కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట

ABN , First Publish Date - 2022-07-03T05:50:26+05:30 IST

రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో మూడు ముక్కలాట మొదలయ్యింది.

కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట

- రామగుండంలో మూడు వర్గాలుగా చీలిపోయిన పార్టీ

- టిక్కెట్‌ తమ నేతకే వస్తుందంటూ ప్రచారం

- పోటాపోటీగా బహిరంగ ప్రకటనలు

- వర్గపోరుతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీలో మూడు ముక్కలాట మొదలయ్యింది. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువున్నప్పటికీ ఆ పార్టీ నేతలు వర్గాలుగా విడిపోయి టిక్కెట్‌ విషయమై పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజాసమస్యల పరిష్కారం కోసం, పార్టీ బలోపేతం కోసం కృషి చేయాల్సింది పోయి వ్యక్తిగత ప్రతిష్టలకు దిగుతుండడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో అయోమయం నెలకొన్నది.

 2009లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు మేడారం నియోజకవర్గంలో రామగుండం భాగంగా ఉండేది. అప్పుడు ఈ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వు చేశారు. చివరిసారిగా ఇక్కడి నుంచి 1978లో జరిగిన ఎన్నికల్లో జి ఈశ్వర్‌ గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చెందగా, పునర్విభజన అనంతరం జరిగిన మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీకి కాస్త ఆదరణ పెరుగుతూ వస్తున్నది. వరుసగా రెండుసార్లు గెలుపొంది అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. దీనిని సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పార్టీ బలోపేతం కోసం పనిచేయాల్సిన నేతల్లో టిక్కెట్ల పంచాయతీ మొదలయ్యింది. రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌కే ఈసారి కూడా పార్టీ మొగ్గు చూపుతున్నట్లు కనబడుతున్న నేపథ్యంలో ఐఎన్‌టీయూసీ నేత జనక్‌ ప్రసాద్‌, ఏఐసీసీ సభ్యుడు, టీపీసీసీ ప్రొటోకాల్‌ మెంబర్‌ హర్కార వేణుగోపాల్‌ రావు కూడా టిక్కెట్‌ రేసులోకి వచ్చారు. రెండు మాసాల క్రితం వరకూ అందరు నేతలు పార్టీ కోసం కలిసికట్టుగా పనిచేసినప్పటికీ వారం రోజుల క్రితం జనక్‌ప్రసాద్‌ వర్గానికి చెందిన ఐఎన్‌టీయూసీ నాయకులు వచ్చే ఎన్నికల్లో రామగుండం టిక్కెట్‌ జనక్‌ ప్రసాద్‌కు వస్తుందని ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి చెప్పడంతో వివాదం రాజుకున్నది. అందుకు దీటుగా మక్కాన్‌సింగ్‌ వర్గానికి చెందిన పార్టీ కార్పొరేటర్లు, ఇతర నేతలు ప్రెస్‌ మీట్‌ పెట్టి మక్కాన్‌ సింగ్‌కే టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే హర్కార వేణుగోపాల్‌రావు వర్గీయులు సైతం వేణుగోపాల్‌ రావుకు టిక్కెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకువస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికీ అప్పుడే ఈ టిక్కెట్ల లొల్లి ఏమిటనే చర్చ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో మొదలయ్యింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచే రాజకీయ అరంగేట్రం చేసిన రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ఉమ్మడి ఆంరఽధప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో స్పోర్ట్స్‌ ఆథారిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్‌ పార్టీలో చేరగా, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి 11,387 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచాడు. ఆ ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మక్కాన్‌ సింగ్‌ 2018లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 16,900 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అప్పటినుంచే ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్‌ తనకే వస్తుందనే ధీమాతో ఆయన ముందుకు సాగుతున్నాడు. ఈ తరుణంలో జనక్‌ ప్రసాద్‌, వేణుగోపాల రావులు తెరపైకి రావడం పలు పరిణామాలకు దారి తీసింది. 

- ఐఎన్‌టీయూసీ కోటాలో..

దేశవ్యాప్తంగా 7.30 కోట్ల సభ్యత్వంతో ఉన్న ఐఎన్‌టీయూసీ సమావేశాలు వచ్చే నెలలో బిహార్‌ రాష్ట్రంలో జరగనుండడంతో ఐఎన్‌టీయూసీ కోటాలో తమకు కొన్ని ఎంపీ టిక్కెట్లు, ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేసే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో జనక్‌ప్రసాద్‌ రామగుండం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన వర్గీయులు ఇక్కడి నుంచే టిక్కెట్‌ ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన జనక్‌ ప్రసాద్‌ ప్రస్తుతం జైపూర్‌లో నివాసం ఉంటున్నప్పటికీ సింగరేణిలో ఉద్యోగిగా పనిచేసి ఐఎన్‌టీయూసీ నాయకుడిగా ఎదిగాడు. 30 ఏళ్ల క్రితం బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓటమి చెందారు. ఆ నియోజవర్గం కూడా ఎస్సీలకు రిజర్వు చేయడంతో ఆయన రామగుండం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

- అదిష్ఠానం దృష్టి సారించకపోతే.. 

రామగుండానికి చెందిన హర్కార వేణుగోపాల రావు టీపీసీసీ, ఏఐసీసీల్లో పలు పదవుల్లో కొనసాగుతున్నారు. కొన్నేళ్ల నుంచి ఆయన పార్టీ కోసం పని చేస్తున్నారు. 2009 నుంచి రామగుండం నియోజకవర్గం జనరల్‌కు కేటాయించడంతో అప్పటి నుంచి టిక్కెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, అదే సామాజిక వర్గానికి చెందిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు మంథని టిక్కెట్‌ కేటాయిస్తున్న కారణంగా రామగుండం టిక్కెట్‌ను రెండు దఫాలు మైనార్టీ వర్గానికి చెందిన బాబర్‌ సలీం పాషాకు, ఒకసారి బీసీ వర్గానికి చెందిన మక్కాన్‌ సింగ్‌కు కేటాయించారు. ఈసారి కూడా ఆయనకే టిక్కెట్‌ వస్తుందనే ప్రచారం జరుగుతున్నది. దీంతో జనక్‌ప్రసాద్‌, హర్కార వేణుగోపాల్‌ రావులు ఇద్దరు తమకే టిక్కెట్‌ కావాలని పట్టుబడుతుండడంతో రామగుండం కాంగ్రెస్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఇక్కడి పరిణామాలను గమనించి పార్టీ అధిష్టానం రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దక పోతే నష్టం జరిగే అవకాశాలున్నాయని పార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 


Updated Date - 2022-07-03T05:50:26+05:30 IST