మూడు ముక్కలాట!

ABN , First Publish Date - 2020-08-02T06:33:42+05:30 IST

ఆరేళ్ల క్రితం రాజధాని కూడా లేకుండా విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఆరేళ్ల తర్వాత మళ్లీ మీ రాజధాని ఏది? అంటే చెప్పుకోలేని దుస్థితికి చేరుకుంది. మధ్యలో తళుక్కుమని...

మూడు ముక్కలాట!

అమరావతిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో చంద్రబాబు ప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం స్పష్టంగా, విపులంగా పేర్కొంది. ఇప్పుడు అందుకు అనుగుణంగా జగన్‌ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయాలి. లేదా రైతులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, పైవ్రేటు సంస్థలకు గత ప్రభుత్వం అమరావతిలో ఎకరాకు 50 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వంతున కేటాయించింది. సగటున ఎకరాకు కోటి రూపాయలు అనుకున్నా, ఇందుకు మూడు రెట్లు, అంటే ఎకరానికి మూడు కోట్ల వంతున నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 33 వేల ఎకరాలకుగాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం సేకరించడం ఏంటి? అంటూ అప్పట్లో చాలా మంది రంకెలు వేశారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం 33 వేల ఎకరాల భూమి ఎడారిగా, శ్మశానంగా మారబోతున్నందున ఆనాడు గొంతెత్తినవారు కలుగుల్లో దాక్కోకుండా బయటకు వచ్చి రైతుల పక్షాన పోరాడాలి.


రాజధానిగా అమరావతినే కొనసాగిస్తే కమ్మ సామాజిక వర్గం వారు గరిష్ఠంగా లబ్ధి పొందుతారు అనే అభిప్రాయానికి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారంచేశారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అది అమరావతి కాదు భ్రమరావతి అని, కమ్మరావతి అని ప్రచారం చేశారు. దీనితో ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మి అమరావతితో మానసికంగా అనుసంధానం కాలేకపోయారు. కొందరి కోసమే అమరావతి అన్న భావన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది. ఫలితంగా అమరావతిని చంపుకోవడం వల్ల తామెంతగా నష్టపోతామో గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలా? వద్దా? అనే ప్రశ్నను జగన్‌ అండ్‌ కో లేవదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించిన జగన్‌ ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలను ప్రోత్సహించడానికి కూడా వెనుకాడటం లేదు.


ఆరేళ్ల క్రితం రాజధాని కూడా లేకుండా విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ ఆరేళ్ల తర్వాత మళ్లీ మీ రాజధాని ఏది? అంటే చెప్పుకోలేని దుస్థితికి చేరుకుంది. మధ్యలో తళుక్కుమని మురిపించిన అమరావతి ఉసురు తీయడానికి గవర్నర్‌ శుక్రవారం నాడు రాజముద్ర వేయడంతో మూడు రాజధానులు అనే మూడు ముక్కలాట మొదలైంది. రెడ్డొచ్చె మొదలాడె అని ఎవరన్నారో కానీ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని కథ నిజంగానే మళ్లీ మొదటికొచ్చింది. ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనలతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి, రైతులను ఒప్పించి మెప్పించి 33 వేల ఎకరాలు సమీకరించడంతో పాటు మొత్తంగా దాదాపు 50 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం సిద్ధం చేశారు. అప్పట్లో ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్టు శాసనసభ సాక్షిగా ప్రకటించిన జగన్‌ రెడ్డి ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమరావతి ఆయువు తీయడానికి పావులు కదిపారు. రాజధాని అంటే ఒక ప్రాంతానికో, ఒక సామాజిక వర్గానికో పరిమితం కాకూడదని అంటూ, 13 జిల్లాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మూడు రాజధానుల పేరిట పరిపాలన వికేంద్రీకరణకు పూనుకున్నట్టు ప్రకటించారు. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నప్పటికీ సంబంధిత బిల్లులకు గవర్నర్‌తో రాజముద్ర వేయించుకున్నారు. ఆ వెంటనే రాజధాని తరలింపు ప్రక్రియ ప్రారంభమవుతున్నదని మంత్రులు ప్రకటించారు. గవర్నర్‌ ఆమోదం తెలిపిన రోజును శుభదినంగా జగన్‌ అండ్‌ కో అభివర్ణించగా, రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు అని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాలు నిజంగానే అభివృద్ధి చెందుతాయా? లేక రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలోనే ప్రజలు ఉండిపోతారా? అనేది కాలమే నిర్ణయించాలి. భవిష్యత్తు ఎలా ఉండబోతున్నప్పటికీ మొత్తం ఈ వ్యవహారం ఆంధ్రులు, వారి నాయకుల ఆలోచనా ధోరణులకు అద్దంపడుతోంది. రాజకీయ పార్టీలు తమదైన ఆట ఆడగా.. కుల, మత, ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రజలు తమ మనోవైకల్యాన్ని బయటపెట్టుకున్నారు. అమరావతి కోసం గత ప్రభుత్వం భూ సమీకరణకు పూనుకున్నప్పుడే మేధావులుగా పిలిపించుకుంటున్న వారితో పాటు పలు పార్టీల నాయకులు అంత భూమి అవసరమా అని సన్నాయి నొక్కులు నొక్కారు. రైతులు పైసా ఆశించకుండా స్వచ్ఛందంగా భూములు ఇచ్చినప్పటికీ 33 వేల ఎకరాలను సేకరించడం ఎందుకు అనే ప్రశ్నలు వినిపించాయి. మూడు వేల ఎకరాలలో రాజధాని నిర్మాణాలు చేపట్టి మిగతా ప్రాంతాన్ని సహజంగా అభివృద్ధి చెందడానికి వదిలేస్తే రైతులు ఇవాళ కన్నీరు కార్చాల్సి వచ్చేది కాదని జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు కూడా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది. అప్పటి ప్రభుత్వం ముందుగానే 33 వేల ఎకరాలను సమీకరించి ఉండకపోతే అభివృద్ధి చెందడం మొదలైన తర్వాత భూములు సేకరించడం కష్టమవుతుందన్న వాస్తవాన్ని గుర్తించకపోవడం వల్లనే అంత భూమి అవసరమా అన్న విమర్శలు వినిపించాయి. హైదరాబాద్‌లో కావాల్సినంత ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఆ కారణంగానే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కంపెనీలకు కోరినంత భూమిని రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించాయి. అమరావతిలో కూడా ఇలాంటి వెసులుబాటు ఉండాలన్న ఉద్దేశంతో 50 వేల ఎకరాలను చంద్రబాబు సిద్ధం చేశారు. అయినా భూములిచ్చిన రైతులకు లేని ఇబ్బంది ఈ నాయకులకు ఎందుకో అర్థం కాదు. రైతులిచ్చిన భూములను క్రమంగా అభివృద్ధి చేసి విక్రయించి ఉంటే నిజంగానే అద్భుతమైన రాజధాని నిర్మాణానికి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా నిధులు సమకూరి ఉండేవి. అయినా ఈ అవకాశాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కాలదన్నుకోవడానికి కారణం ఏమిటన్నదే ప్రశ్న. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరిట అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు అండ్‌ కో భారీ భూ కుంభకోణానికి పాల్పడ్డారని జగన్‌రెడ్డి మొదటి నుంచీ ఆరోపిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక ప్రధానమంత్రిని కలిసినప్పుడు ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రస్తావించినట్టు వార్తలొచ్చాయి. తాము ఆరోపిస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై పలు సంస్థలతో విచారణకు ఆదేశించారు కూడా! నిజంగా కుంభకోణం జరిగి ఉంటే ఈ విచారణలో వెల్లడయ్యేది కదా! ఆ విషయం తేలకుండానే అమరావతి ఉసురు తీయడానికి పూనుకున్నారంటే ఇంకేదో నిగూఢ పరమార్థం దాగి ఉండాలి.


విద్వేషాలను రగిల్చి..

అమరావతినే రాజధానిగా కొనసాగిస్తే, చంద్రబాబుకు స్థాన బలం ఉంటుందని జగన్‌ అండ్‌ కో భావించారని చెబుతున్నారు. నిజానికి అందులో కూడా వాస్తవం ఉన్నట్టు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జగన్‌ రెడ్డి అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తే కమ్మ సామాజిక వర్గం వారు గరిష్ఠంగా లబ్ధి పొందుతారు అనే అభిప్రాయానికి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఒక పథకం ప్రకారం అమరావతిపై దుష్ప్రచారంచేశారు. అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అది అమరావతి కాదు భ్రమరావతి అని, కమ్మరావతి అని ప్రచారం చేశారు. దీనితో ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మి అమరావతితో మానసికంగా అనుసంధానం కాలేకపోయారు. కొందరి కోసమే అమరావతి అన్న భావన ప్రజల్లో విస్తృతంగా వ్యాపించింది. ఫలితంగా అమరావతిని చంపుకోవడం వల్ల తామెంతగా నష్టపోతామో గుర్తించలేకపోతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధి చెందాలా? వద్దా? అనే ప్రశ్నను జగన్‌ అండ్‌ కో లేవదీశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకూడదనే ఉద్దేశంతో రాజధానిగా అమరావతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని ప్రకటించిన జగన్‌ ఇప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలను ప్రోత్సహించడానికి కూడా వెనుకాడటం లేదు. కేవలం ప్రభుత్వ కార్యాలయాలను తరలించి పరిపాలనా రాజధాని అని చెప్పుకొన్నంత మాత్రాన విశాఖపట్నం, హైకోర్టుతోపాటు ఇతర న్యాయస్థానాలను నెలకొల్పినంత మాత్రాన కర్నూలు అభివృద్ధి చెందవు అన్న వాస్తవాన్ని ఇప్పుడు ప్రజలు గుర్తించలేకపోతున్నారు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే పైవ్రేట్‌ పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా రావాలి. అలా వచ్చినందువల్లే హైదరాబాద్‌ మహా నగరం గత 25 ఏళ్లలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా అభివృద్ధి చెందింది. మంత్రి కేటీఆర్‌ ఇప్పటికీ పైవ్రేటు పెట్టుబడుల కోసం చేయని ప్రయత్నం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి ఇటువంటి ప్రయత్నం చేస్తారా? అంటే చెప్పలేని పరిస్థితి! అర్ధంతరంగా రాజధానిని మార్చడం వల్ల జగన్‌ ప్రభుత్వ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమవుతుంది. అమరావతి రాజధాని అనుకుని విభజన చట్టానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం అఖిల భారత వైద్య సంస్థ (ఎయిమ్స్‌)ను మంగళగిరిలో ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ సంస్థ పరిస్థితి ఏమిటి? ఎయిమ్స్‌ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నిరుపయోగంగా ఉండిపోదా? అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు కోసం రిజర్వ్‌ బ్యాంక్‌తోపాటు పలు కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలు అక్కడ ప్రభుత్వం నుంచి భూములు కొనుగోలు చేశాయి. ఇప్పుడు వాటి పరిస్థితి ఏమిటి? మేం విశాఖకు తరలివెళ్తున్నాం... మీరు కూడా అక్కడే కార్యాలయాలు ఏర్పాటు చేయండి అని కోరితే ఆయా సంస్థలు ముందుకొస్తాయా? విశాఖలో మాత్రం శాశ్వతంగా పరిపాలనా రాజధాని ఉంటుందన్న గ్యారంటీ ఏముంటుందన్న ప్రశ్న ఎవరికైనా వస్తుంది కదా! కియా వంటి పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి లభించడంతోపాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. సచివాలయాన్ని తరలిస్తే స్థానికులకు ఉద్యోగాలు లభించవు కదా! అయినా అభివృద్ధి వికేంద్రీకరణ అని చెబుతూ ప్రజలను పాలకులు మభ్యపెడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా సమైక్య ఉద్యమం అంటూ అవకాశాలను వదలుకున్నారు. ‘‘విభజన అనివార్యం.. మీకేం కావాలో అడిగి సాధించుకోండి’’ అని నాబోటి వాళ్లు ఎంతగా చెప్పినా ఆంధ్రా నాయకులు, ప్రజలకు ఎక్కలేదు. ఇప్పుడు అమరావతి విషయంలో కూడా చారిత్రక తప్పిదం జరుగుతున్నది. మూడు ముక్కలాటను అడ్డుకోవాలా? లేదా? అనేది వారిష్టం. భూములు ఇచ్చిన రైతులు మాత్రమే ఇప్పుడు కన్నీరు కారుస్తున్నప్పటికీ భవిష్యత్తులో రాష్ట్ర ప్రజానీకం సామూహికంగా విలపించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ దుస్థితిని నిలువరించడమా? లేదా? అన్నది ప్రజల చేతుల్లోనే ఉంది!


పరిహారం తప్పదు!

రాజధానిని మూడు ముక్కలు చేయడానికి ఉద్దేశించిన బిల్లుతోపాటు సీఆర్డీఏ బిల్లుకు గవర్నర్‌ ఆమోదముద్ర వేసినంత మాత్రాన అంతా అయిపోయినట్టేనా? ఈ ప్రశ్నలకు న్యాయ స్థానాలే సమాధానం చెప్పాలి. రైతులతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానికి జగన్‌ కట్టుబడాల్సిన అవసరం ఉందా? లేదా? అన్నది హైకోర్టు నిర్ణయించాల్సి ఉంది. ఇదివరకే వెలువరించిన తీర్పుల ప్రకారం ప్రభుత్వాధి నేతలు మారినంత మాత్రాన గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల బాధ్యత నుంచి ప్రస్తుత ప్రభుత్వాధి నేతలు తప్పించుకోలేరు. దీని ప్రకారం భూములు ఇచ్చిన రైతులతో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒప్పందం కుదుర్చుకుందో, ఏం హామీలను రాతపూర్వకంగా ఇచ్చిందో వాటన్నింటికీ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. అమరావతిని ఎలా అభివృద్ధి చేయబోతున్నారో చంద్రబాబు ప్రభుత్వం రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం స్పష్టంగా, విపులంగా పేర్కొంది. ఇప్పుడు అందుకు అనుగుణంగా జగన్‌ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయాలి. లేదా రైతులకు నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు, పైవ్రేటు సంస్థలకు గత ప్రభుత్వం అమరావతిలో ఎకరాకు 50 లక్షల నుంచి రెండు కోట్ల రూపాయల వంతున కేటాయించింది. సగటున ఎకరాకు కోటి రూపాయలు అనుకున్నా, ఇందుకు మూడు రెట్లు, అంటే ఎకరానికి మూడు కోట్ల వంతున నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన 33 వేల ఎకరాలకుగాను దాదాపు లక్ష కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. అంత మొత్తాన్ని చెల్లించలేని పక్షంలో చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఏడాదికి మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం సేకరించడం ఏంటి? అంటూ అప్పట్లో చాలా మంది రంకెలు వేశారు. ఇప్పుడు జగన్‌ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం 33 వేల ఎకరాల భూమి ఎడారిగా, శ్మశానంగా మారబోతున్నందున ఆనాడు గొంతెత్తినవారు కలుగుల్లో దాక్కోకుండా బయటకు వచ్చి రైతుల పక్షాన పోరాడాలి. ఈ భూమిలో రహదారులు వేయడంతోపాటు పలు భవనాలు నిర్మించినందున అక్కడ వ్యవసాయం చేసే పరిస్థితి కూడా లేదు మరి! అసెంబ్లీ, సచివాలయం, రాష్ట్ర హైకోర్టు భవనాలతోపాటు గతానికి చిహ్నంగా నిలవబోతున్న నిర్మాణంలో ఉన్న పలు కట్టడాల కోసం గత ప్రభుత్వం 10 వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసింది. రాజధానిని తరలిస్తే ఇవన్నీ నిరుపయోగం అవుతాయి కనుక ఖర్చు చేసిన 10 వేల కోట్ల రూపాయల ప్రజాధనానికి ఎవరు బాధ్యత తీసుకుంటారో చెప్పాలి. ఇంత సొమ్మును ఎడారిలో పోసి ఇప్పుడు మళ్లీ పరిపాలనా రాజధాని కోసం త్వరలో శంకుస్థాపన చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కర్నూలులో వంద ఎకరాల్లో అద్భుతమైన హైకోర్టు నిర్మిస్తామని ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రచారం చేసుకుంది. గతంలో చేసిన ఖర్చుకు లెక్క చెప్పకుండా మళ్లీ కొత్త భవనాలకు ఖర్చు చేసే నైతిక అర్హత జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఉందా? అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయినా హైకోర్టును అమరావతి నుంచి తరలించడం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఇందుకు హైకోర్టులో పనిచేస్తున్న మెజారిటీ న్యాయమూర్తులు అంగీకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత సదరు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఇదంతా ఇప్పుడు జరిగేది కాదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అప్పటికి మరో రెండేళ్ల కంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. అంటే వచ్చే ఎన్నికలు జరిగే వరకు ఈ తంతు కొనసాగుతూనే ఉంటుంది. అప్పటివరకు ఒక హైకోర్టు, అసెంబ్లీ మాత్రమే అమరావతి నుంచి పనిచేస్తాయి. ఎలా ఉండాల్సిన రాజధాని ఎలా అయిపోయిందని అప్పుడు కొంత మంది ఆవేదన చెందుతారు. అయినా జగన్‌ రెడ్డికి ఇవేమీ పట్టవు. 


ఆత్మరక్షణలో బీజేపీ!

మొత్తంగా ఈ మూడు ముక్కలాటలో భారతీయ జనతా పార్టీ మాత్రం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నందున రాజధాని తరలింపును బీజేపీ అడ్డుకుంటుందన్న గంపెడాశతో రాజధాని రైతులతోపాటు అమరావతే రాజధానిగా ఉండాలని అభిలషిస్తున్నవారంతా ఆశించారు. నిజానికి రాజధానిని ఎక్కడ పెట్టుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదే. కేంద్రానికి సంబంధం లేదు. పునర్వ్యవస్థీకరణ బిల్లును ప్రతిపాదించిన అప్పటి ప్రభుత్వ పెద్దలు ఏ అధికారంతో రాజధానిని నిర్ణయించడానికి శివరామకృష్ణన్‌ కమిటీ వేశారో తెలియదు. అయితే రాజధానిగా అమరావతి కొనసాగాలని బీజేపీ రాష్ట్ర శాఖ తీర్మానించడంతోపాటు రైతుల ఆందోళనకు సంఘీభావం పలకడం వల్ల ఆ పార్టీ నాయకులపై ప్రజలు నమ్మకం పెంచుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజును పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బీజేపీ అధిష్ఠానం నియమించినప్పుడే ఏదో జరగబోతోందన్న కీడును చాలా మంది శంకించారు. కాకతాళీయం కావచ్చునుగానీ వీర్రాజు నియామకం జరిగిన రెండు రోజులకే బిల్లులపై గవర్నర్‌ సంతకం చేశారు. దీనితో బీజేపీ తమను నమ్మించి మోసం చేసిందని రాజధాని రైతులు ఆక్రోశిస్తున్నారు. రైతుల ఆవేదనలో హేతుబద్ధత లేకపోలేదు. పలు అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్‌ రెడ్డిని అదుపు చేయడం బీజేపీ పెద్దలకు చిటికెలో పని అని ప్రజలు నమ్మారు. నిజం కూడా అంతే! రాజధాని తరలింపు ఆలోచనను విరమించుకో అని బీజేపీ పెద్దలు మౌఖికంగా ఆదేశించినా జగన్‌ రెడ్డి శిరసావహించి ఉండేవారే. ఇలా జరగలేదు అంటే వైసీపీకి, బీజేపీకి లోపాయికారీ అవగాహన ఉందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కూడా బీజేపీ వంచించిందని భావిస్తున్న ప్రజలకు తాజా పరిణామాలు పుండు మీద కారం రాసినట్టయింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అని పలవరించిన జగన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ మాటను ఉచ్చరించడానికి కూడా ఇష్టపడటం లేదు. ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ను కట్టడి చేయగలిగిన బీజేపీ పెద్దలకు రాజధాని తరలింపును అడ్డుకోవడం కష్టం కాదు కదా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాన్ని విభజించడం ద్వారా కాంగ్రెస్‌ అన్యాయం చేయగా, రాజధాని తరలింపును నిలువరించకపోవడం ద్వారా బీజేపీ మోసం చేసింది అని ప్రజలు భావిస్తున్నారు. అయితే ప్రజలు ఎలా అనుకున్నప్పటికీ రాష్ట్రంలో బీజేపీ కొత్తగా నష్టపోయేదేమీ లేదు. రాష్ట్రంలో అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు తమ అదుపులో ఉండాలనే బీజేపీ పెద్దలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో సొంతంగా బలపడే అవకాశాలు సన్నగిల్లడంవల్లనే ఈ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. ఏదేమైనా ఆంధ్రా ప్రజలు వంచనకు గురవుతూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, అందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించడంతో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని పవన్‌ కల్యాణ్‌ నిలదీయగా, ప్రత్యేక హోదా సాధనలో చంద్రబాబు విఫలం అయ్యారని, మెజారిటీ ఎంపీ స్థానాలలో తమ పార్టీని గెలిపిస్తే ప్రత్యేక హోదా తాను సాధించుకువస్తానని జగన్‌రెడ్డి నమ్మబలికారు. ఆ మాటలు నమ్మారో లేదో తెలియదుగానీ 25 స్థానాలకు గాను 22 స్థానాల్లో జగన్‌ పార్టీ అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించారు. అయినా హోదా అంశం గాలికిపోయింది. ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు. ప్రత్యేక హోదా రాకపోగా కేంద్రం ఇవ్వజూపిన ప్రత్యేక ప్యాకేజీని కూడా కాలదన్నుకున్నారు. రాని, లేని హోదా కోసం ఆరాటపడకుండా ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ తీసుకొని లబ్ధి పొందవలసిందిగా నాబోటి వాళ్లు చేసిన హితవులను రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా పెడచెవిన పెట్టారు. ఫలితంగా రెంటికీ చెడ్డ రేవడి అయ్యారు. ఇప్పుడు రాజధాని విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్‌ తనదైన ఆట మొదలెట్టారు. అమరావతిని చంపడం వల్ల 13 జిల్లాలు అభివృద్ధి చెందితే జగన్‌ అండ్‌ కోను అభినందించాల్సిందే! అలా జరగకుండా అమరావతితోపాటు మిగతా ప్రాంతాలు కూడా ఉసూరుమని ఉండిపోతే అందుకు జగన్మోహన్‌రెడ్డి మాత్రమే సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.


ఏమిటీ చిన్న బుద్ధులు?

ఈ విషయం అలా ఉంచితే ప్రజల ఆలోచనలు కూడా పెడదారులు పడుతున్నాయని చెప్పే రెండు ఉదంతాలు ఇటీవల చోటుచేసుకున్నాయి. దేశ సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయ వద్ద చైనా సైన్యానికి చెందిన ముష్కరుల చేతిలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌కుమార్‌కు జాతి మొత్తం నివాళులర్పించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని కొనియాడారు. దేశాన్ని కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేశారని అభినందించారు. అటువంటి వీర జవాన్‌ను కూడా ఒక కులానికే సొంతం అన్నట్టుగా కొంత మంది ప్రచారం చేయడం వెగటు పుట్టించింది. దేశ సరిహద్దులను కాపాడే క్రమంలో వీర మరణం పొందిన కల్నల్‌ సంతోష్‌కుమార్‌ మావాడే అని ఆర్య వైశ్యుల తరఫున కొంతమంది ప్రచారం చేయగా, చిత్తూరు జిల్లాలో తన కుమార్తెలు కాడిపట్టగా పొలం దున్నిన దళిత రైతు నాగేశ్వరరావుకు ట్రాక్టర్‌ పంపి తన ఉదారతను చాటుకున్న ప్రముఖ నటుడు సోనూ సూద్‌ తమవాడేనని మరో కులం వారు ప్రచారం చేసుకోవడం మొదలెట్టారు. పంజాబ్‌కు చెందిన సోనూ సూద్‌ మన పద్మశాలీనే! ఆయన రాష్ట్రానికి ఎప్పుడొచ్చినా ఘన స్వాగతం చెబుదామని పద్మశాలీల తరఫున సోషల్‌ మీడియాలో ఓ పోస్టు ప్రత్యక్షమైంది. కల్నల్‌ సంతోష్‌లో వీరత్వాన్ని, సోనూసూద్‌లో దాతృత్వాన్ని మాత్రమే ఈ దేశం చూసింది. వారిద్దరూ అందరివారు. కానీ కొంతమంది తమ సంకుచిత బుద్ధితో ఆ ఇరువురినీ కూడా కులానికి పరిమితం చేయాలనుకోవడం దారుణం. ప్రజల్లో ఇలాంటి పోకడలను అరికట్టకపోతే సమాజం మరింతగా కుళ్లిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, తెలంగాణలో కూడా కులతత్వం ముదురుతోందనడానికి ఇలాంటి ఉదంతాలు నిదర్శనం!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2020-08-02T06:33:42+05:30 IST