పొరుగుతో పొంచిఉన్న ముప్పు

ABN , First Publish Date - 2021-04-16T06:07:13+05:30 IST

జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయి. జిల్లాకు పొరుగున్న ఉన్న మహారాష్ట్రలో కొవిడ్‌ ఉధృతంగా ఉంది.

పొరుగుతో పొంచిఉన్న ముప్పు
కొడిమ్యాలలో స్వచ్ఛంద లాక్‌ డౌన్‌తో బోసిపోయిన వీధి

- సరిహద్దు గ్రామాల్లో పెరుగుతున్న పాజిటివ్‌లు

- జిల్లాలో పక్షం రోజుల్లో మూడు వేలకు పైగా కేసులు

- జగిత్యాలపై మహారాష్ట్ర, నిజామాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాల ప్రభావం

- నిర్లక్ష్యంతో ఉధృతమవుతున్న కరోనా

జగిత్యాల, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావంతో కేసులు పెరుగుతున్నాయి. జిల్లాకు పొరుగున్న ఉన్న మహారాష్ట్రలో కొవిడ్‌ ఉధృతంగా ఉంది. నిజామాబాద్‌, నిర్మల్‌ల నుంచి సైతం ముప్పు పొంచిఉంది. మహారాష్ట్రలోని ముంబాయి, బీవండి, పూణే, నాగ్‌పూర్‌, నాందేడ్‌, ధర్మాబాద్‌ ప్రాంతాలలో జిల్లాకు చెందిన అనేక మంది ఉపాధి నిమిత్తం వెళ్లి స్థిరపడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్రంలో రాత్రి వేళల్లో కర్ప్యూ ఉండడం, లాక్‌డౌన్‌ పరిస్థితులు ఉండటంతో ఉపాధి నిమిత్తం వెళ్లినవారు సొంత గ్రామాలకు వస్తున్నారు. నిజామాబాద్‌, నిర్మల్‌లలో సైతం కరోనా  ఎక్కువగా ఉంది. ఈ రెండు జిల్లాలతో జగిత్యాల జిల్లా వాసులకు వ్యాపారం, కొనుగోళ్లు, బంధుమిత్రుల సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. నిత్యం రాకపోకలతో కరోనా వ్యాప్తి చెందుతోందనే ప్రచారం ఉంది. 

పల్లెలు,.. పట్టణాల్లో పాజిటివ్‌లు 

పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా దాదాపు ప్రతి మండలంలోని పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. రోజుకు సగటున 40 నుంచి 50 కేసులు పాజిటివ్‌గా నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం ప్రదానంగా జిల్లా సరిహద్దు మండలాలైన ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, మల్లాపూర్‌, ధర్మపురి, రాయికల్‌, సారంగాపూర్‌ తదితర ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తోంది. పక్షం రోజుల్లో జిల్లాలో సుమారు 3,226 కేసులు నమోదయ్యాయి.  ఐదు రోజులుగా జిల్లాలో రోజుకు 300కు పైగా కేసులు నమోదు అవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌లో నలుగురు వ్యాపారులకు పాజిటివ్‌ తేలడంతో వారం రోజుల పాటు పసుపు మార్కెట్‌ను అధికారులు నిలిపివేశారు.

ముమ్మరంగా వ్యాక్సినేషన్‌ 

జనవరి 16వ తేదీ నుంచి కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం అయింది. ఇప్పటివరకు మొదటి డోసు టీకాను సుమారు 36 వేల మంది వేసుకున్నారు. రెండో డోసు టీకాను సుమారు 8 వేల మంది వేసుకున్నారు. జిల్లాలో ప్రతి నిత్యం 4 నుంచి 5 వేల మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 3,710 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో అధికంగా మెట్‌పల్లి, జగిత్యాల అర్బన్‌, మల్యాల, కోరుట్ల, రాయికల్‌, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నంలో పాజిటివ్‌ కేసులున్నట్లు అంచనా ఉంది. 

పల్లెల్లో స్వచ్ఛంద లాక్‌ డౌన్‌

రోజురోజుకు కొవిడ్‌ ఉధృతి పెరుగుతుండడంతో పల్లెల్లో స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు, పంచాయతీ పాలకవర్గాల పర్యవేక్షణలో జనం నిబంధనలు పాటిస్తున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఇబ్రహీంపట్నం, వర్షకొండ, వేములకుర్తి, మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూర్‌, ఆత్మనగర్‌, వేంపేట, వెల్లుల్ల, మల్లాపూర్‌ మండలంలోని సిరిపూర్‌, కొత్త దామ్‌రాజ్‌పల్లి, పాత దామ్‌రాజ్‌పల్లి, గొర్రెపల్లి, కథలాపూర్‌ మండలంలోని తక్కలపల్లి, రాయికల్‌ మండలంలోని అల్లీపూర్‌, కట్కాపూర్‌, బోర్నపల్లి, సారంగపూర్‌ మండలంలోని నాగునూర్‌, కొడిమ్యాల మండలంలోని కొడిమ్యాల, పెగడపల్లి మండలంలోని బతికెపల్లి, మల్యాల మండలంలోని మల్యాల గ్రామ పంచాయతీల్లో, మెట్‌పల్లి మున్సిపల్‌ పరిదిలోని రేగుంట గ్రామంలో లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. 

Updated Date - 2021-04-16T06:07:13+05:30 IST