శ్రీశైలం మూడుగేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2022-08-08T08:09:21+05:30 IST

శ్రీశైలం మూడుగేట్లు ఎత్తివేత

శ్రీశైలం మూడుగేట్లు ఎత్తివేత

బెంగళూరు(ఆంధ్రజ్యోతి), శ్రీశైలం, ఆగస్టు 7: శ్రీశైల జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో మూడు గేట్లు పది అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం జూరాల నుంచి 41,389, సుంకేశుల నుంచి 50,904.. మొత్తం 92,293 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి వస్తోంది. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 884.60 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నమోదైంది. విద్యుదుత్పత్తి ద్వారా ఏపీ విద్యుత్‌ కేంద్రం నుంచి 31,658 క్యూసెక్కులు, తెలంగాణ విద్యుత్‌ కేంద్రం నుంచి 31,784 క్యూసెక్కులు, డ్యామ్‌ స్పిల్‌వే మూడు గేట్ల ద్వారా 83,673 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు.


నిండిన తుంగభద్ర జలాశయం..

భారీ వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం నిండిపోయింది. డ్యాంకు మొత్తం 33 గేట్లు ఉండగా, ఆదివారం 30 గేట్లు ఎత్తివేశారు. తుంగభద్ర జలాశయం గరిష్ఠ నీటిమట్టం 1633 అడుగులకుగాను ప్రస్తుతం 1631 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 105 టీఎంసీలకుగాను ప్రస్తుతం 101.304 టీఎంసీల నీరు ఉంది. డ్యాంలోకి 1.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 20 గేట్లను రెండున్నర అడుగులు, 10 గేట్లను అడుగున్నర ఎత్తి, 98,561 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. కాలువల ద్వారా మరో 10,545 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. నదికి పెద్దఎత్తున నీరు వదలడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలను ముంపు భయం వెంటాడుతోంది. కర్ణాటకలోని కావేరి నదికి అనుబంధమైన కబిని, హేమావతి, కేఆర్‌ఎ్‌సతోపాటు భద్రావతి, ఘటప్రభ, మలప్రభ, సూపా, వారాహి నదులకు అనుబంధంగా ఉండే జలాశయాలు దాదాపు నిండాయి.  ఉడుపి, ఉత్తర కన్నడ, దక్షిణకన్నడ జిల్లాలతోపాటు మలెనాడు ప్రాంతాలు, శివమొగ్గ, కొడగు, చిక్కమగళూరులో కొండచరియలు విరిగిపడటంతోపాటు, వాగులు, వంకలు పొంగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఉత్తరకర్ణాటకలోని బీదర్‌, కలబురగి, విజయపుర, బెళగావి, యాదగిరి, బాగల్కోటె జిల్లాల్లోనూ భారీ వర్షాలతో చెరువులు నిండాయి. కావేరి నదికి అనుబంధమైన జలాశయాల నుంచి తమిళనాడుకు రెండు నెలల వ్యవధిలో 160 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ఆగస్టు 6వ తేదీ నాటికి తమిళనాడుకు 75 టీఎంసీలు అధికంగా విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. కేఆర్‌ఎస్‌ నుంచి 68,100 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. చిక్కబళ్లాపుర జిల్లాలో జన్మించే దక్షిణ పినాకిని ప్రవాహంతో ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని పలు చెరువులు నిండాయి. జయమంగళి నది ఉగ్రరూపం దాల్చడంతో ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాకు భారీగా వరద నీరు చేరుతోంది.

Updated Date - 2022-08-08T08:09:21+05:30 IST