ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్టు

ABN , First Publish Date - 2022-01-25T06:39:41+05:30 IST

తిరుపతి నగరంలో ద్విచక్రవానంపై తిరుగుతూ.. దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ముగ్గురు దారి దోపిడీ దొంగల అరెస్టు
నిందితుల వివరాలు తెలియజేస్తున్న పోలీసులు

75 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు సెల్‌ఫోన్ల స్వాధీనం


తిరుపతి(నేరవిభాగం), జనవరి 24: తిరుపతి నగరంలో ద్విచక్రవానంపై తిరుగుతూ.. దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను ఈస్ట్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. డీఎస్పీ మురళీకృష్ణ, సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తిరుపతిలోని కొర్లగుంట వినాయకనగర్‌కు చెందిన సుంకేశుల చాంద్‌బాష కుమారుడు రహంతుల్లా (27), గోపాల్రాజు కాలనీకి చెందిన లేట్‌ చంద్రశేఖర్‌ కుమారుడు బోయ పవన్‌కుమార్‌ అలియాస్‌ పవన్‌ (20) కొంతకాలంగా దొంగతనాలు చేస్తున్నారు. వీరిద్దరిపై అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలో తొమ్మిది దొంగతనం కేసులున్నాయి. ఈ క్రమంలో రహంతుల్లాకు బంధువైన కడప జిల్లా రైల్వేకోడూరు రంగనాయకులపేటకు చెందిన షేక్‌ సలావుద్దీన్‌ కుమారుడు షేక్‌ హసన్‌ (23)తో కలిసి నగరంలో దారిదోపిడీలకు తెరతీశారు. బైక్‌పై తిరుగుతూ.. జన సంచారంలేని ప్రాంతాల్లో వెళ్తున్న వారిని అటకాయించి, బెదిరించడం.. లేదంటే కొట్టి డబ్బు, సెల్‌ఫోన్లు లాక్కెళ్లడం మొదలుపెట్టారు. కొంతకాలంగా వీరికోసం గాలిస్తున్న పోలీసులు ఎట్టకేలకు సోమవారం ఆర్టీసీ బస్టాండు సమీపంలో గుర్తించి.. అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి ఓ ఇంటి దొంగతనానికి సంబంధించిన 75 గ్రాముల బంగారు ఆభరణాలు, శ్రీనివాసం ఎదుట, రాజన్న పార్క్‌ సమీపంలో దారిదోపిడీ చేసిన మూడు సెల్‌ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నట్టు డీఎస్పీ వివరించారు. నిందితులను పట్టుకున్న ఎస్‌ఐ ప్రకా్‌షకుమార్‌, హెడ్‌కానిస్టేబుళ్లు మునిరాజులు, ప్రభాకర్‌లను ఆయన అభినందించారు. 

Updated Date - 2022-01-25T06:39:41+05:30 IST