేషను కల్పించాలంటే కులనిర్మూలన జరుగుతుందా? (ఆడా, మగా తేడా ఉండకూడదు కదా!) మానవ సంబంధాలన్నీ చాలా వరకు ఆర్థిక సంబంధాలైనపుడు ఒకే కులానికి చెందిన వాళ్లలో ధనిక, పేద, ఆఫీసరు, అతని కింద పని చేసేవాళ్ళకి సమానత్వం ఉంటుందా? మీరు చెప్పినట్టు, చదువులో, సంపాదనలో సరిసమానుల మధ్య కూడా వివాహానికి కులాలు అడ్డు అయితే ఎలా? రాజకీయాలలో కులాల ప్రాముఖ్యతతో, డబ్బుతో ఎన్నికలు జరుగుతున్నప్పుడు, కులాంతర వివాహాలలో పరువుహత్యలు జరుగుతున్నప్పుడు కులనిర్మూలన జరుగుతుందా? ‘బేటీ బచావో, బేటీ పడావో’ అనే నినాదం చాలా బాగుందనే వాళ్ళు ఆ తల్లిదండ్రులు చేసే పనికి, ఉద్యోగాలకు గాను వారి అవసరాలకు సరిపడే జీతం వచ్చే పద్ధతి, పరిస్థితి కల్పించకుండా ఒట్టి నినాదాలిచ్చి గొప్పలు చెప్పుకుంటే లాభమేమిటి? ఆడవాళ్లకు మగపిల్లలతో సమానంగా ఆస్తి ఇచ్చినా, ఎవరికి ఎక్కువ ఆస్తి వస్తే వారితోనే పెళ్లి జరిపిస్తారు కదా?

పాలంకి అంబరీషుడు­

Updated Date - 2020-10-13T05:36:48+05:30 IST