
న్యూఢిల్లీ: ఎర్ర టోపీలు ఉత్తరప్రదేశ్‌కు 'రెడ్ అలర్ట్' అంటూ యూపీ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ సమాజ్‌వాదీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఘాటుగా స్పందించారు. బుధవారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆస్తులను అమ్మేస్తున్న వాళ్లే ఎరుపు రంగును చూసి భయపడుతున్నారని అన్నారు. ''ఇది అమ్మకాల ప్రభుత్వం. ఇప్పటివరకూ వాళ్లది అబద్ధాల ప్రభుత్వమే. ఇప్పుడు అమ్మకాల ప్రభుత్వంగా కూడా మారింది. వాస్తవ సమస్యలపై చర్చించడం ఇష్టం లేనందునే వాళ్లు ఇలాటి వ్యాఖ్యలు చేస్తున్నారు'' అని అఖిలేష్ కౌంటర్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో ఎర్ర టోపీ మార్పునకు సంకేతమని, యూపీ మార్పును కోరుకుంటోందని అఖిలేష్ తెలిపారు. బీజేపీవన్నీ బూటకపు వాగ్దానాలేనని, నిరంతరం అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడ్డారని, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను బీజేపీ నిలబెట్టుకుందా అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందా? యువకులకు ఉద్యోగాలు వచ్చాయా? అని నిలదీశారు.