Kuwait లో అన్నం నీళ్లు లేక నరకం.. ఎలాగోలా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు కానీ.. మూడేళ్లవుతున్నా..

ABN , First Publish Date - 2022-07-28T17:43:47+05:30 IST

ఉన్నఊరిలో ఉపాధి కరువై మన దగ్గర చాలా మంది విదేశాల బాట పడుతుంటారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్లను ఆశ్రయించడం పరిపాటిగా మారుతుంది.

Kuwait లో అన్నం నీళ్లు లేక నరకం.. ఎలాగోలా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు కానీ.. మూడేళ్లవుతున్నా..

మంగళూరు: ఉన్నఊరిలో ఉపాధి కరువై మన దగ్గర చాలా మంది విదేశాల బాట పడుతుంటారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు ఏజెంట్లను ఆశ్రయించడం పరిపాటిగా మారుతుంది. అలాంటి వారి అవసరాన్ని ఏజెంట్లు క్యాష్ చేసుకుంటున్నారు. తప్పుడు పత్రాలతో లేని నియామకాలను సృష్టించి, భారీ వేతనాలు ఆశచూపి తమను ఆశ్రయించిన వారిని విదేశాలకు పంపిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత గానీ అసలు విషయం తెలియదు. ఏజెంట్ చెప్పిన దానికి అక్కడ ఉండే పనికి, వేతనానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక అక్కడికి వెళ్లిన తర్వాత తిరిగి రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న వ్యవహారమే. 


ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే భారత ప్రవాసుల విషయంలో ఇదే జరుగుతుంది. ఏజెంట్ల చేతిలో మోసపోయి చాలామంది అక్కడ నరకయాతన పడే ఘటనలు కొకొల్లలు అనే చెప్పాలి. ఇదే కోవలో కర్నాటకు చెందిన 34 మంది యువకులు ఓ ఏజెంట్ మోసం కారణంగా కువైత్‌లో నరకం అనుభవించారు. 2019లో ఈ ఘటన జరిగింది. అక్కడి నుంచి ఎలాగోలా తిరిగి స్వదేశానికి చేరుకున్న యువకులు తమకు మోసగించిన ఏజెంట్‌పై ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు వారికి న్యాయం జరగలేదు. మూడేళ్లు గడుస్తున్న సదరు ఏజెంట్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. 


వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకు చెందిన 34 మంది యువకులు స్థానిక మాణిక్య అసోసియేట్ పేరిట ఏజెన్సీ నిర్వహిస్తున్న ప్రసాద్ శెట్టి అనే వ్యక్తి ద్వారా 2019లో కువైత్ వెళ్లారు. ఇక్కడి నుంచి వెళ్లేటప్పుడు వారికి నెలకు 40వేల జీతం, మంచి ఉద్యోగాలంటూ ప్రసాద్ శెట్టి కువైత్ పంపించాడు. కానీ, అక్కడికి వెళ్లి ఏడు నెలలు గడిచిన ఆ యువకులకు ఎలాంటి ఉద్యోగాలు దొరకలేదు. దాంతో చేతిలో చిల్లిగవ్వలేక ఆకలి అలమంటించారు. చివరకు తోటి ప్రవాసులు, ఎంబసీ, ధాతల సహాయంతో వారు ఎలాగోలా స్వదేశానికి తిరిగి వచ్చారు. అనంతరం తమను మోసగించిన ఏజెంట్ ప్రసాద్ శెట్టిపై 2019, మే 28 మంగళూరు నార్త్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ వద్ద భారీ మొత్తంలో నగదు తీసుకుని, ఫేక్ జాబ్స్‌తో కువైత్ పంపించాడంటూ ప్రసాద్ శెట్టిపై బాధితులందరూ కలిసి కేసు పెట్టారు. కానీ, వారి కేసు ముందుకు కదలలేదు. ప్రతి నెల వెళ్లి పీఎస్‌లో వాకాబు చేసేవారమని బాధితులలో ఒకరైన ఉస్మాన్ తెలిపాడు. 


ప్రతిసారి పోలీసుల నుంచి కేసు దర్యాప్తు చేస్తున్నామనే సమాధానం వచ్చేదని, కానీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని వాపోయాడు. కువైత్ వెళ్లేందుకు తాము ఒక్కొక్కరం సర్వీస్ చార్జీ కింద రూ.65వేలు, రెండు మెడికల్ చెకప్‌లకు కలిపి 10వేలు ఏజెంట్‌కు చెల్లించినట్లు ఉస్మాన్ చెప్పాడు.  ఇలా 34 మంది ప్రసాద్ శెట్టికి 75వేల చొప్పున చెల్లించామని తెలిపాడు. చివరకు తమకు అక్కడ ఉద్యోగాలు రాకపోగా తిరిగి వచ్చేందుకు కూడా నరకయాతన అనుభవించామన్నాడు. రోజుల తరబడి తిండిలేక, ఉండడానికి సరియైన చోటు దొరకక ఎన్నో ఇబ్బందులు పడినట్లు ఉస్మాన్ చెప్పుకొచ్చాడు. కానీ, ఏజెంట్‌పై ఫిర్యాదు చేసి మూడేళ్లు గడుస్తున్న ఇప్పటికీ తమకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయాడు.     

Updated Date - 2022-07-28T17:43:47+05:30 IST