పొదుపు మహిళలు ఓటీఎస్‌ అనాల్సిందే..!

ABN , First Publish Date - 2022-01-12T05:49:09+05:30 IST

ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాం నుంచి గత చంద్రబాబు ప్రభుత్వం వరకు పేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన పక్కా ఇళ్ల రుణాల వసూళ్లకు జగన సర్కారు శ్రీకారం చుట్టింది. గత 35 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు కట్టించిన పక్కా గృహాలకు చెందిన రుణాల వసూళ్ల ప్రక్రియ చేపట్టలేదు. జగన ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్ల తరువాత పేదల ఇళ్ల రుణాలను వసూలు చేసేందుకు ‘వనటైం సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌)’ అంటూ పేరు పెట్టారు.

పొదుపు మహిళలు ఓటీఎస్‌ అనాల్సిందే..!

కట్టకపోతే సంక్షేమ పథకాలు, జీరో వడ్డీ రుణాలు అందవు ?

అవగాహన పేరుతో భయపెడుతున్న అధికారులు

పొదుపు సంఘాల్లో అప్పు తీసుకొని కట్టాలని ఒత్తిడి

జిల్లాలో 4.48 లక్షల మంది గుర్తింపు

మండలానికి 200, మున్సిపాల్టీకి 500 వారీగా టార్గెట్‌

15 వేల మందితో కట్టించాలని లక్ష్యం

ఆసక్తి ఉంటేనే కట్టండని చెబుతూనే ఒత్తిళ్లా..? లబ్ధిదారుల ఆవేదన   

నేడు మెగా ఓటీఎస్‌


కరోనా వల్ల పనుల్లేక పస్తులతో గడపాల్సిన దైన్య పరిస్థితి మాది. బతకడమే భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ప్రభుత్వం కట్టించిన ఇంటికి ఓటీఎస్‌ అంటూ రూ.20 వేలు కట్టమంటున్నారు. మా దగ్గర డబ్బు లేదంటే పొదుపు సంఘాల్లో అప్పు తీసుకొని కట్టాలంటున్నారు. లేదంటే సంక్షేమ పథకాలు రావని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. అప్పు చేసి ఓటీఎస్‌ డబ్బు కడితే.. ఆ అప్పు ఎలా తీర్చాలి..?

       - కడప నగరంలో ఓ అభాగ్యురాలి కన్నీటి వేదన ఇది


జిల్లా అంతటా ఇదే పరిస్థితి. జిల్లా అధికారులు ఓటీఎస్‌ అమలుపై మున్సిపల్‌, మండలాల వారీగా అధికారులకు లక్ష్యాలను నిర్దేశిం చారు. వందశాతం టార్గెట్‌ రీచ అవ్వాలంటూ ఒత్తిళ్లు తీసుకు రావడంతో.. అదే స్థాయిలో మండల అధికారులు తమ కిందిస్థాయి సిబ్బంది, లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఓటీఎస్‌ జాబితాలో ఉన్న పొదుపు మహిళలను లక్ష్యంగా చేసుకొని.. మీ వద్ద డబ్బు లేకపోతే స్వయం సహాయక సంఘాలు లేదా సమాఖ్యలలో రుణాలు ఇప్పిస్తాం.. ఆ డబ్బును ఓటీఎస్‌కు కట్టండి.. కాదు... కూడదంటే ఆ తరువాత మీరే ఇబ్బంది పడతారు? అంటూ అవగాహన పేరుతో భయపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నేడే మెగా ఓటీఎస్‌.. ఆ ముసుగులో పొదుపు మహిళల మెడపై కత్తి పెట్టి బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు.


కడప, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ ప్రభుత్వ హయాం నుంచి గత చంద్రబాబు ప్రభుత్వం వరకు పేదలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించిన పక్కా ఇళ్ల రుణాల వసూళ్లకు జగన సర్కారు శ్రీకారం చుట్టింది. గత 35 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా పేదలకు కట్టించిన పక్కా గృహాలకు చెందిన రుణాల వసూళ్ల ప్రక్రియ చేపట్టలేదు. జగన ప్రభుత్వం వచ్చాక రెండున్నరేళ్ల తరువాత పేదల ఇళ్ల రుణాలను వసూలు చేసేందుకు ‘వనటైం సెటిల్మెంట్‌ (ఓటీఎస్‌)’ అంటూ పేరు పెట్టారు. ప్రభుత్వ నిబంధన ప్రకారం గ్రామీణ ప్రాంతంలో రూ.10 వేలు, మున్సిపాలిటీ, పట్టణాల్లో రూ.15 వేలు, కార్పొరేషన పరిధిలో రూ.20 వేలు చెల్లిస్తే.. లబ్ధిదారుల పేరు రిజిసే్ట్రషన చేసి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆ తరువాత అమ్ముకోవచ్చు.. రిజిసే్ట్రషన పత్రాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. జగన సర్కారు తీసుకొచ్చిన ఓటీఎస్‌పై ప్రతిపక్ష పార్టీలు సహా లబ్ధిదారులు కూడా భగ్గుమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వ పక్కా ఇళ్ల రుణాలు రద్దు చేస్తామని, ఓటీఎస్‌ కట్టవద్దంటూ ఇప్పటికే టీడీపీ ప్రకటించింది. ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గకపోగా.. నేడు మెగా ఓటీఎస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

మండలాలు, మున్సిపాల్టీల వారీగా టార్గెట్‌ 

జిల్లాలో 4.48 లక్షల మంది ఓటీఎస్‌ లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది. అందులో ఇందిరా అవాస్‌ యోజన (ఐఏవై) పథకం కింద ఉచిత ఇళ్లు కట్టించుకున్న వారు 62 వేల మంది ఉన్నారు. వీరు కేవలం రూ.10 చెల్లిస్తే చాలు వారి పేరున రిజిసే్ట్రషన పట్టా ఇస్తారు. మిగిలిన 3.86 లక్షల మంది ప్రభుత్వం నిర్దేశించిన ఓటీఎస్‌ అమౌంట్‌ రూ.10-20 వేలు చెల్లించాల్సిందే. ఇప్పటి వరకు జిల్లాలో లోనింగ్‌ లబ్ధిదారులు 2,600 మంది, నాన లోనింగ్‌ లబ్ధిదారులు 17,400 కలిపి 20 వేల మంది మాత్రమే ఓటీఎస్‌ తీసుకున్నారు. ఇది కేవలం 4.46 శాతమే. సీఎం జగన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓటీఎస్‌ ఆయన సొంత జిల్లాలోనే అమలులో అట్టడుగు స్థాయిలో ఉండడం కొసమెరుపు. దీంతో నేటి మెగా ఓటీఎస్‌ అమలుపై లక్ష్యాలను నిర్దేశించారు. ప్రతి మండలం నుంచి 200, మున్సిపాలిటీ నుంచి 500 మంది, కడప కార్పొరేషనలో 1,000 మంది లబ్ధిదారులు ఓటీఎస్‌ కింద డబ్బులు చెల్లించేలా ఎంపీడీవోలు, మున్సిపల్‌, కార్పొరేషన కమిషనర్లకు టార్గెట్‌ పెట్టారు. దీంతో అధికారులు పొదుపు మహిళలపై ఒత్తిడి తెస్తున్నారు.

అవగాహన పేరుతో ఒత్తిళ్లు

జిల్లాలో 50 మండలాల నుంచి 10 వేల మంది లబ్ధిదారుల నుంచి రూ.10 కోట్లు, 8 మున్సిపాలిటీల్లో 4 వేల మంది లబ్ధిదారుల నుంచి రూ.6 కోట్లు, కడప కార్పొరేషన పరిధిలో వెయ్యి మంది నుంచి రూ.2 కోట్లు కలిపి రూ.18 కోట్లు ఓటీఎస్‌ వసూలు చేసే బాధ్యత గ్రామాల్లో ఎంపీడీవోలకు, పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, మెప్మా ఉద్యోగులు, సిబ్బందికి అప్పగించారు. ఓటీఎస్‌ జాబితాలో పేర్లు ఉన్న పొదుపు మహిళలను లక్ష్యంగా చేసుకొని మెగా ఓటీఎస్‌ టార్గెట్‌ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఓటీఎస్‌ వల్ల కలిగే ప్రయోజనాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం సూచించింది. ఆ ముసుగులో మెప్మా సిబ్బంది పొదుపు సంఘాల సమావేశాలు పెట్టి తప్పకుండా ఓటీఎస్‌ డబ్బులు కట్టాల్సిందే.. మీ వద్ద డబ్బు లేకుంటే పొదుపు సంఘాల్లోనూ, స్వయం సహాయక సంఘాల వార్డు సమాఖ్యల్లో రుణం తీసుకొని కట్టండి.. రుణాలు తీసుకోవడానికి మేమే సహకరిస్తాం అంటూ ఒత్తిడి తెస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా ‘మాకు జిల్లా అధికారులు టార్గెట్‌ ఇచ్చారు.. మేము చెప్పినట్లు వినకపోతే.. ఆ తర్వాత మీ ఇష్టం.. బ్యాంకుల్లో జీరో వడ్డీ రుణాలు, ఇతర పథకాలు మీకు రావు..?’ అంటూ భయపెడుతున్నారని కడప నగరానికి చెందిన ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మా పేర్లు బయటకు చెబితే మరింత వేధింపులకు గురి చేస్తారని, ఇదెక్కడి న్యాయం అంటూ ఆమె కన్నీరు పెట్టారు. అసలే కరోనా వల్ల రెండేళ్లుగా చేద్దామంటే పనులు లేవు.. పస్తులతో కాలం గడపాల్సిన ధైన్య పరిస్థితి మాది. అప్పు చేసి ఓటీఎస్‌ డబ్బు కడితే రిజిసే్ట్రషన పట్టా ఇస్తారు. ఆ అప్పు ఎలా తీర్చాలి..?  రిజిసే్ట్రషన పట్టా తాకట్టు పెట్టి పొదుపు సంఘంలో చేసిన అప్పు కట్టవచ్చు. తాకట్టు రుణం సకాంలో కట్టకపోతే వడ్డీలకు వడ్డీలు పెరిగి ఉన్న ఇంటిని కూడా వదులుకోవాల్సి వస్తుందని ఏకరువు పెట్టారు. మా పేరు బయట పెడితే వేధింపులు మరింతగా ఎక్కువవుతాయని కన్నీరు పెట్టిందంటే ఓటీఎస్‌ ఒత్తిళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే తెలుస్తోంది. కడప నగరంలోనే కాదు.. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందని తెలుస్తోంది.


పొదుపులో అప్పు ఇప్పిస్తామని చెప్పాం

- రామ్మోహనరెడ్డి, మెప్మా పీడీ, కడప 

ఓటీఎస్‌ వల్ల కలిగే ప్రయోజనాలను పొదుపు మహిళలకు అవగాహన కల్పించాం. చేతిలో డబ్బు లేకపోతే పొదుపు సంఘాలు, స్వయం సహాయక సంఘాల సమాఖ్యల్లో రుణాలు ఇప్పిస్తామని చెప్పాం. అంతేతప్ప ఎవరినీ ఒత్తిడి చేయలేదు.

Updated Date - 2022-01-12T05:49:09+05:30 IST