వెళ్లేవారు వెళ్లొచ్చు

ABN , First Publish Date - 2022-06-25T08:28:25+05:30 IST

‘మీ అబ్బాయి ఎంపీ. నీ కుమారుడి లాగానే మా అబ్బాయి కూడా రాజకీయంగా ఎదగకూడదా?’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేను సూటిగా ప్రశ్నించారు.

వెళ్లేవారు వెళ్లొచ్చు

మనం శివసేనను పునర్నిర్మించుకుందాం

పార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ 

మీ అబ్బాయి పార్లమెంటు సభ్యుడయ్యాడు

మా అబ్బాయి రాజకీయంగా ఎదగవద్దా?

ఏక్‌నాథ్‌ షిండేను నిలదీసిన శివసేన అధినేత 

రెబెల్స్‌తో తాడో పేడో తేల్చుకునేందుకే సిద్ధం

షిండే గూటికి తాజాగా మరో ‘సేన’ ఎమ్మెల్యే

జాతీయ పార్టీపై మారిన షిండే మాట

తానన్న ‘మహాశక్తి’ బాల్‌ ఠాక్రే అని వివరణ

సీఎం ఠాక్రేతో శరద్‌పవార్‌ మంతనాలు


మీరు ఒక చెట్టు నుంచి పండ్లను, పూలను తీసేసుకోవచ్చు. కానీ, వేర్లను పెకలించలేరు. వేర్లు బలంగా ఉన్నంతకాలం ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రతి రుతువులో కొత్త ఆకులు చివురిస్తాయి. కొత్తగా పండ్లు కాస్తాయి. తెగులు సోకిన ఆకులను తుంచిపారేయాలి. ప్రస్తుత పరిస్థితిని ఆ కోణంలోనే చూడాలి.

- షిండే తిరుగుబాటు నేపథ్యంలో పార్టీ వర్గాల నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు


మనం శివసేనను పునర్నిర్మించుకుందాం.. పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఉద్ధవ్‌ 

ముంబై, గువాహటి, జూన్‌ 24: ‘‘మీ అబ్బాయి ఎంపీ. నీ కుమారుడి లాగానే మా అబ్బాయి కూడా రాజకీయంగా ఎదగకూడదా?’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండేను సూటిగా ప్రశ్నించారు. సాధారణంగా ముఖ్యమంత్రులు మాత్రమే అట్టిపెట్టుకునే అత్యంత కీలకమైన పట్టణాభివృద్ధి శాఖను షిండేకు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. రెబెల్‌ ఎమ్మెల్యేలను తెగులు తగిలిన ఆకులు, పండ్లతో పోల్చారు. వేర్లు (కార్యకర్తలు, పార్టీ నిర్మాణం) బలంగా ఉన్నంతకాలం ఒక మహావృక్షానికి (పార్టీ) వచ్చిన నష్టమేమీ లేదని తేల్చిచెప్పారు. తెగులు సోకిన ఆకులు, పండ్లను తుంచేస్తే కొత్త చిగురు వస్తుందని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ వర్గాలను ఉద్దేశించి చేసిన వర్చువల్‌ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బీజేపీతో కలిసి వెళ్లాలని ఎమ్మెల్యేలు అనుకుంటున్నట్టు షిండే కొన్నాళ్ల క్రితమే తనతో చెప్పారని ఠాక్రే వెల్లడించారు. అప్పుడు తాను.. ‘‘బీజేపీ వాడుకుని వదిలేసే విధానం పట్ల, మాతోశ్రీ (ఠాక్రేల అధికారిక నివాస భవనం)పై నిరాధార ఆరోపణలపైన మీకు కోపం లేదా? మీరేం శివసైనికులు’’ అని షిండేతో అన్నట్లు తెలిపారు. బాల్‌ ఠాక్రే మరణం తర్వాత షిండే రెండుసార్లు మంత్రి అయ్యారని.. రెండుసార్లు తాము అధికారంలో ఉన్నామని, సాధారణంగా సీఎంల వద్ద అట్టిపెట్టుకునే శాఖలను షిండేకు ఇచ్చామని గుర్తుచేశారు. ‘‘మనతో ఎవరూ లేరు అనే భావిద్దాం. శివసేనను పునర్నిర్మించుకుందాం’’ అని పార్టీ వర్గాలను ఉద్దేశించి అన్నారు. రెబెల్స్‌తో కలిసి వెళ్లాలనుకునేవారిని తాను ఆపనని తేల్చిచెప్పారు. గువాహటిలో ఉన్న రెబెల్‌ ఎమ్మెల్యేలను ఖైదీలుగా అభివర్ణించారు. పార్టీని నడపడానికి తాను అనర్హుడినని భావిస్తే, ఆ పదవిని త్యజించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. సీఎం పదవి తనకు అప్రధానమైనదని అన్నారు. గత ఏడాది దీపావళి నుంచి తన ఆరోగ్యం బాగోలేదని.. వెన్నెముక సమస్యతో కనీసం లేచి నిలబడలేని, నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు చెప్పారు. తనకు సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారని.. మెడ నుంచి కాలి వేలి దాకా కదపలేకపోతున్నానని, దానికోసం మరో సర్జరీ చేయించుకున్నానని వివరించారు. ఈ సమయమే తనపై దాడికి సరైన సమయంగా ప్రత్యర్థులు భావించారని ఆవేదన వెలిబుచ్చారు. తిరుగుబాటు నేతలతో తాడో పేడో అనే రీతిలోనే ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్టు ఈ ప్రసంగాన్ని బట్టి అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కాగా.. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌ శుక్రవారం సాయంత్రం ఉద్ధవ్‌ ఠాక్రేను ఆయన నివాసంలో కలిసి తాజా పరిణామాలపై చర్చించారు. ఆయనతో పాటు ఆయన మేనల్లుడు అజిత్‌పవార్‌, ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌పాటిల్‌ కూడా పాల్గొన్నారు.


మాట మారింది..

తనతో 37 మంది సేన ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు ఉన్నట్టు తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ షిండే గురువారం రాత్రి పొద్దుపోయాక వరుస ట్వీట్ల ద్వారా తెలిపారు. శుక్రవారం శివసేనకు చెందిన మరో ఎమ్మెల్యే దిలీప్‌ లాండే షిండే గూటికి చేరారు. దీంతో ఠాక్రేకు మద్దతుగా ఉన్న సేన ఎమ్మెల్యేల సంఖ్య 12కు తగ్గింది. ఇక.. ‘ఒక జాతీయ పార్టీ, మహాశక్తి మన వెనక ఉంది’ అంటూ రెబెల్‌ ఎమ్మెల్యేలతో ఒక వీడియోలో మాట్లాడుతూ కనిపించిన ఏక్‌నాథ్‌ షిండే  శుక్రవారం మాట మార్చారు. ‘‘ఏ జాతీయ పార్టీ మాతో సంప్రదింపులు జరపట్లేదు’’ అని చెప్పారు. 12 మంది సభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ శివసేన డిప్యూటీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేసిన విషయంపైనా షిండే స్పందించారు. శివసేన 55 మంది ఎమ్మెల్యేలో 40 మంది గువాహటిలో తనతోనే ఉన్నారని, ప్రజాస్వామ్యంలో మెజారిటీ, అంకెలే ముఖ్యమని.. కాబట్టి నిజమైన శివసేన తమదేనని.. అనర్హత వేటు పేరుతో తమను భయపెట్టలేరని వ్యాఖ్యానించారు. 


బలపరీక్షలో గెలుస్తాం..

తిరుగుబాటు నేపథ్యంలో సేన ఎమ్మెల్యేల సంఖ్య తగ్గినమాట నిజమేగానీ.. సభలో జరిగే బలపరీక్షలో రెబెల్‌ ఎమ్మెల్యేల్లో చాలామంది తమకు మద్దతిస్తారని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విశ్వాసం వ్యక్తం చేశారు.  అయితే.. ఆయా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆయన నిప్పులు చెరిగారు. ‘‘వారు తప్పు నిర్ణయం తీసుకున్నారు. వెనుదిరిగి రావడానికి వారికి మేం ఒక చాన్స్‌ ఇచ్చాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు ముంబై రావాలని సవాల్‌ చేస్తున్నాం. మేం జాలిపడబోము. సభలో జరిగే బలపరీక్షలో గెలుస్తాం. రోడ్లపై యుద్ధం జరిగితే దాంట్లోనూ గెలుస్తాం. మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వం మిగతా రెండున్నరేళ్లూ అధికారంలోనే ఉంటుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన కొన్నిగంటలకే ‘యువ సేన’ కార్యకర్తలు షిండే శిబిరంలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల (మంగేశ్‌ కుడల్కర్‌, దిలీప్‌ లాండే) కార్యాలయాలను ధ్వంసం చేశారు. శివసైనికులు వీధిపోరాటాలకు దిగొచ్చనే సంకేతాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా  పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు. కాగా.. శివసేనలో తిరుగుబాటుకు తమ పార్టీకి సంబంధం లేదని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూడా తమకు ఎలాంటి ప్రతిపాదనా రాలేదని ఆయన తెలిపారు. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయనకు లేదని వారు పేర్కొన్నారు. 


ఏ హిందుత్వ నేర్పింది?

శివసేన పార్టీ ‘హిందుత్వ’కు దూరంగా జరుగుతోందంటూ తిరుగుబాటు నేత షిండే చేసిన ప్రకటనపై ఆ పార్టీ నేత ప్రియాంక చతుర్వేది ఘాటుగా స్పందించారు. ‘ఒక కుటుంబంలా ఉన్న పార్టీకి వెన్నుపోటు పొడవాలని ఏ ‘హిందుత్వ’ మీకు నేర్పింది?’ అని నిలదీశారు. ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్యఠాక్రే వల్ల పార్టీ హిందుత్వకు దూరంగా జరుగుతోందన్న అసంతృప్తి పార్టీలోని కొన్ని వర్గాల్లో ఉందా అని ప్రశ్నించగా.. ‘‘రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి ప్రతి పార్టీ ముందుకెళ్తుంది. బీజేపీకూడా అంతేకదా? వాజపేయీ హయాంలో ఉన్న బీజేపీతో పోలిస్తే ఇప్పటి బీజేపీ భిన్నమైనదే కదా?’’ అని ప్రశ్నించారు. షిండే తిరుగుబాటుకు కారణం ‘హిందుత్వ’ కాదని ఆమె తేల్చిచెప్పారు. ఆయనకు క్యాబినెట్‌లో రెండో ముఖ్యమైన శాఖ ఇచ్చారని.. ఆయన కుమారుడు ఎంపీ అని గుర్తుచేశారు. షిండేతో ఉన్న ఎమ్మెల్యేలు పరీక్షకు నిలబడరని.. వారితో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.

Updated Date - 2022-06-25T08:28:25+05:30 IST