మూడు పంటలే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-20T06:12:44+05:30 IST

ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా వ్యవసాయ సీజనులో రైతులు మూడు పంటలు పండించుకునే లక్ష్యంతో ప్రభుత్వం జూన ఒకటో తేదీనే కాల్వలకు నీటిని విడుదల చేస్తోందని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ వెల్లడించారు. ముందస్తు నీటి విడుదలతో రైతులు సాగుకు సిద్ధమైతే రాగల వైపరీత్యాల నుంచి బయటపడవచ్చన్నారు.

మూడు పంటలే లక్ష్యం
సమావేశంలో పాల్గొన్న మంత్రి విశ్వరూప్‌, ఎంపీ అనురాధ, ఎమ్మెల్సీ చిక్కాల, ఎమ్మెల్యే చిట్టిబాబు, జడ్పీ చైర్మన వేణుగోపాలరావు, కలెక్టర్‌ శుక్లా

  • ఆ దిశగా ప్రభుత్వ ప్రణాళికలు 
  • జూన 1న కాల్వలకు నీటి విడుదల
  • కార్యాచరణ సిద్ధం చేసి పూర్తిగా నీరు సరఫరా చేయాలి
  • కాల్వలు, డ్రెయిన్ల మరమ్మతులు పూర్తి చేయాలి
  • ఐఏబీ, వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో మంత్రి విశ్వరూప్‌ 
  • హాజరుకాని పలువురు వైసీపీ ప్రజాప్రతినిధులు

అమలాపురం, మే 19 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా వ్యవసాయ సీజనులో  రైతులు మూడు  పంటలు పండించుకునే లక్ష్యంతో ప్రభుత్వం జూన ఒకటో తేదీనే కాల్వలకు నీటిని విడుదల చేస్తోందని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ వెల్లడించారు. ముందస్తు నీటి విడుదలతో రైతులు సాగుకు సిద్ధమైతే రాగల వైపరీత్యాల నుంచి బయటపడవచ్చన్నారు. అమలాపురంలోని కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఖరీఫ్‌ సీజనకు సంబంధించి జలవనరుల శాఖ జిల్లా స్థాయిలో ఏర్పాటుచేసిన సమావేశానికి మంత్రి విశ్వరూప్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సాగునీటి యాజమాన్య పద్ధతులను అలవర్చడంతో పాటు నీటి విడుదలకు సంబంధించిన కార్యాచరణను సిద్ధం చేసి ఆయకట్టుకు పూర్తి స్థాయిలో  సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు పంటల లక్ష్యంగా 2022 వ్యవసాయ సీజను కొనసాగాలని ఆకాక్షించారు. 

సమావేశానికి అధ్యక్షత వహించిన కలెక్టర్‌ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ ఇరిగేషన, డ్రెయినేజీ శాఖల ఆధ్వర్యంలో సాగునీటి సరఫరా, మురుగునీటిపారుదల వ్యవస్థలకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఇరిగేషన శాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్ల అంచనా వ్యయంతో  83 పనులు వివిధ దశల్లో ఉన్నాయని.. ఇందులో కాల్వ పనులు 54,  డ్రైనేజీ పనులు 26, హెడ్‌వర్క్స్‌ పనులు తొమ్మిది ఉన్నాయన్నారు. నీటి  విడుదల సమయానికి అన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. జున్నూరి బాబుతో పాటు పలువురు రైతు నాయకులు మాట్లాడుతూ కాల్వలు, డ్రెయిన్లతో పాటు రామేశ్వరం, కూనవరం మొగల వద్దనున్న పూడికలను తొలగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ సాగుకు సంబంధించి పాత లెక్కల ప్రకారమే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. వేల ఎకరాల్లో ఆక్వా చెరువులు రియల్‌ ఎస్టేట్‌ భూముల కింద మారిపోతుంటే గ్రామస్థాయిలో వాటి వివరాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నారని ఇరిగేషన అధికారులను ప్రశ్నించారు. సాగునీటి కాల్వలు మురుగునీటి డ్రైనేజీల కంటే అధ్వానంగా ఉన్నాయన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ కాల్వలు,  డ్రెయిన్లలో పూడికలు తీయకపోతే ప్రభుత్వ కృషి నెరవేరదన్నారు. క్షేత్రస్థాయిలో సాగునీటి నిర్వహణకు లస్కర్‌లను నియమించాలని సూచించారు. తొలుత ఇరిగేషన ఎస్‌ఈ జి.రాంబాబు గోదావరి ఆయకట్టు స్థితిగతుల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన ద్వారా వివరించారు. పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో కాల్వలపై కొన్ని పనులు జరుగుతున్న దృష్ట్యా నీటి విడుదలకు కొంత వ్యవధి కావాలని కోరారు. సమావేశంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, జిల్లా పరిషత చైర్మన విప్పర్తి వేణుగోపాలరావు, ఇరిగేషన కోనసీమ ఇనచార్జి రవిబాబు, వ్యవసాయ శాఖ జేడీ వై.ఆనందకుమారి, డీసీసీబీ చైర్మన ఆకుల వీర్రాజు, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన మోటూరి సాయి, డెల్టా బోర్డు చైర్మన్లు కుడుపూడి బాబు, యేడిద చక్రం, ఆర్డీవోలు వసంతరాయుడు, సింధు సుబ్రహ్మణ్యం, వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.

ప్రభుత్వం జూన 1న నీటిని విడుదల చేస్తున్నందున సాగుకు రైతులు సమాయత్తం కావాలని మంత్రి పినిపే విశ్వరూప్‌ పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌లో గురువారం జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు మోటూరి సాయి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ జేడీ ఆనందకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్‌ సీజన 72,476 హెక్టార్ల  ఆయకట్టు విస్తీర్ణంలో సాగుతోందన్నారు. ఇందుకోసం 37వేల క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను లక్ష్యంగా నిర్దేశించారన్నారు. 29 క్వింటాళ్ల విత్తనాలను సబ్పిడీపై అందిస్తున్నామన్నారు. ఈ సాగుకు సంబంధించి 45 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సాగునీటి యాజమాన్య విధానాల ద్వారా చివరి భూములకు నీటిని అందించాలని కోరారు. రైతు సంఘ నాయకుడు త్రినాథరెడ్డి మాట్లాడుతూ ధాన్యాగార జిల్లాగా కోనసీమ చరిత్రకెక్కనుందని పేర్కొన్నారు. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉండడం వల్ల డ్రెయినేజీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ఇ-క్రాప్‌ బుకింగ్‌కు సంబంధించి ప్రొక్యూర్‌ సైట్‌లో సాంకేతిక కారణాల వల్ల వివరాలు కనిపించట్లేదని, దీనివల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరారు. 1318 రకం వంగడాలు ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకునేవిగా ఉంటాయని, ఈ రకం విత్తనాలు సరఫరా చేయాలని కోరారు. వ్యవసాయాధికారులు చేసిన సూచనలను రైతులు విధిగా పాటించి మూడు పంటలు సాగయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. సాంకేతిక పరికరాలు సంఘాలుగా ఏర్పడిన వారికే ఇచ్చి అంశంపై ఏర్పడుతున్న ఇబ్బందులను  ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు మోటూరి ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఈ రెండు తొలి సమావేశాలకు జిల్లాకు చెందిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైసీపీ అమలాపురం పార్లమెంటరీ అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ గైర్హాజరయ్యారు. బోస్‌ జిల్లా కలెక్టర్‌ను కలిసి ధాన్యం కొనుగోలుపై జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేస్తారని భావించినప్పటికీ ఆయన హాజరు కాలేదు. 


Updated Date - 2022-05-20T06:12:44+05:30 IST