వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-08-17T07:03:41+05:30 IST

వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

వృద్ధురాలి హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్టు
నిందితుల వివరాలు తెలియజేస్తున్న పోలీసులు

తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 16: ఓ వృద్ధురాలికి ఫూటుగా మద్యం తాగించి.. మెడలోని బంగారు చైన్‌ కాజేశారు. చైన్‌ ఎక్కడని ప్రశ్నించిన ఆమెను ఇటుక రాయితో కొట్టి.. ఆపై ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఈ కేసులోని ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను తిరుపతి ఈస్ట్‌ పోలీ్‌సస్టేషన్‌లో డీఎస్పీ మురళీకృష్ణ మీడియాకు తెలియజేశారు. టీటీడీలో వాచ్‌మెన్‌గా పనిచేసి రిటైరైన రామప్ప, రాజేశ్వరి (73) దంపతులు స్థానిక భవానీనగర్‌లో కాపురం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన షేక్‌ చాందిని (41), ఆమె భర్త షేక్‌ సాబ్జాన్‌ (48), మరో మహిళ కరీమున్నీసా అలియాస్‌ దిల్షాన్‌ (41)కు రాజేశ్వరితో పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో రాజేశ్వరి మెడలోని సుమారు 80 గ్రాముల బంగారు చైన్‌ను కాజేయాలని చాందిని, కరీమున్నీసా అనుకున్నారు. పథకం ప్రకారం ఈనెల పదో తేదీన ఉదయం పది గంటల సమయంలో వీరిద్దరూ రాజేశ్వరి ఇంటికొచ్చి.. ఆమెను తమతో తీసుకెళ్లారు. రాజేశ్వరికి మద్యం అలవాటు ఉండటంతో ఆమెతో ఫూటుగా తాగించారు. ఆ తర్వాత ఆమె మెడలోని బంగారు చైన్‌ కాజేశారు. మెలకువ వచ్చాక చైన్‌ ఏదంటూ వృద్ధురాలు ప్రశ్నించి.. పోలీసులకు చెప్తాననడంతో ఆమెను ఇటుకరాయితో తలపైకొట్టి.. టవల్‌తో నోరు, ముక్కుపై అదిమి ఊపిరాడకుండాచేసి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని చాందిని ఇంటి బెడ్‌రూమ్‌లో మంచం కింద దాచారు. మధ్యాహ్నం చాందిని భర్త సాబ్జాన్‌ రావడంతో ఆయనకు విషయం చెప్పారు. అర్ధరాత్రి వరకు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచేసి ఎవ్వరూ లేనిసమయంలో సాబ్జాన్‌ సాయంతో మృతదేహం నడుముకు ఓ చీరకట్టి, రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మురుగు కాల్వలో పడేశారు. మరుసటిరోజున ఏమీ ఎరగనట్టు మృతురాలి భర్తను ఓదార్చారు. ఆ తర్వాత తమపై అనుమానం వస్తుందని పత్తాలేకుండా పోయారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు మంగళవారం స్థానిక చేపలమార్కెట్‌ వద్ద ముగ్గురినీ పట్టుకున్నారు. కేసును ఛేదించి, నిందితులను తక్కువ సమయంలోనే అరెస్ట్‌ చేసిన ఈస్ట్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి, ఎస్‌ఐ జయస్వాములు, హెడ్‌కానిస్టేబుళ్లు ఆనందయ్య, చిట్టిబాబు, కానిస్టేబుళ్లు ప్రభాకర్‌, ఈశ్వరయ్య, నరసింహరావులను ఎస్పీ అభినందించినట్టు చెప్పారు. 

Updated Date - 2022-08-17T07:03:41+05:30 IST