ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు కెనడా అత్యున్నత పౌర పురస్కారం

ABN , First Publish Date - 2021-12-31T14:05:01+05:30 IST

ముగ్గురు ఇండో-కెనడియన్ వ్యక్తులు కెనడాలో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ముగ్గురు భారతీయులకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ కెనడా’ అవార్డు దక్కింది. రియల్ ఎస్టేట్‌ వ్యాపారి బాబ్‌ సింగ్‌ దిల్లాన్‌, ప్రముఖ శాస్త్రవేత్త డా. వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌, పిల్లల వైద్యుడు డాక్టర్‌ ప్రదీప్‌ మర్చంట్‌ ఈ పురస్కారం అందుకున్నారు. 1967లో తీసుకువచ్చిన..

ముగ్గురు భారత సంతతి వ్యక్తులకు కెనడా అత్యున్నత పౌర పురస్కారం

టొరంటో: ముగ్గురు ఇండో-కెనడియన్ వ్యక్తులు కెనడాలో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ముగ్గురు భారతీయులకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ కెనడా’ అవార్డు దక్కింది. రియల్ ఎస్టేట్‌ వ్యాపారి బాబ్‌ సింగ్‌ దిల్లాన్‌, ప్రముఖ శాస్త్రవేత్త డా. వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌, పిల్లల వైద్యుడు డాక్టర్‌ ప్రదీప్‌ మర్చంట్‌ ఈ పురస్కారం అందుకున్నారు. 1967లో తీసుకువచ్చిన ఈ పురస్కారాన్ని సమాజానికి, దేశానికి విశేషంగా కృషి చేసిన వారికి ప్రతి యేటా కెనడా అందజేస్తుంది. 2021 ఏడాదికి గాను 135 మంది ఈ అవార్డుకు ఎంపిక కాగా.. వారిలో ఈ ముగ్గురు భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. ఈ సందర్భంగా ఒట్టావాలోని భారత హైకమిషన్ గురువారం బాబ్‌ సింగ్‌ దిల్లాన్‌, డా. వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌, డా. ప్రదీప్‌ మర్చంట్‌‌లను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. ముగ్గురికి శుభాకాంక్షలు తెలియజేసింది. కెనడాలోని డైనమిక్ ఇండియన్ హెరిటేజ్ కమ్యూనిటీ సహకారాన్ని 'ఆర్డర్ ఆఫ్ కెనడా'తో గుర్తించడం పట్ల ఆనందంగా ఉందని భారత హైకమిషన్ పేర్కొంది.


అల్బర్టాకు చెందిన బాబ్‌ సింగ్‌ దిల్లాన్‌.. మెయిన్‌ స్ట్రీట్‌ ఈక్విటీ కార్పొరేషన్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారు. 1997లో ఈ సంస్థను స్థాపించారాయన. టొరంటో స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయిన తొలి సిక్కు కమ్యూనిటీకి చెందిన సంస్థ కూడా ఇదే కావడం విశేషం. అలాగే ఆయన లాభాపేక్ష లేకుండా సమాజ శ్రేయస్సు కోసం తనవంతు సాయం చేస్తున్నారు. ఒంటారియోలోని మిస్సిసాగాలో ఉండే వైకుంఠం అయ్యర్‌ లక్ష్మణన్‌కు శాస్త్రవేత్తగా హైడ్రోమెటలర్జీలో ఉన్న నైపుణ్యం సమాజానికి ఎంతో ఉపయోగపడుతోంది. దీంతో పాటు ఆయన వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం సమాజం కోసం విరాళంగా అందిస్తున్నారు. ఇక ఒంటారియోలోని గ్రీలీ ప్రాంతానికి చెందిన మర్చంట్‌.. పిల్లల వైద్యుడిగా వైద్య రంగంలో విశేషంగా కృషి చేయడంతోపాటు భారత్‌-కెనడా ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ అవార్డును అందజేసినట్లు కెనడా తెలిపింది.

Updated Date - 2021-12-31T14:05:01+05:30 IST