
- తిరునల్వేలిలో ‘నిత్య పెళ్ళికొడుకు’ అరెస్టు
చెన్నై: ఆరుగురు యువతులను పెళ్ళి చేసుకుని నగలు, నగదు కాజేసిన నిత్యపెళ్ళికొడుకు ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఏడోపెళ్ళికి సిద్ధమవుతున్న సమయంలో అతడిని కటకటాల వెనక్కి నెట్టారు. తిరునల్వేలి ఎన్జీవో కాలనీలో నివసిస్తున్న గణేశన్ కుమార్తె విజిలా రాణి (33)కి, తూత్తుకుడి జిల్లా సాయర్‌పురానికి చెందిన విన్సెంట్ రాజన్ అనే యువకుడితో గత యేడాది జూలై 15న వివాహం జరిగింది. మూడు నెలలపాటు వీరి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగింది. ఆ తర్వాత ఏదో వ్యాపారం కోసమంటూ విజిలా రాణి నుండి 40 సవర్ల నగలు, రూ.3లక్షల నగదు తీసుకుని రాజన్ పారిపోయాడు. నెలలు గడిచినా భర్త తిరిగి రాకపోవడంతో అనుమానించిన విజిలా రాణి ఆ విషయాన్ని తండ్రికి తెలిపింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసుస్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విన్సెంట్‌రాజన్ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. రెండు రోజుల క్రితం విన్సెంట్ రాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఇదివరకే ఐదుగురిని పెళ్ళి చేసుకుని నగలు, నగదు దోచుకున్నట్టు తెలిసింది. అతడి అసలు పేరు విన్సెంట్ భాస్కర్ అని పోలీసుల విచారణలో తేలింది. పథకం ప్రకారం అతడు ఆరుగురు యువతులను పెళ్ళి చేసుకుని మూడు నెలలు కాపురం చేసి నగలు, నగదు అపహరించుకెళ్ళాడని పోలీసులు కనుగొన్నారు. అంతేకాకుండా తన తల్లిగా, పినతల్లిగా నటించేందుకు ఇద్దరు మహిళలను రూ.15 వేలిచ్చి నటింపజేశాడని కూడా విచారణలో తేలింది. కొద్ది రోజులకు ముందు విన్సెంట్ భాస్కర్ ఓ యువతిని ఏడో పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడని కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. విన్సెంట్ భాస్కర్, అతనికి తల్లిగా, పినతల్లిగా నటించిన ఇద్దరు మహిళలను కూడా అరెస్టు చేశారు.