విద్వేష వ్యాఖ్యలు చేసిన వారు బెయిలుపై బయట.. దానిని బయటపెట్టిన వారు జైల్లోనా? ఏం జరుగుతోందీ దేశంలో: సీనియర్ న్యాయవాది

ABN , First Publish Date - 2022-07-09T23:13:44+05:30 IST

‘‘విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినవారు బెయిలుపై బయట ఉన్నారు. వాటిని బయటపెట్టిన వారు మాత్రం జైలులో ఉన్నారు.

విద్వేష వ్యాఖ్యలు చేసిన వారు బెయిలుపై బయట.. దానిని బయటపెట్టిన వారు జైల్లోనా? ఏం జరుగుతోందీ దేశంలో: సీనియర్ న్యాయవాది

న్యూఢిల్లీ: ‘‘విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినవారు బెయిలుపై బయట ఉన్నారు. వాటిని బయటపెట్టిన వారు మాత్రం జైలులో ఉన్నారు. ఏం జరుగుతోందీ దేశంలో’’ అని సీనియర్ న్యాయవాది కోలిన్ గోన్సాల్వెస్ (Colin Gonsalves) వ్యాఖ్యానించారు. ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్‌ (Mohammed Zubair)పై ఉత్తరప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.


జుబైర్ ఓ ట్వీట్ చేస్తూ హిందూ మత పెద్దలు యతి నర్సింగానంద్ సరస్వతి (Yati Narasinghanand Saraswati), బజ్‌రంగ్ ముని(Bajrang Muni), ఆనంద్ స్వరూప్‌ (Anand Swaroop)లు ‘ద్వేష ప్రేమికులు’ (Hate Mongers) అని అభివర్ణించారు. దీనిపై సీతాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వారు ముగ్గురూ చేసిన విద్వేష పూరిత వ్యాఖ్యలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకే జుబైర్ ఆ ట్వీట్ చేశారని గోన్సాల్వెస్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ ట్వీట్‌లో అభ్యంతరకర విషయం ఏమీ లేదని, ఏ మతాన్ని అది కించపరచలేదని పేర్కొన్నారు.


ఆల్ట్ న్యూస్ ఫౌండర్లలో జుబైర్ ఒకరని, ఫ్యాక్ట్ చెక్ విషయంలో దీనికి ఎంతో పేరుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతికి కూడా ఈ వెబ్‌సైట్‌ను సిఫార్స్ చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముస్లిం మహిళలను కిడ్నాప్ చేస్తామని, వారిని అత్యాచారం చేస్తామని బెదించిన బజరంగ్ ముని చేసిన వ్యాఖ్యల వీడియోను ట్వీట్ చేస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సీతాపూర్ పోలీసులను ట్యాగ్ చేశారని పేర్కొన్నారు. ఆ ట్వీట్ చేసింది తానేనని జుబైర్ అంగీకరించిన తర్వాత కూడా ఆయన ల్యాప్‌టాప్‌, మొబైల్‌ను సీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు.


సీతాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో విచారణ అధికారి తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ.. జుబైర్ ఆ ఆ ట్వీట్ ద్వారా హింసను ప్రేరేపించారని వాదించారు. బజరంగ్ ముని ఓ గౌరవం కలిగిన మహంత అని, అలాంటి వ్యక్తిని పట్టుకుని ‘ద్వేష ప్రేమికుడు’ అనడం వల్ల సమస్యలు వస్తాయని అన్నారు. ట్వీట్ చేసి ఈ ప్రపంచం మొత్తానికి చెప్పడం కంటే పోలీసులకు ఓ లేఖ రాసి ఉంటే సరిపోయేదని అన్నారు.


దీనికి ప్రతిగా గోన్సాల్వెస్ మాట్లాడుతూ.. తాను కేవలం బజరంగ్ ముని చేసిన ప్రసంగాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ప్రసంగాన్ని జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించి యూపీ డీజీపీకి లేఖ రాసినట్లు ‘హిందుస్థాన్ టైమ్స్’ కథనాన్ని ఆయన ఈ  సందర్భంగా ఉదహరించారు. ద్వేషపూరిత కేసుల్లో యతి నర్సింగానంద్‌ అరెస్టయ్యారని, సుప్రీం కోర్టుపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు ప్రారంభించేందుకు భారత అటార్నీ జనరల్ అనుమతి కూడా మంజూరు చేశారని పేర్కొన్నారు.


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Tushar Mehta).. జుబైర్ అభ్యర్థనను వ్యతిరేకించారు. దేశాన్ని అస్థిరపరిచే ఉద్దేశంతో క్రమం తప్పకుండా ఇలాంటి ట్వీట్లను పోస్టు చేసే సిండికేట్‌లో ఆయన భాగమా? అన్న దానిపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జుబైర్ చేసిన ట్వీట్లు శాంతిభద్రతల సమస్యలు సృష్టించాయని, ఆయనపై ఇప్పటికే 6 ఇతర కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.  అంతేకాదు, అభ్యంతరకర ట్వీట్లు ఎన్నింటినో ఆయన తొలగించారని కోర్టుకు తెలిపారు. ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకున్నామని, వారిని  ఎవరూ సమర్థించడం లేదని పేర్కొన్నారు.


వాదనలు విన్న జస్టిస్ ఇందిరా బెనర్జీ (Indira Banerjee), జస్టిస్ జేకే మహేశ్వరి JK Maheshwari)తో కూడిన వెకేషన్ బెంచ్ జుబైర్‌కు 5 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమయంలో అతను ఎలాంటి ట్వీట్లు చేయకూడదని షరతు విధించింది. ఎఫ్‌ఐఆర్‌లో విచారణపై స్టే ఇవ్వలేదని, ఆయనపై పెండింగ్‌లో ఉన్న ఇతర కేసులకు మధ్యంతర ఉపశమనం వర్తించదని బెంచ్ స్పష్టం చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయడానికి అలహాబాద్ హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ జుబైర్ ఇష్టపడే ఎస్‌ఎల్‌పిని కోర్టు పరిశీలిస్తోంది. 

Updated Date - 2022-07-09T23:13:44+05:30 IST