ముంబైకి తరలివస్తున్న వేలాదిమంది రైతులు!

ABN , First Publish Date - 2021-01-24T22:19:34+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా

ముంబైకి తరలివస్తున్న వేలాదిమంది రైతులు!

ముంబై: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఆందోళన ఇంకా కొనసాగుతుండగా, వారికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా నిన్న (శనివారం) మహారాష్ట్రలోని 21 జిల్లాల రైతులు ఏకమయ్యారు. 


చిన్నచిన్న రైతు సంఘాలన్నీ కలిసి ‘ఆల్ ఇండియా కిసాన్ సభ’ పేరుతో ఒక్కటయ్యాయి. రాష్ట్రంలోని వేలాదిమంది రైతులు నిన్న నాసిక్‌లో కలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా 180 కిలోమీటర్ల దూరంలోని ముంబైకి బయలుదేరారు. లక్షలాదిమంది రైతులు బ్యానర్లు, జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ ముంబైకి తరలివస్తున్నారు. మరికొన్ని గంటల్లో రైతులు ముంబైలోని ప్రఖ్యాత ఆజాద్ మైదాన్‌‌కు చేరుకోనున్నారు. 


అక్కడ రేపు (సోమవారం) భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి ఎన్‌సీపీ నేత శరద్ పవర్ హాజరవుతారు. మరోవైపు, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులు గణతంత్ర దినోత్సవం నాడు వెయ్యి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీ చుట్టూ ఉన్న రింగు రోడ్డులో ఈ ర్యాలీ జరగనుంది. ర్యాలీ కోసం రైతులు పోలీసుల అనుమతి కోరారు. ర్యాలీకి అనుమతి వచ్చిందని చెప్పిన రైతులు.. రూటు విషయంలో పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదని, మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

Updated Date - 2021-01-24T22:19:34+05:30 IST