ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు.. టీడీపీ ఆందోళనలు.. అరెస్టులు

ABN , First Publish Date - 2022-06-26T08:08:00+05:30 IST

ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు.. టీడీపీ ఆందోళనలు.. అరెస్టులు

ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు.. టీడీపీ ఆందోళనలు.. అరెస్టులు

వేదిక వద్ద భారీగా మోహరించిన పోలీసులు

సమీప రహదారుల దిగ్బంధం

సైకో పాలనను నాడే చూపించారు: చంద్రబాబు

అమరావతి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం రాగానే కూల్చివేసిన ప్రజా వేదిక విధ్వంసానికి మూడేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ శనివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కొద్ది రోజులకే వైసీపీ ప్రభుత్వం ప్రజా వేదిక భవనాన్ని కూల్చివేసింది. ఇక్కడి ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి పక్కనే దీనిని టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ నిధులతో నిర్మించారు. అప్పటి విధ్వంసాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేయడానికి ప్రజా వేదిక శిఽథిలాలను సందర్శించి అక్కడ నిరసన నిర్వహించాలని టీడీపీ నేతలు తలపెట్టారు. దీనిని అడ్డుకోవడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. అక్కడకు వెళ్లే అన్ని దారులను శనివారం సాయంత్రం మూసివేసింది. అనేక గంటలపాటు అటువైపు ఏ ఒక్కరినీ వెళ్లనీయకుండా రహదారులను స్తంభింపచేశారు. దీంతో ఉండవల్లి గుహల వైపునుంచి ప్రజా వేదికవైపు వెళ్లే మార్గం వద్ద టీడీపీ నేతలు పలు విడతలుగా ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు, యువత కార్యక్రమాల సమన్వయకర్త రవి నాయుడు ఆధ్వర్యంలో మొదట పెద్ద సంఖ్యలో యువత నేతలు అక్కడకు వచ్చి పోలీసులను తోసుకొని ప్రజా వేదిక వైపు వెళ్లాలని ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకొని తమ వాహనాల్లో అక్కడ నుంచి తరలించారు. గుంటూరు నగరానికి చెందిన రావిపాటి సాయికృష్ణ మరి కొందరు కార్యకర్తలు పొలాల మీదుగా ప్రజా వేదిక వద్దకు చేరుకోగా అక్కడ భారీ సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు వారిని కూడా అదుపులోకి తీసుకొని తరలించారు. ఆ తర్వాత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు నాయకత్వలో పార్టీ నేతలు ఉండవల్లి గుహల వద్దకు చేరుకొని అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసన తెలిపిన వారిలో పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఎమ్మెల్సీలు అశోక్‌ బాబు, మంతెన సత్యనారాయణ రాజు, దివ్యాంగుల కార్పొరేషన్‌ మాజీ చైౖర్మన్‌ గోనెగుంట్ల కోటేశ్వరరావు, పార్టీ నేతలు పిల్లి మాణిక్యాలరావు, కోవెలమూడి నాని, మన్నవ మోహన కృష్ణ, బుచ్చిరాం ప్రసాద్‌, పోతినేని శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వారిని కూడా పోలీసులు అడ్డుకొని నిలిపివేశారు. వారిలో కొందరిని అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌ వద్దకు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తమను పొలాల వైపునకు వెళ్లనీయకుండా అడ్డుకోవడంపై కొందరు రైతులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. 


Updated Date - 2022-06-26T08:08:00+05:30 IST