కరెంటు కాటుకు ముగ్గురు బలి

ABN , First Publish Date - 2022-05-29T05:56:19+05:30 IST

రాములవారి రథాన్ని గుట్టపైనుంచి కిందికి తీసుకొచ్చి, గదిలోకి చేర్చుతుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాతపడగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

కరెంటు కాటుకు ముగ్గురు బలి
విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన ఆంజనేయులు, యాదయ్య

సింగిల్‌ఫేస్‌ వైరుకు తగిలిన ఆలయ ఇనుప రథం 

రథాన్ని లాగుతున్న పలువురికి విద్యుదాఘాతం 

అక్కడికక్కడే ముగ్గురు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు 

నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఘటన

దేవరకొండ, మే 28: రాములవారి రథాన్ని గుట్టపైనుంచి కిందికి తీసుకొచ్చి, గదిలోకి చేర్చుతుండగా విద్యుదాఘాతానికి గురై ముగ్గురు మృత్యువాతపడగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శనివారం మధ్యాహ్నం 12.30 సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్థులు, పోలీసుల వివరాల ప్రకారం.. కేతేపల్లి గుట్టపై సీతారామచంద్రస్వామి ఆలయం ఉంది. ఏప్రిల్‌ నెలలో జరిగిన సీతారామ కల్యాణ మహోత్సవం అనంతరం రథాన్ని గుట్టపైనే వదిలేశారు. కాగా ఆలయ కమిటీ నిర్వాహకుడు, గ్రామానికి చెందిన పసునూరి దయానందరెడ్డి విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమై గుట్టపై ఉన్న రథాన్ని గుట్టకింద ఉన్న గదిలో భద్రపరచాలని సూచించాడు. ఈక్రమంలో శనివారం గ్రామస్థులతోపాటు ఆయన వాహన తాత్కాలిక డ్రైవర్‌ స్వామివారి రథాన్ని లాగుతున్నారు. అందులో కొందరు తాళ్ల సహాయంతో, మరికొందరు రథాన్ని నేరుగా చేతులతో పట్టుకొని కిందికి లాగుతున్నారు. ఇనుప రథం కావడంతో పైన ఉన్న 11కేవీ సింగిల్‌ఫేస్‌ విద్యుత్‌ వైర్లు రథాన్ని తగలడంతో విద్యుత్‌ సరఫరా అయింది. దీంతో రథాన్ని లాగుతున్న కేతేపల్లి గ్రామానికి చెందిన రాజబోయిన యాదయ్య(35), పొగాకు మోహనయ్య(42), గుర్రంపోడు మండలం మక్కపల్లి గ్రామానికి చెందిన దాసరి ఆంజనేయులు(28) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వీరివెంట ఉన్న రాజబోయిన వెంకటయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముగ్గురు, గాయపడిన వ్యక్తి వెంకటయ్య ఇనుప రథ చక్రాలు పట్టుకోవడంతోనే విద్యుదాఘాతానికి గురై ప్రమాదానికి గురయ్యారు. మృతదేహాలను దయానందరెడ్డి కారులోనే దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. 


తాడుతో లాగడంతో ప్రాణాలు దక్కాయి

రథాన్ని తాళ్లతో లాగిన గ్రామానికి చెందిన దాసరి సత్తయ్య, బక్క చిన్నయ్య, విఘ్నేష్‌, రాజబోయిన మల్లయ్య, వెంకటయ్యలు ప్రాణాలతో బయటపడ్డారు. రథం ఇనుప చక్రాలుపట్టి లాగిన యాదయ్య, మోహనయ్య, ఆంజనేయులు మృతి చెందగా, వెంకటయ్య విద్యుదాఘాతానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. 


పరీక్షరాసిన కుమార్తెను తీసుకురావడానికి వెళుతుండగా 

విద్యుత్‌ ప్రమాదంలో మృతి చెందిన పొగాకు మోహనయ్య(42)కు భార్య వెంకటమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్దకుమార్తె శిరీష నాంపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు రాస్తుంది. కుమార్తెను వాహనంపై నాంపల్లి నుంచి తీసుకురావడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరిన మోహనయ్యకు గ్రామస్థులు దేవుడి రథాన్ని కిందికి దించాలని ఫోన్‌ చేశారు. దీంతో కుమార్తెను తీసుకురావడానికి బయలుదేరిన మోహనయ్య శిరీషను ఆటోలో రమ్మని చెప్పి రథాన్ని లాగే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఐదు నిమిషాల్లో కుమార్తెను తీసుకురావడానికి బయలుదేరితే బతికేవాడు. కాగా విద్యుదాఘాతంతో మృతి చెందిన రాజబోయిన యాదయ్య(35) భార్య ముత్యాలమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వ్యవసాయం చేసుకొని యాదయ్య జీవనం సాగిస్తున్నాడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో యాదయ్య కుటుంబ సభ్యులు, బంధువులు దుఖఃసాగరంలో మునిగిపోయారు. 


కేతేపల్లి, జూనుతులలో విషాదఛాయలు

నాంపల్లి మండలం కేతేపల్లిలోని గుట్టపై ఉన్న రథాన్ని వేదిక వద్దకు చేర్చే క్రమంలో జరిగిన విద్యుత్‌ ప్రమాదంలో కేతేపల్లి గ్రామానికి చెందిన యాదయ్య, మోహనయ్యలు మృతి చెందగా గుర్రంపోడు మండలం, మక్కపల్లికి చెందిన ఆంజనేయులు మృతి చెందడంతో  ఆయా గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలకు ఆర్థికసహాయం అందజేసి ఆదుకోవాలని మృతుల బంధువులు కేతేపల్లిలోని దయానందరెడ్డి ఇంటివద్ద ఆంజనేయులు కుటుంబ సభ్యులు, బంధువులు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకుదిగారు. న్యాయంచేసేవరకు మృతదేహాలను గ్రామాలకు తరలించే ప్రసక్తిలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కొడుకా మాకు దిక్కెవరు 

కొడకా ఆంజనేయులు నన్ను విడిచి ఎక్కడికి వెళ్లావురా, ఇక మాకు ఎవరు దిక్కు నాయనా అంటూ తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్న మక్కపల్లికి చెందిన ఆంజనేయులు తల్లి దాసరి సత్తెమ్మ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బోరున విలపించింది. గుర్రంపోడు మండలం మక్కపల్లికి చెందిన దాసరి మల్లయ్య, సత్తమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మల్లయ్య 10 సంవత్సరాల క్రితమే మృతి చెందాడు. ఆ కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంది. చిన్న కుమారుడైన ఆంజనేయులు కారు డ్రైవర్‌గా పనిచేస్తూ తల్లికి చేదోడు, వాదోడుగా ఉంటున్నాడు. దయానందరెడ్డి వద్ద అప్పుడప్పుడు తాత్కాలిక డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆంజనేయులుకు ఇంకా పెళ్లికాలేదు. సంబంధాలు కూడా చూస్తున్నామని, ఇంతలోనే చనిపోయాడని మృతుడి తల్లితోపాటు కుటుంబసభ్యులు విలపించిన తీరు అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది.   



Updated Date - 2022-05-29T05:56:19+05:30 IST