పోరుబాటలో..

ABN , First Publish Date - 2020-08-09T09:57:43+05:30 IST

మూడు రాజధానుల నిర్ణయాన్ని పనికిమాలిన చర్యగా రైతులు పేర్కొన్నారు.

పోరుబాటలో..

తుళ్లూరు/తాడికొండ, ఆగస్టు 8 : మూడు రాజధానుల నిర్ణయాన్ని పనికిమాలిన చర్యగా రైతులు పేర్కొన్నారు. త్యాగాలు చేసిన రైతులను ప్రభుత్వం నడిరోడ్డుపై నిలబెట్టిందని మండిపడ్డారు. అమరావతి నుంచే పాలన కొనసాగించాలని కోరుతూ చేపట్టిన ఆందోళనలు శనివారం 235వ రోజుకు చేరుకున్నాయి. తుళ్లూరు, బోరుపాలెం, నీరుకొండ, రాయపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, మందడం తదితర దీక్షా శిబిరాల్లో రైతులు ప్ల్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామ రైతులు, మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు.


మందడం శిబిరంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. సీఎం జగన్‌ ఆడించినట్టుగా ఎమ్మెల్యేలు ఆడుతున్నారని మహిళలు మండిపడ్డారు. అమరావతికి ద్రోహం చేస్తున్న వైసీపీ ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  ‘అమరావతి వెలుగు’ కార్యక్రమం కింద రాత్రి ఇళ్ల ముందు దీపాలు పెట్టి న్యాయస్థానాల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అమరావతిలోని దీక్షా శిబిరాలను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం కేంద్రం పరిధిలోనిది కాదని చెప్పటం విడ్డూరమన్నారు.

Updated Date - 2020-08-09T09:57:43+05:30 IST