వ్యాపారికి బెదిరింపు

ABN , First Publish Date - 2022-06-30T06:12:23+05:30 IST

నగరానికి చెందిన ఒక వ్యాపారిని బెదిరించడంతోపాటు దౌర్జన్యంగా అతని కారు, బుల్లెట్‌ను తీసుకువెళ్లిన రౌడీషీటర్‌తోపాటు విశ్రాంత పోలీస్‌ అధికారి ఒకరిని టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

వ్యాపారికి బెదిరింపు

రౌడీషీటర్‌, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి అరెస్టు

రియల్‌ ఎస్టేట్‌ వ్యవహారంలో

రూ.60 వేలు ఇవ్వలేదని

దౌర్జన్యంగా కారు, ద్విచక్ర వాహనం

తీసుకుపోవడంతో కేసు నమోదు

విశాఖపట్నం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): నగరానికి చెందిన ఒక వ్యాపారిని బెదిరించడంతోపాటు దౌర్జన్యంగా అతని కారు, బుల్లెట్‌ను తీసుకువెళ్లిన రౌడీషీటర్‌తోపాటు విశ్రాంత పోలీస్‌ అధికారి ఒకరిని టూటౌన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన సీఐ వెంకటరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. 

మధురవాడలోని ఒక స్థలం విక్రయం వ్యవహారంలో డాబాగార్డెన్స్‌లో కార్‌ స్పేర్స్‌ దుకాణం నిర్వహిస్తున్న వీరవెంకటరమణకు ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌ పరిధికి చెందిన రౌడీషీటర్‌ రాకోటి కృష్ణ, విశ్రాంత సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేఎస్‌ఎన్‌ కొండతో పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారంలో రూ.60 వేలు ఖర్చవడంతో ఆ మొత్తాన్ని తాను ఇచ్చేస్తానని కృష్ణకు వీరవెంకటరమణ హామీ ఇచ్చారు. సొమ్ము చెల్లించడంలో జాప్యం జరగడంతో కృష్ణ పదేపదే ఫోన్‌ చేసి వెంకటరమణను బెదిరించేవాడు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తనతో కలిసి వుంటున్న రిటైర్డ్‌ సీఐ కేఎస్‌ఎన్‌ కొండ సహాయంతో కృష్ణ డాబాగార్డెన్స్‌లోని వెంకటరమణ దుకాణం వద్దకు వెళ్లాడు. అక్కడ పార్కింగ్‌ చేసి వున్న స్కార్పియో వాహనంతోపాటు బుల్లెట్‌ను దౌర్జన్యంగా తీసుకుపోయాడు. దీనిపై బాధితుడు నేరుగా సీపీ సీహెచ్‌ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేయగా...టూటౌన్‌ పోలీసులను కేసు నమోదుచేసి దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశించారు. దీనిపై టాస్క్‌ఫోర్స్‌, టూటౌన్‌ పోలీసులు సంయుక్తంగా వలపన్ని మారికవలస వద్ద రౌడీషీటర్‌ కోటిని అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా విశ్రాంత సీఐ కొండతో వున్న సంబంధాలను వెల్లడించాడు. సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా విశ్రాంత సీఐ అండదండలు రౌడీషీటర్‌కు వున్నట్టు తేలడంతో అతనిపై కూడా కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. నిందితులిద్దరినీ రిమాండ్‌ నిమిత్తం మెజిస్ర్టేట్‌ ముందు హాజరుపరచనున్నట్టు సీఐ వెంకటరావు తెలిపారు. ఇదిలావుండగా రౌడీషీటర్‌తో కలిసి విశ్రాంత సీఐ కొండ కలిసి అనేక దందాలు చేశారని, వారికి డిపార్టుమెంట్‌లోని కొంతమంది అధికారులతో సంబంధాలు వున్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. వారిద్దరినీ కస్టడీకి తీసుకున్న తర్వాత దీనిపై లోతైన దర్యాప్తు చేయాలని సీపీ ఆదేశించినట్టు సమాచారం. 


Updated Date - 2022-06-30T06:12:23+05:30 IST