ఉద్యోగ భారతానికి మూడు మార్గాలు

ABN , First Publish Date - 2021-11-09T06:00:39+05:30 IST

కొత్త సాంకేతికతలు అద్భుతాలను సృష్టించడమే కాదు, అసంఖ్యాకులకు సమస్యలు కల్పించడమూ కద్దు. మానవాళి చరిత్రలో ఇందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నూతన...

ఉద్యోగ భారతానికి మూడు మార్గాలు

కొత్త సాంకేతికతలు అద్భుతాలను సృష్టించడమే కాదు, అసంఖ్యాకులకు సమస్యలు కల్పించడమూ కద్దు. మానవాళి చరిత్రలో ఇందుకు అనేక నిదర్శనాలు ఉన్నాయి. ప్రస్తుతం మనదేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగానికి నూతన సాంకేతికతా విప్లవాలే ప్రథమ కారణం. మోటారుకారు రంగంలోకి వచ్చినప్పుడు గుర్రపుబండ్ల వాళ్లకు కష్టాలు ఆరంభమయ్యాయి. ‘రండి, రండి’ అని పిలిచే ఆ జట్కా వాలాలు ‘పొండి, పొండి’ అనే తిరస్కారాలకు గురయ్యారు. అయితే అచిరకాలంలోనే మోటార్‌కారుల రాకపోకలకు అనువైన రోడ్లు నిర్మాణమయ్యాయి. కార్ల ఉత్పత్తి, వినియోగంలో ఉన్న కార్లకు మరమ్మత్తు పనుల రూపేణా అనేకానేక ఉద్యోగాలు సృష్టి అయ్యాయి. ఆర్థికవ్యవస్థ మొత్తంగా సత్వర అభివృద్ధి సాధించింది. వృద్ధిరేటు పెరుగుదలతో ఉద్యోగావకాశాలు ఇతోధికమయ్యాయి. మోటార్‌కారు యుగంలో రవాణా రంగంలో మొత్తం ఉద్యోగిత గుర్రపు బండ్ల కాలంలో కంటే చాలా చాలా ఎక్కువ. 


ఇదేవిధంగా, ఇప్పుడు రోబో, కృత్రిమ మేధ సాంకేతి కతల మూలంగా లక్షలాది ఉద్యోగాలకు నష్టం వాటిల్లుతోంది. మరి ఈ అధునాతన సాంకేతికతలు కొత్త ఉద్యోగాలను ఏ మేరకు సృష్టిస్తాయన్నది, అది ఆర్థికవ్యవస్థను మొత్తంగా ఏ మేరకు అభివృద్ధి పరుస్తాయన్న దానిపై ఆధారపడి ఉంది. గతంలో వలే కాకుండా ఈ నవీన టెక్నాలజీలు ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు స్వల్ప పెరుగుదలకు, తక్కువ ఉద్యోగాల సృష్టికి, నిరుద్యోగం పెరుగుదలకు మాత్రమే దోహదం చేయవచ్చు. 


నేటి పారిశ్రామిక కార్యకలాపాలలో స్వయంచాలక యంత్రాల (ఆటోమెటిక్ మెషీన్స్) వినియోగం అంతకంతకూ పెరిగిపోతోంది. పెచ్చరిల్లుతున్న నిరుద్యోగానికి ఇది రెండో కారణం. ఆర్థికవ్యవస్థ వృద్ధిరేటు పెరుగుతున్నప్పటికీ కొత్త ఉద్యోగాల సృష్టి పెద్దగా జరగడం లేదు. గతంలో బెల్లం తయారీకి అనేక మంది పనివాళ్లు తప్పనిసరిగా అవసరమయ్యేవారు. ఇప్పుడు ఒక కొత్త చక్కెర ఫ్యాక్టరీలో ఆనాటి పనివాళ్ళలో పది శాతం కంటే తక్కువ మందితోనే, అంతకంటే స్వల్పకాలంలో గతంలో కంటే ఎక్కువ బెల్లం తదితర పదార్థాలను తయారుచేయ గలుగుతున్నారు.


గమనార్హమైన విషయమేమిటంటే కొత్త సాంకేతికతలు అధికసంఖ్యలో కార్మికుల అవసరాన్ని తగ్గిస్తూ అదే సమయంలో ఉద్యోగితను పెంపొందిస్తున్నాయి. ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తి త్వరితగతిన, అధికస్థాయిలో పెరిగినప్పుడు ఉద్యోగాల సృష్టి ఇతోధికమవుతోంది. కార్మిక శ్రేణులలోకి ఏటా భారీసంఖ్యలో ప్రవేశిస్తున్న వారందరికీ అవసరమైన ఉద్యోగాలు కొత్త సాంకేతికతల ద్వారా సమకూరగలవా అన్నది అసలు ప్రశ్న. గతంలో కంటే ఇప్పుడు యువజనులు చాలా పెద్ద సంఖ్యలో కార్మిక విపణిలోకి ప్రవేశిస్తున్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారమే ఏటా 120 లక్షల మంది కొత్తగా కార్మిక శ్రేణులలోకి ప్రవేశిస్తున్నారు. మరి వీరందరికీ అవసరమైన ఉద్యోగాలను సమకూర్చే బాధ్యతను మార్కెట్ శక్తులు సమర్థంగా నిర్వర్తించగలవా? సంపూర్ణ ఉద్యోగితను సాధించేందుకు ప్రభుత్వం మూడు చర్యలను చేపట్టవలసి ఉంది. తొలుత విద్యావిధానంలో మౌలిక సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత విద్యావిధానంలో యువజనులు అత్యధికంగా ప్రభుత్వ కొలువును సాధించేందుకు దోహదం చేసే సర్టిఫికెట్లు, డిగ్రీలు పొందేందుకు మాత్రమే శ్రద్ధ చూపుతున్నారు. ప్రభుత్వోద్యోగుల వేతనభత్యాలు చాలా పెద్ద మొత్తాలలో ఉండడమే దీనికి కారణం. బోధనా నైపుణ్యాలు నాణ్యంగా లేకపోయినా ప్రభుత్వోద్యోగిగా ఉన్న ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడికి నెలసరి వేతనం రూ.70,000దాకా ఉంటుంది. మెరుగైన నైపుణ్యాలు కల ఒక నర్సు లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు ప్రైవేట్ సంస్థల్లో లభించే నెలసరి వేతనం రూ.15,000కి మించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే నేటి యువతీ యువకులు ప్రభుత్వోద్యోగం కోసం ఆరాటపడుతున్నారే గానీ నర్సింగ్ నైపుణ్యాలను అభ్యసించేందుకు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా శిక్షణ పొందేందుకు శ్రద్ధ చూపడం లేదు. కేవలం ఒక సర్టిఫికెట్ లేదా డిగ్రీ కోసం మాత్రమే వారు విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్తమాన ఆర్థికవ్యవస్థకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు యువజనులు ఆసక్తి చూపాలంటే ప్రభుత్వోద్యోగుల వేతనభత్యాలను తగ్గించి తీరాలి. తద్వారా యువజనులలో ఆ ఉద్యోగాల పట్ల మోజును తొలగించాలి. ఇది జరిగినప్పుడు మాత్రమే ప్రైవేట్‌ రంగంలో మంచి ఆదాయంతో కూడిన ఉద్యోగాలు సాధించుకునేందుకు అవసరమైన నైపుణ్యాలను పొందడంలో వారు శ్రద్ధ చూపగలుగుతారు.


సంఘటితరంగ కార్మికచట్టాల నిబంధనలను గణనీయంగా సడలించాలి. ఇది, విధిగా చేపట్టవలసిన రెండో చర్య. పరిశ్రమలలో కార్మికులను తగ్గిస్తూ స్వయం చాలకయంత్రాలను ఉపయోగించుకోవడం ఎక్కువవుతోంది. క్రమశిక్షణను పాటించని, పనిలో సమర్థతను చూపని కార్మికులను తొలగించడమనేది ప్రస్తుత కార్మికచట్టాల కారణంగా అసాధ్యంగా ఉంది. కనుకనే కార్మికుల నియామకాలు, తొలగింపుల్లో తమకు చట్టబద్ధంగా మరింత స్వేచ్ఛ కల్పించాలని పారిశ్రామిక యాజమాన్యాలు కోరుతున్నాయి. 


తూర్పు ఆసియా దేశాల పారిశ్రామిక వ్యవస్థలపై ప్రపంచబ్యాంకు నిర్వహించిన ఒక అధ్యయనంలో కార్మికచట్టాలు అంత కఠినంగా లేని దేశాలలో అధిక సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించడం జరిగినట్టు వెల్లడయింది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని మన ప్రభుత్వం కూడా కార్మికచట్టాల నిబంధనలను సడలించి తీరాలి. అవి, యాజమాన్యాలకు అనుకూలంగా ఉండేట్టు చేయాలి. దీని వల్ల పారిశ్రామికవేత్తలు కంప్యూటర్లు, రోబోల కంటే మానవ శ్రమశక్తినే ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మొగ్గు చూపుతారు. 


చిన్న పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ప్రభుత్వం విధిగా చేపట్టవలసిన మూడో చర్య. పెద్ద పరిశ్రమలలో కంటే చిన్న పరిశ్రమలలో ఉత్పత్తివ్యయం అధికంగా ఉంటుంది. ఈ కారణంగా స్వేచ్ఛావిపణిలో చిన్న పరిశ్రమలు కార్పొరేట్ కంపెనీలతో పోటీపడలేవు. కనుక చిన్న పరిశ్రమలు ఉత్పత్తి చేసే సరుకులపై వస్తుసేవల పన్నును తగ్గించి తీరాలి. ప్రభుత్వం ఇటువంటి సౌలభ్యాన్ని కలిగించినప్పుడు మాత్రమే చిన్నపరిశ్రమలు పెద్దపరిశ్రమలతో సమర్థంగా పోటీ పడగలుగుతాయి. తద్వారా అవి ఇతోధిక అభివృద్ధి సాధించడంతో పాటు ఉద్యోగితను కూడా గణనీయంగా పెంచగలుగుతాయి. 


ప్రభుత్వం ప్రస్తుతం కొత్త ఉద్యోగాల సృష్టి బాధ్యతను మార్కెట్‌కు వదిలివేసింది. అయితే ఇటువంటి విధానాల వల్ల ఏమాత్రం సత్ఫలితాలు సమకూరడం లేదు. ఏటా కార్మిక శ్రేణులలోకి ప్రవేశిస్తున్న 120 లక్షల మంది యువజనులకు ఉద్యోగాలు సమకూర్చే పటిష్ఠ ప్రణాళిక ఏదైనా నీతిఆయోగ్ ఆర్థిక వేత్తల వద్ద ఉందా? ఉందని, నేనైతే భావించడం లేదు.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-11-09T06:00:39+05:30 IST