Advertisement

ప్రజలు మరణిస్తుంటే సుల్తాన్ కొత్త ఇంటి నిర్మాణంలో బిజీగా ఉన్నారు: కాంగ్రెస్

May 4 2021 @ 20:41PM

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రతి రోజూ వేలాదిమంది కొవిడ్ బారినపడి మరణిస్తుంటే వారి రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ప్రధానమంత్రి ఇంటిని నిర్మించడానికి ప్రాధాన్యం ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టును 2022 నాటికి పూర్తిచేయాలన్న ప్రభుత్వ గడువుపై స్పందిస్తూ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలు చేసింది. 


ప్రజల ప్రాణాల కంటే ప్రధాని అహమే గొప్పదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజలకు పూర్తిగా టీకాలు వేయకుండా, ఆక్సిజన్ లేక ప్రాణాలు విడుస్తున్న వారికి అది కల్పించకుండా, కరోనా వేళ ఆర్థిక సాయం చేయకుండా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కోసం రూ. 13,450 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని రాహుల్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రాణాల కోసం పోరాడుతుంటే సుల్తాన్ మాత్రం కోట నిర్మాణంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. 

 

ఆక్సిజన్, వ్యాక్సిన్లు, ఆసుపత్రిలో పడకలు, మందుల కోసం దేశ ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం మాత్రం ప్రధాని కొత్త ఇంటి కోసం రూ. 13,000 కోట్లు ఖర్చు చేస్తోందని ఓ ట్వీట్‌లో ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు. ఇలాంటి ఖర్చుల వల్ల ప్రభుత్వానికి వేరే ప్రాధామ్యాలు ఉన్నాయన్న తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయన్నారు. ప్రభుత్వం తన నిర్ణయంపై పునరాలోచించాలని, ఆరోగ్య కల్పన, ప్రజల ప్రాణాల రక్షణ కోసం ఆ సొమ్మును ఖర్చు చేయాలని కోరారు. 


రోజూ వేలాదిమంది కరోనాతో ప్రాణాలు కోల్పోతుంటే ‘ఫకీర్’ మాత్రం తన కోసం కొత్త భవనం నిర్మించుకుంటున్నారని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. 14 శతాబ్దంలో ఢిల్లీ సుల్తాన్ మహ్మద్ బిన్ తుగ్లక్ కరెన్సీని మార్చడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడని, నోట్ల రద్దు ద్వారా మోదీ కూడా అదే పనిచేశారని గోహిల్ విమర్శించారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.