సంక్రాంతి బరిలో మూడు సినిమాల పోటీ!

Jul 29 2021 @ 16:27PM

సినిమాల విడుదలకు మంచి రోజు ఎంత ముఖ్యమో... పండుగ సీజన్‌ అంతే ముఖ్యం. బడా చిత్రాలను ఎక్కువగా పండుగల బరిలోనే విడుదల చేయడానికి మేకర్స్‌ ఆసక్తి చూపుతుంటారు. ఇక సంక్రాంతి సీజన్‌లో డేట్‌ దొరికితే నిర్మాతల సంక్రాంతితోపాటు మరో పెద్ద పండగే. స్టార్‌లకు పోటీ తప్పదు. రానున్న సంక్రాంతి పెద్ద సినిమాలకు గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే సంక్రాంతి సీజన్‌లో పవన్‌కల్యాణ్‌, మహేశ్‌బాబు చిత్రాలున్నాయి. తాజా సమాచారం మేరకు ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ సంక్రాంతికే విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 


‘వకీల్‌సాబ్‌’తో సూపర్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చిన పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ చేతిలో మూడు చిత్రాలున్నాయి. అందులో మలయాళ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ ఒకటి కాగా, క్రిష్‌ దర్శకత్వంలో ఎ.ఎం.రత్నం భారీగా నిర్మిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మరొకటి. కరోనాతో విరామం తీసుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ షూటింగ్‌ తాజాగా మొదలైంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్‌ నుంచి ప్రకటన వచ్చింది. దీనికి తోడు మహేశ్‌ బాబు నటిస్తున్న ‘సర్కారువారి పాట’ కూడా సంక్రాంతికే రానుంది. ఈ రెండిటి మధ్య ఇప్పుడు ప్రభాస్‌ నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఈ చిత్రం జూలై 30న విడుదల కావాల్సిన సినిమా. కానీ కరోనా సెకెండ్‌ వేవ్‌ వల్ల షూటింగ్‌ వాయిదా పడింది. తాజాగా చివరి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్‌ చేశారు. మరో మూడో రోజుల్లో డార్లింగ్‌ ఫ్యాన్స్‌కి కొత్త అప్‌డేట్‌ ఇస్తానని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే అది విడుదల కోసమా, లేక ట్రైలర్‌, టీజర్‌ తదితర అంశాలకు సంబంధించిన విషయమా అన్నది వెల్లడించలేదు. 


సంక్రాంతి సీజన్‌లో రెండు పెద్ద సినిమాలు, ఒక మినిమమ్‌ బడ్జెట్‌ చిత్రం విడుదల చేయడం సహజంగా జరుగుతుంది. రెండు మూడు రోజుల గ్యాప్‌లో ముగ్గురుపెద్ద హీరోల సినిమాలు విడుదల అంటే గట్టి పోటీనే నెలకొంటుంది. పైగా ఫ్యాన్‌ మధ్య కూడా మాటల తూటాలు పేలుతుంటాయి. మరీ 2022 సంక్రాంతి పోటీ కొనసాగుతుందా? లేదా పండగ బరి నుంచి  ఏ హీరో అయిన పక్కకు జరుగుతారా అన్నది చూడాలి. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.