‘ఉత్తరం’లో మూడు యూహెచ్‌సీ భవనాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-03T06:09:15+05:30 IST

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆదివారం కొత్తగా మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(యూహెచ్‌సీ) భవనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.

‘ఉత్తరం’లో మూడు యూహెచ్‌సీ భవనాలు ప్రారంభం
43వ వార్డులో ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న మంత్రి రజని, అధికారులు, ప్రజాప్రతినిధులు

మాధవధార/అక్కయ్యపాలెం/జ్ఞానాపురం, అక్టోబరు 2 :  విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆదివారం కొత్తగా మూడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(యూహెచ్‌సీ) భవనాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ముఖ్య అతిథిగా పాల్గొని ఆయా భవనాలను ప్రారంభించారు. 49వ వార్డు బర్మాక్యాంపు ఏఎస్సార్‌ నగర్‌లో మోడల్‌ సచివాలయం పక్కన రూ.99.90 లక్షలతో,  53వ వార్డు మర్రిపాలెం దరి శివనగర్‌ శ్మశానవాటిక రోడ్డులో రూ.99.98 లక్షలతో నిర్మించిన భవనాలను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా  43వ వార్డు అక్కయ్యపాలెం శ్రీనివాసనగర్‌లో దాడి రమణమూర్తి కల్యాణ మండపం భవన సముదాయంలో రూ.23.88 లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రం భవనాన్ని ప్రజల వైద్యసేవల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ భవనాల ప్రారంభ కార్యక్రమంలో కలెక్టరు ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు,  ఉత్తర నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే రాజు,  డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.విజయలక్ష్మి, ఆయా వార్డుల కార్పొరేటర్లు, పలువురు నాయకులు పాల్గొన్నారు.

సుబ్బలక్ష్మీనగర్‌లో..

దక్షిణ నియోజకవర్గం పరిధి జీవీఎంసీ 41 వార్డులోని సుబ్బలక్ష్మీనగర్‌లో రూ.1.03 కోట్లతో నిర్మించిన యూహెచ్‌సీ భవనాన్ని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌, కార్పొరేటర్‌ కొడిగుడ్ల పూర్ణిమ, వైసీపీ నాయకుడు శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T06:09:15+05:30 IST