గీత దాటినందుకు వాతలు!

ABN , First Publish Date - 2020-05-24T06:03:43+05:30 IST

రాజ్యాంగ నిబంధనలు, చట్టాలకు లోబడి పనిచేయవలసిన అఖిల భారత సర్వీస్‌ అధికారులు, అందుకు విరుద్ధంగా ప్రభువుల అనుగ్రహం పొందడానికి తాపత్రయపడితే ఏమి జరగాలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రిని సంతోషపెట్టడం ముఖ్యమా...

గీత దాటినందుకు వాతలు!

ఇప్పుడు రాష్ట్రంలో ఏ చట్టం కింద కేసులు పెడుతున్నారో అర్థంకావడం లేదని నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ న్యాయవాది చంద్రశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘రెడ్డి గ్రూప్‌’ పేరిట వెలువడుతున్న పోస్టింగులపై ఎవరు చర్యలు తీసుకోవాలి? అని కూడా ఆయన ప్రశ్నించారు. సోషల్‌ మీడియాలో పోస్టులపై కేసులు పెట్టేవారికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనే అర్హత లేదని ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి... ఇప్పుడు తనకు ఆ అర్హత ఉందో లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా? ‘‘భావ ప్రకటన స్వేచ్ఛ మాకు మాత్రమే ఉంటుంది– ప్రత్యర్థులకు ఉండదు’’ అని చట్టం తెస్తారేమో తెలియదు! సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసుల ప్రవర్తన ముఖ్యంగా, సీఐడీ విభాగం పనితీరు జుగుప్సాకరంగా ఉంది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించవలసిన పోలీస్‌ అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించకూడదని నిర్లజ్జగా ఎలా హెచ్చరిస్తారు? అదేమని ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెడతామని పోలీసు పెద్దలు హెచ్చరిస్తున్నట్టు సమాచారం వస్తోంది.


ముఖ్యమైన పోస్టింగుల కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు దిగజారి ప్రవర్తించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ఇప్పుడు మరింత దిగజారి న్యాయస్థానాల ఆగ్రహానికి గురికావడానికి కూడా జంకడం లేదు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కోసం నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై పలువురు ఐఏఎస్‌ అధికారులు అవినీతి కేసులలో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ అనుభవం తర్వాత అఖిల భారత సర్వీస్‌ అధికారులు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని చాలా మంది భావించారు. అయితే, అందుకు భిన్నంగా పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మరింత దిగజారి ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీలం సాహ్ని వంటివారు ‘కోర్టు ధిక్కరణకు పాల్పడినా పర్వాలేదు– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ ముఖ్యం’ అనుకోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి?


రాజ్యాంగ నిబంధనలు, చట్టాలకు లోబడి పనిచేయవలసిన అఖిల భారత సర్వీస్‌ అధికారులు, అందుకు విరుద్ధంగా ప్రభువుల అనుగ్రహం పొందడానికి తాపత్రయపడితే ఏమి జరగాలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రభుత్వానికి నాయకత్వం వహించే ముఖ్యమంత్రిని సంతోషపెట్టడం ముఖ్యమా? లేక ప్రజాహితాన్ని దృష్టిలో పెట్టుకుని విచక్షణతో నిబంధనలు, చట్టాలకు లోబడి వ్యవహరించాలా? అని తేల్చుకోవలసిన పరిస్థితికి ఇప్పుడు ఆ రాష్ట్ర అధికారులు వచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే అమలు జరుగుతాయి. అయితే, ఆ నిర్ణయాలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉండాలి. అలా జరగనప్పుడు అభ్యంతర పెట్టవలసిన బాధ్యత అఖిల భారత సర్వీస్‌ అధికారులపై ఉంటుంది. విధి నిర్వహణలో నిబంధనలు, ధర్మాన్ని, చట్టాన్ని పాటించని పక్షంలో ఏమిజరగాలో ఆంధ్రప్రదేశ్‌లో అదేజరిగింది. శుక్రవారంనాడు హైకోర్టు ఇచ్చిన రెండు కీలక తీర్పులు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు తలవంపుగా మారాయి.


ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించడం లేదని విమర్శలు చేయడంతో సస్పెన్షన్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు ఆక్షేపించడమే కాకుండా.. రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థపై తమకు నమ్మకం పోయిందనీ, అందుకే సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నామనీ ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ పతాకాన్ని పోలిన రంగులు వేయడంపై గతంలోనే ఆక్షేపణ తెలిపినప్పటికీ అతి తెలివితో ఆ రంగులకు సరికొత్త నిర్వచనం ఇస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు మరో ఇద్దరు అధికారులపై కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదుచేసి విచారణ జరపనున్నట్టు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం కలగడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదంటూ తమ ఫిర్యాదులను తెలంగాణ పోలీసులకు ఇచ్చేవారు.


ఆ చర్య రాజకీయ ప్రేరేపితం కనుక పోలీసులు పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఏకంగా ఉన్నత న్యాయస్థానమే ఒకటికి రెండుసార్లు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదనడం పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌తోపాటు ఇతర ఐపీఎస్‌ అధికారులకు అవమానం కాదా? డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో విశాఖ పోలీసుల వ్యవహారశైలిని జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా తప్పుబట్టింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని డాక్టర్‌ సుధాకర్‌ దుర్భాషలాడటం తప్పే. అయితే అందుకు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలేగానీ ఒక వైద్యుడిని గాయపర్చడమే కాకుండా పిచ్చివాడనే ముద్రవేసే అధికారం పోలీసులకు ఎక్కడిది? సుధాకర్‌ మద్యం మత్తులో రోడ్డుపై న్యూసెన్స్‌ సృష్టించారని కొంత సేపు, ఆ తర్వాత ఆయన ఏకంగా మానసికరోగి అని మరికొంతసేపు చిత్రించడం హైకోర్టు ఆగ్రహానికి కారణమై ఉంటుంది. ఒక వైద్యుడి మానసిక స్థితి సరిగా లేదని మరో ప్రభుత్వ వైద్యుడు హడావుడిగా నిర్ధారించడంపై కూడా న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తంచేసింది.


సుధాకర్‌ ఒంటిపై ఒకటే గాయం ఉందని పోలీసులు సమర్పించిన నివేదికలో పేర్కొనగా, ఆరు గాయాలు ఉన్నాయని హైకోర్టు ఆదేశాల మేరకు సుధాకర్‌ను కలుసుకున్న విశాఖకు చెందిన మేజిస్ట్రేట్‌ తన నివేదికలో పేర్కొనడంతో పోలీస్‌ శాఖ ఆత్మరక్షణలో పడింది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు, ప్రభుత్వ వైద్యులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉన్నందున వాస్తవం తెలుసుకోవడానికై సీబీఐ విచారణకు ఆదేశిస్తున్నట్టు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విశాఖ పోలీసుల వ్యవహారశైలిని హైకోర్టు తప్పుబట్టడం ఇది రెండో పర్యాయం. గతంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును సీఆర్పీసీ సెక్షన్‌ 151 కింద అరెస్ట్‌ చేస్తున్నామని పోలీసులు విమానాశ్రయం వద్ద నోటీసు ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అప్పుడు న్యాయస్థానం ముందు హాజరైన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అలా ఆ సెక్షన్‌ కింద నోటీసు ఇవ్వడం తప్పేనని అంగీకరించడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. ఇంతవరకు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఈ నేపథ్యంలోనే డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో హైకోర్టు తీవ్రంగా స్పందించి ఉంటుంది. 


పరిమితులను దాటి.....

కార్యనిర్వాహక వ్యవస్థకు పరిమితులు ఉంటాయి. న్యాయ సమీక్షకు నిలబడేలా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగుల విషయంలో అధికారులు పదేపదే ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఫలితంగా కోర్టు ధిక్కరణను ఎదుర్కోబోతున్నారు. సర్వీస్‌ చివరిదశలో ఇటువంటి దుస్థితి ఏర్పడటాన్ని ఏ అధికారి కూడా జీర్ణించుకోలేరు. ఈ రంగుల వ్యవహారాన్ని హైకోర్టు తొలుత అభ్యంతరపెట్టగా, రాష్ట్ర ప్రభుత్వం పొరపాటును సరిదిద్దుకోకుండా సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. అధికారులు అప్పట్లో పరిస్థితిని గ్రహించి నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి ఉండాల్సింది. అలా చేయకుండా ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడానికై రంగులకు సరికొత్త అర్థాలు ఇస్తూ జీవో ఇచ్చారు.


వైసీపీ రంగులను తొలగించే వరకు స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా జరపకూడదని హైకోర్టు ఆదేశించినా అధికారులు అర్థం చేసుకోకుండా ప్రభుభక్తిని చాటుకుని ఇప్పుడు మూల్యం చెల్లించుకోబోతున్నారు. ముఖ్యమైన పోస్టింగుల కోసం ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు దిగజారి ప్రవర్తించడం ఇటీవలి కాలంలో పరిపాటిగా మారింది. ఇప్పుడు మరింత దిగజారి న్యాయస్థానాల ఆగ్రహానికి గురికావడానికి కూడా జంకడం లేదు. రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి కోసం నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలపై పలువురు ఐఏఎస్‌ అధికారులు అవినీతి కేసులలో చిక్కుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ అనుభవం తర్వాత అఖిల భారత సర్వీస్‌ అధికారులు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారని చాలా మంది భావించారు. అయితే, అందుకు భిన్నంగా పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మరింత దిగజారి ప్రవర్తించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.


అఖిల భారత సర్వీస్‌ అధికారులు ఏ పోస్టింగులో ఉన్నప్పటికీ వారికి జీతభత్యాలకు లోటు ఉండదు. కీలక పోస్టింగుల కోసం అధికారంలో ఉన్నవారి ప్రాపకం పొందే క్రమంలో అఖిల భారత సర్వీసులకు ఉన్న ప్రతిష్ఠను మంటగలుపుతున్నారు. నీలం సాహ్ని వంటివారు ‘కోర్టు ధిక్కరణకు పాల్పడినా పర్వాలేదు– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్ట్‌ ముఖ్యం’ అనుకోవడాన్ని ఎలా అర్థంచేసుకోవాలి? నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనుకున్నప్పుడు ఎవరు మాత్రం ఏమిచేయగలరు? తప్పు చేసినవాళ్లు శిక్ష అనుభవిస్తారు. ఉన్నత న్యాయస్థానాలలో తీర్పులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు సభ్యత, సంస్కారం ఉన్న ప్రభుత్వాలు ఆయా తప్పులను సరిదిద్దుకోవడం సహజం! జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఈ సున్నితత్వాన్ని కూడా పాటించడం లేదు. ‘‘మీరు ఎన్ని తీర్పులు వ్యతిరేకంగా ఇచ్చినా, మేము ఏమి చేయాలో అదే చేస్తాం.


ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. అది కూడా 50 శాతం ఓట్లతో 151 సీట్లు ఇచ్చారు. మమ్మల్ని అడ్డుకోవడానికి హైకోర్టు ఎవరు? ఎంతకాలం వ్యతిరేక తీర్పులిస్తారో మేం కూడా చూస్తాం’’ అని ఉన్నత న్యాయస్థానం సహనాన్ని పరీక్షించేలా వ్యవహరిస్తున్నారు. మందబలంతో చట్టాలు, నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. రాజ్యాంగం మాకు వర్తించదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని చెబుతున్న వాళ్లు న్యాయమూర్తులు అయినప్పటికీ వారికి కూడా దురుద్దేశాలు అంటగట్టడానికి వెనుకాడటం లేదు. న్యాయవ్యవస్థకు కులాన్ని అంటగట్టే దుస్సాహసానికి ఒడిగడుతున్నారు. ఇలాంటి విపరీత పోకడలను గతంలో ఎన్నడూ ఎవరూ చూడలేదు. శుక్రవారంనాడు హైకోర్టు తీర్పులు వెలువడిన వెంటనే పేటీఎం బ్యాచ్‌తోపాటు జగన్మోహన్‌ రెడ్డి ‘నీలి’ మీడియా నీడలో పనిచేస్తున్న వారంతా న్యాయస్థానంపై రెచ్చిపోయారు.


ఆంధ్రప్రదేశ్‌ను ప్రజలు ఎన్నుకున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కాకుండా హైకోర్టు పరిపాలించడం ఏమిటి? అంటూ చెలరేగిపోయారు. ‘‘తాగుబోతును (డాక్టర్‌ సుధాకర్‌) కాపాడటానికి సీబీఐని వాడతారా? కానిస్టేబుళ్లపై విచారణకు సీబీఐ అవసరమా?’’ వంటి పిచ్చి ప్రేలాపనలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీ మరొక అడుగు ముందుకేసి ఈ తీర్పుల వెనుక చంద్రబాబు హస్తం ఉందనుకునేలా మాట్లాడటమే కాకుండా చంద్రబాబు కాల్‌లిస్ట్‌ను పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. న్యాయస్థానాల పట్ల కనీస గౌరవంలేని ఇటువంటి వారిని కాదు– వారిని ఎన్నుకున్న ప్రజలను అనాలి! న్యాయాధికారులకు దురుద్దేశాలు ఆపాదించాలంటే సభ్యత, సంస్కారం ఉన్నవారు ఎవరైనా జంకుతారు. పేటీఎం బ్యాచ్‌తోపాటు నీలి బ్యాచ్‌కి అలాంటి వెరపు ఉండటం లేదు. ప్రభుత్వం చేస్తున్నది తప్పు అన్నవారందరిపై కాలకేయులవలె దండెత్తుతున్నారు.


ఒకటి కాదు రెండు కాదు– ఏకంగా 60కి పైగా సందర్భాలలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందంటే.. అందుకు ఆత్మవిమర్శ చేసుకోవలసింది పోయి.. ఎదురుదాడికి దిగడం నాగరికత ఎలా అవుతుంది? ఈ ‘బ్లూ’ గ్యాంగ్‌ తెలుసుకోవలసింది ఏమిటంటే, ఆయా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులలో వారు ఊహించే కులానికి చెందినవారు లేకపోవడం! హైకోర్టు తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన సందర్భాలలో కూడా ఉపశమనం లభించడం లేదంటే లోపం మనలోనే ఉందని గ్రహించకుండా న్యాయవ్యవస్థకు కూడా రంగులు అద్దే దుస్సాహసానికి బూతు బ్యాచ్‌ దిగజారుతోంది. మందబలం ఉందని ఎదురుదాడి చేసినంత మాత్రాన భయపడిపోయే బలహీన వ్యవస్థలు కావు మనవి. అందుచేత ఆంధ్రప్రదేశ్‌ ప్రజలలో అత్యధికులు ఉన్నత న్యాయస్థానం ఆదుకుంటుందన్న నమ్మకంతో జీవిస్తున్నారు. వారికి ఆ ఆశ కూడా లేకుండా చేయడానికైౖ న్యాయవ్యవస్థ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలకు నీలి మీడియా ఇప్పుడు పూనుకుంది. అఖిల భారత సర్వీస్‌ అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవని పక్షంలో ఇబ్బందులను కొనితెచ్చుకున్నవాళ్లు అవుతారు. ఫలితం కూడా అనుభవిస్తారు.


అప్పుడు పెడబొబ్బలు... ఇప్పుడు!

సోషల్‌ మీడియా వేదికగా జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిపై ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు కేసులు పెట్టడమే కాకుండా ‘ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు– ప్రభుత్వాన్ని విమర్శించకూడదు’ అని లేని అధికారాన్ని సంక్రమింపజేసుకుని కన్నెర్ర చేస్తున్నారు. ‘‘కడుపుమండి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్లను అరెస్ట్‌ చేసేవారికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనే అర్హత లేదు’’ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సెలవిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారితోపాటు వైఎస్‌ఆర్‌ అభిమానులు పోస్టులు పెట్టాలని అప్పట్లో జగన్‌ పిలుపునిచ్చారు. ‘‘అధికార మదం తలకెక్కి పోలీసులను పంపితే భయపడవద్దు– అండగా మేముంటాం’’ అని ఆయన ప్రకటించారు.


ఈ సందర్భంగా ‘‘నిర్భయంగా దండెత్తండి– సోషల్‌ మీడియా సైనికులకు వైఎస్‌ జగన్‌ పిలుపు’’ అని నీలి మీడియాలో బ్యానర్‌ వార్త అచ్చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిని అణచివేయడానికి ఇది నియంతల కాలం కాదు అని అదే నీలి మీడియాలో ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్నవాళ్లు అప్పట్లో వ్యాసాలు రాశారు. చాలామంది చాలా రూపాల్లో ఇలాంటి రాతలే రాశారు. ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై అప్పటికే చలామణిలో ఉన్న పలు సందేహాలతో రంగనాయకమ్మ అనే వృద్ధురాలు పోస్ట్‌ పెట్టారు. దీంతో ఆమెపై కేసు పెట్టి అరెస్ట్‌ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఎలా పెడతారంటూ సీఐడీ పోలీసులు ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంపై దండెత్తమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియా సైనికులకు పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఈ చర్యని ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధిత ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యులు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇద్దరు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.


దీనిపై అప్పట్లో పెడబొబ్బలు పెట్టినవాళ్లు ఇప్పుడు ప్రభుత్వ చర్యలను సమర్థిస్తున్నారు. అప్పట్లో బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసులు పెట్టారు. ఇప్పుడు సీఐడీ విభాగం ప్రకటించిన వాట్సాప్‌ నంబర్‌కు అధికార పార్టీకి చెందిన ఎవరు ఫిర్యాదు చేసినా కేసులు పెడుతున్నారు. నీలి బ్యాచ్‌ పోస్టింగులపై నొచ్చుకున్న వాళ్లు చేసే ఫిర్యాదులను మాత్రం బుట్టదాఖలు చేస్తున్నారు. ఇలాంటి నీతిబాహ్యమైన చర్యలకు పాల్పడటం వల్లనే రాష్ట్ర పోలీసులపై నమ్మకం పోయిందని హైకోర్టు వ్యాఖ్యానిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టంలోని సంబంధిత నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేసినందున ఇప్పుడు రాష్ట్రంలో ఏ చట్టం కింద కేసులు పెడుతున్నారో అర్థంకావడం లేదని నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్‌ న్యాయవాది చంద్రశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘రెడ్డి గ్రూప్‌’ పేరిట వెలువడుతున్న పోస్టింగులపై ఎవరు చర్యలు తీసుకోవాలి? అని కూడా ఆయన ప్రశ్నించారు.


సోషల్‌ మీడియాలో పోస్టులపై కేసులుపెట్టేవారికి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొనే అర్హత లేదని ప్రకటించిన జగన్మోహన్‌ రెడ్డి... ఇప్పుడు తనకు ఆ అర్హత ఉందో లేదో ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా? ‘‘భావ ప్రకటన స్వేచ్ఛ మాకు మాత్రమే ఉంటుంది– ప్రత్యర్థులకు ఉండదు’’ అని చట్టం తెస్తారేమో తెలియదు! సోషల్‌ మీడియా పోస్టులకు సంబంధించిన వ్యవహారంలో పోలీసుల ప్రవర్తన ముఖ్యంగా, సీఐడీ విభాగం పనితీరు జుగుప్సాకరంగా ఉంది. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించవలసిన పోలీస్‌ అధికారులు ప్రభుత్వాన్ని విమర్శించకూడదని నిర్లజ్జగా ఎలా హెచ్చరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించకుండా కాపాడే బాధ్యతను, అధికారాన్ని జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కొత్తగా పోలీసులకు ఏమైనా కట్టబెట్టిందా అంటే అలాంటి దాఖలాలు లేవు. అదేమని ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెడతామని పోలీసు పెద్దలు హెచ్చరిస్తున్నట్టు సమాచారం వస్తోంది.


శ్రుతిమించిన ప్రభు భక్తి... 

అధికారంలో ఉన్న పార్టీలు పోలీసులను తమకు అనుకూలంగా వాడుకోవడం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా అడగకపోయినా ప్రభుత్వాధినేత మనసులో ఏమి ఉందో గ్రహించి అందుకు అనుగుణంగా పోలీసులే అధికార పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం ఎబ్బెట్టుగా ఉంది. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే సమాధానం చెప్పుకోవడానికి అధికార పార్టీ నాయకులు ఉన్నారు. ఇందులో పోలీసులకు ఏమి పని? సోషల్‌ మీడియాలో జుగుప్సాకర పోస్టింగులను అన్ని పక్షాల వారు పెడుతున్నారు. అన్ని పార్టీలలో సోషల్‌ మీడియా బాధితులు ఉన్నారు. వ్యక్తుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగినప్పుడు, మనోభావాలను దెబ్బతీసిన సందర్భాలలో సంబంధితుల నుంచి ఫిర్యాదు వస్తే కేసులు పెట్టడం లో తప్పులేదు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై దారినపోయే దానయ్య ఫిర్యాదు చేశారంటూ కేసులు పెట్టడమే విడ్డూరంగా ఉంది.


నీతివంతమైన రాజకీయాల గురించి నిద్రపోతూ కూడా కలవరించే జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఇలా జరగడం బాగాలేదు. రంగనాయకమ్మ అనే మహిళ ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించారు. జగన్మోహన్‌ రెడ్డిని గానీ, మరొకరిని గానీ పేరుపెట్టి కూడా తిట్టలేదు. అయినా ఆమెను విచారణ పేరుతో పోలీసులు వేధిస్తున్నారు. ఇలా చేయడం వల్లనే కదా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవలసి వస్తోంది. ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా నీలి బ్యాచ్‌తోపాటు ఎంపీ సైతం న్యాయవ్యవస్థను టార్గెట్‌ చేసుకోవడం ఏమిటి? అధికారం ఉంది కదా అని ఏదైనా చేస్తామంటే కుదరదు. ఇలాంటి దుస్థితి దాపురిస్తుందనే కాబోలు మన రాజ్యాంగ నిర్మాతలు అన్ని వ్యవస్థలకు కట్టుబాట్లు విధించారు. మాకు 151 సీట్లు వచ్చాయి కనుక ఏ కట్టుబాట్లూ వర్తించవు అనుకుంటే కుదరదు. జగన్మోహన్‌ రెడ్డికి ఇంతటి భారీ మెజారిటీ లభించి సరిగ్గా ఏడాది అయింది.


వివిధ కారణాల వల్ల ప్రజలు ఆయనను నమ్మారు. ప్రజాభిప్రాయం ఎప్పుడు స్థిరంగా ఉండదు. మందబలం ఉంది కనుక ఎవరూ అడ్డురాకూడదు అనుకునేవారికి రాజ్యాంగం కల్పించిన కట్టుబాట్లు అడ్డు తగులుతూనే ఉంటాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడేవారికి ఏదో ఒకనాటికి శిక్ష తప్పదు. శుక్రవారం నాడు వెలువడిన హైకోర్టు తీర్పుల తర్వాత అయినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ యంత్రాంగం తన వైఖరి మార్చుకుంటుందని ఆశిద్దాం! పోలీసులు కూడా కనీస న్యాయసూత్రాలను పాటించాలని కోరుకుందాం! నీలిబ్యాచ్‌ నుంచి ఎదురవుతున్న దాడుల వల్ల న్యాయవ్యవస్థ ఆత్మస్థయిర్యం దెబ్బతినకుండా కాపాడుకోవలసిన బాధ్యత ప్రజలపైనే ఉంది.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి వంటి వారికి ముకుతాడు వేయగలిగేది ప్రస్తుతం న్యాయవ్యవస్థ మాత్రమే! పాలకుల మెప్పుకోసం చొక్కాలు చించుకుంటున్న అధికారులు, ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి ఎదురైన దుస్థితిని గుర్తుపెట్టుకోవడం మంచిది. అతిగా ప్రవర్తించే అధికారులకు ఏదో ఒక రోజు శిక్షపడటం ఖాయమని గత ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. ఏపీ అధికారులలో ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందో లేదో వేచిచూద్దాం. ‘‘ని‍కార్సయిన మనిషికి ఒక మాట చాలు’’ అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. ఇందులోని నీతిని గ్రహించవలసినవాళ్లు గ్రహిస్తే ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు.

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-05-24T06:03:43+05:30 IST