Red alert: మూడు జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్’

ABN , First Publish Date - 2022-08-02T16:29:41+05:30 IST

ఉపరితల ద్రోణి సందర్భంగా కన్నియాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపిన వాతావరణ పరిశోధన

Red alert: మూడు జిల్లాలకు ‘రెడ్‌ అలర్ట్’

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 1: ఉపరితల ద్రోణి సందర్భంగా కన్నియాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపిన వాతావరణ పరిశోధన శాఖ(Department of Meteorological Research) ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌(Red alert) ప్రకటించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో, మంగళవారం కన్నియాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాశి, తేని జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో అతిభారీవర్షాలు, నీలగిరి, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, విరుదునగర్‌ జిల్లాల్లో భారీవర్షాలు, తూత్తుకుడి, మదురై, సేలం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. 3వ తేదీ నీలగిరి, కోయంబత్తూర్‌, తిరుప్పూర్‌, దిండుగల్‌, తేని, తెన్‌కాశి జిల్లాల్లో అతిభారీవర్షాలు, ఈరోడ్‌, మదురై, కన్నియకుమారి జిల్లాల్లో భారీవర్షాలు(heavy rains) కురుస్తాయని తెలిపింది. రాజధాని నగరం చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటూ కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన స్వల్ప వర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటనతో అరక్కోణం నుంచి రెండు జాతీయ విపత్తు నివారణ బృందాలు సోమవారం సాయంత్రం నీలగిరి, తెన్‌కాశి జిల్లాలకు బయల్దేరి వెళ్లాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో తీరప్రాంతాలు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరికలు జారీచేశారు.

Updated Date - 2022-08-02T16:29:41+05:30 IST