మూడు నెలల ముచ్చటే!

ABN , First Publish Date - 2022-10-05T05:47:44+05:30 IST

మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెంలో సురక్షిత తాగునీటి (ఆర్వో) ప్లాంట్‌ మూలకు చేరింది.

మూడు నెలల ముచ్చటే!
దేశపాత్రునిపాలెంలో మూతపడిన ఆర్వో ప్లాంటు

దేశపాత్రునిపాలెంలో మూతపడిన ఆర్వీ ప్లాంట్‌

మూడున్నరేళ్ల క్రితం ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ నిఽధులతో ఏర్పాటు

బోరు అడుగంటడంతో నిలిచిన నీటి సరఫరా

అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన

పరవాడ, అక్టోబరు 4: మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెంలో సురక్షిత తాగునీటి (ఆర్వో) ప్లాంట్‌ మూలకు చేరింది. మూడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ ముచ్చటగా మూడు నెలలు కూడా పనిచేయలేదు. వాటర్‌ ప్లాంట్‌కు నీటిని సరఫరా చేసే బోరు అడుగంటడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు అంటున్నారు. 

సింహాద్రి ఎన్టీపీసీ అధికారులు సామాజిక బాధ్యతలో భాగంగా మూడున్నరేళ్ల క్రితం సీఎస్‌ఆర్‌ నిధులు రూ.11.63 లక్షలు వెచ్చించి దేశపాత్రునిపాలెంలో ఆర్వో వాటర్‌ ప్లాంటును ఏర్పాటు చేశారు. దీనిని నిర్వహణ బాధ్యతను జీవీఎంసీ అధికారులకు అప్పగించారు. ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి 20 లీటర్ల క్యాన్‌ నీటిని నామమాత్రపు ఽధర రూ.5కే విక్రయించేవారు. ఇదే క్యాన్‌ నీటిని ప్రైవేటు వ్యాపారులు రూ.20కి అమ్మేవారు. దీంతో స్థానికులు ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన ప్లాంట్‌ నుంచి తాగునీటిని తీసుకెళ్లడం మొదలుపెట్టారు.  మూడు నెలల వరకు ప్లాంట్‌ బాగానే పనిచేసింది. దీనికి నీటిని సరఫరా చేసే బోరు అడుగంటడడంతో ప్లాంట్‌ను మూసేశారు. భూగర్భ జలాలు బాగా పడిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని, బోరును మరికొంత లోతు చేస్తే నీరు సరఫరా అవుతుందని స్థానికులు జీవీఎంసీ అధికారులకు పలుమార్లు సూచించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. 20 లీటర్ల క్యాన్‌ నీటిని రూ.20  చెల్లించి ప్రైవేటుగా కొనుక్కోవాల్సి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆర్వో ప్లాంట్‌ మూతపడిన విషయాన్ని కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాస్‌ వద్ద ప్రస్తావించగా.. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయని చెప్పారు. ఆ ప్రాంతంలో మరో బోరు వేసినా నీరు పడడం లేదని, అందువల్ల ప్లాంట్‌ మూత పడిందని చెప్పారు. దీనిని నిర్వహించాలని ప్రైవేటు వ్యక్తులను కోరినా ఎవరూ ముందుకు రాలేదని ఆయన స్పష్టం చేశారు.


Updated Date - 2022-10-05T05:47:44+05:30 IST