Advertisement

అపచారం.. దుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాలు మాయం

Sep 16 2020 @ 09:03AM

చోరీ గురించి తెలిసినా గోప్యంగా ఉంచిన అధికారులు

ఇంటి దొంగల పనేనా? 

ఆరు నెలలకుపైగా ముసుగులోనే రథం

చోరీపై ఈవో డొంక తిరుగుడు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గగుడిలో అరాచకం పరాకాష్ఠకు చేరింది. సాక్షాత్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని వెండి రథంపై ఉన్న నాలుగు సింహాల్లో మూడు మాయం కావడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న దుర్గగుడి ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకున్నా అంతా మౌనంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది.


కనకదుర్గమ్మకు ఉన్న మూడు రథాల్లో వెండి రథం ఒకటి. ప్రతియేటా ఉగాది రోజున శ్రీదుర్గామల్లేశ్వరులను ఈ రథంపైనే ఊరేగిస్తారు. ఈ ఏడాది ఉగాదికి కొవిడ్‌ నిబంధనల కారణంగా ఊరేగింపు నిర్వహించలేదు. గత ఏడాది ఉగాది పర్వదినాన ఆది దంపతులను అంగరంగ వైభవంగా ఈ వెండి రథంపై ఊరేగించారు. తర్వాత దీనిని మహామండపం ముందు నిలిపి, టార్పాలిన్‌ కప్పి ఉంచారు. ఆ తర్వాత అధికారులు పట్టించుకోలేదు. 


ఇటీవల అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథం అగ్నికి ఆహుతైపోయిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో రథాలకు భద్రత కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దుర్గగుడిలోని రథాల భద్రత గురించి విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు సోమవారం దుర్గగుడి ఈవో ఎం.వి.సురేష్‌బాబుతో చర్చించారు. రథాలకు షెడ్లను నిర్మించడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిరంతరం భద్రతా సిబ్బంది కాపలా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీ సూచించారు. అనంతరం అధికారులు వెండి రథాన్ని పరిశీలించేందుకు దానికి కప్పి ఉంచిన ప్లాస్టిక్‌ కవరు తీసి పరిశీలించారు. రథంపై నాలుగు వైపులా ఉండాల్సిన వెండి సింహాల్లో మూడు మాయమైనట్లు ఈ సమయంలోనే గుర్తించారు. 


అధికారుల తీరుపై అనుమానాలు..

వెండి సింహాలు మాయమైనట్టు గుర్తించిన వెంటనే స్పందించాల్సిన అధికారులు గోప్యంగా ఉంచడం, 24 గంటల తర్వాత ఈ విషయం తెలిసి మీడియా ఈవోను ప్రశ్నిస్తే మూడు రోజుల తర్వాత రికార్డులను పరిశీలించి నిర్ధారిస్తామని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఈవోగా సురేశ్‌బాబు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దుర్గగుడి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అనేక అవినీతి సిత్రాలు వెలుగు చూశాయి. ఆలయ ప్రాంగణంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించకుండానే నిర్మించినట్లు బిల్లులు పెట్టుకుని కోట్లాది రూపాయల నిధులు స్వాహా చేశారు. ఈవోపై ఎన్ని ఆరోపణలు వచ్చినా దేవదాయశాఖ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తూ వచ్చారు. దీనికి కారణం ఈవోకి మంత్రి అండదండలు ఉండటమేనన్న వాదనలు ఉన్నాయి.


సీసీ టీవీ ఫుటేజీ బ్యాకప్‌ 15 రోజులే..!

ఆలయంలో ఉన్న సీసీ టీవీల్లో ఫుటేజీ బ్యాకప్‌ కేవలం 15 రోజులే ఉంటుంది. ఆ తర్వాత దాని స్థానంలో కొత్త విజువల్స్‌ రికార్డు అయ్యేలా సెట్‌ చేశారు. గతంలో అమ్మవారి చీరల చోరీ జరిగినపుడు కూడా ఫుటేజీ లభ్యం కాలేదు. దీన్ని పాఠంగా తీసుకుని బ్యాకప్‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కూడా వెండి సింహాల చోరీ ఎప్పుడు జరిగిందో తెలియదు. ఫుటేజీ లభ్యమయ్యే అవకాశాలు లేవు. కరోనా లాక్‌డౌన్‌లో దర్శనం నిలిపివేశారు. సిబ్బంది కూడా పెద్దగా లేరు. అదే అవకాశంగా ఇంటి దొంగలే సింహాలను అపహరించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆలయ అధికారులు దీనిపై పెదవి విప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది. చోరులెవరో తెలిసే నోరు విప్పడం లేదా? వారిని రక్షించేందుకే ఫిర్యాదు చేయడం లేదా? అన్న సందేహాలు భక్తుల నుంచి వస్తున్నాయి. 


3 రోజుల గడువు ఎందుకు..?

వెండి రథంపై సింహాలు చోరీకి గురైందీ లేనిది తేలడానికి మూడు రోజులు పడుతుందని ఈవో చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. చోరీ విషయం తెలియగానే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఆలయ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. సోమవారం సీపీతో ఈవో భేటీ అనంతరం వెండి రథాన్ని పరిశీలించారు. సింహాలు మాయమైనట్లు అప్పుడే గుర్తించారు. వెంటనే రికార్డులను పరిశీలించి నిర్ధారించుకోవడానికి సమయం పట్టదు. కానీ ఈవో ఏమీ జరగనట్లు ఉండిపోయారు. మంత్రి నివాసానికి సమీపంలోనే ఉన్న దుర్గగుడిలో వెండిసింహాలు చోరీకి గురైనట్టు తెలిస్తే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అవుతుందన్న ఉద్దేశంతోనే దీనిని గోప్యంగా ఉంచి ఉంటారని భావిస్తున్నారు. 


మంగళవారం సాయంత్రం మీడియా ప్రశ్నించినా అలాంటిది ఏమీ లేదని బుకాయించారు. పైగా మూడు రోజుల తర్వాత కానీ ఏ విషయం చెప్పలేమని స్పష్టం చేశారు. చోరీకి గురైన సింహాల స్థానంలో అలాంటి వాటినే తయారు చేయించి పెట్టేందుకే ఈవో మూడు రోజులు పడుతుందంటున్నారని ఆలయ ఉద్యోగులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.